Pattabhi Arrest: టీడీపీ నేత పట్టాభి అరెస్ట్.. తలుపులు బద్దలుకొట్టి మరీ ఇంట్లోకి వెళ్లిన పోలీసులు..
అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య వాక్ యుద్ధం కొనసాగుతోంది. మరోవైపు టీడీపీ నేత పట్టాభిని పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు.
TDP leader Pattabhi Arrest: ఏపీలో అధికార వైఎస్సార్ సీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య వాగ్వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఏపీ టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిని విజయవాడ పటమట పోలీసులు బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు. అనంతరం భారీ బందోబస్తు మధ్య పోలీసులు వాహనంలో గవర్నర్ పేటకు తరలిస్తున్నట్లు సమాచారం. అరెస్ట్ చేస్తున్న సమయంలో పట్టాభి ఇంటి వద్ద హైడ్రామా కొనసాగింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేత పట్టాభి మంగళవారం అనుచిత వ్యాఖ్యలు చేయడం.. ఆపై టీడీపీ నేతలు, ఆఫీసులపై దాడులు జరగడం తెలిసిందే.
అరెస్ట్ చేసే సమయంలో ఎఫ్ఐఆర్ కాపీ అడిగితే చూపించలేదని పట్టాభి భార్య ఆరోపించారు. 153, 120 బి తదితర సెక్షన్ల కింద అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పారని పట్టాభి భార్య మీడియాకు తెలిపారు. తన భర్త ఎలా వెళ్లారో అలాగే ఇంటిికి రాకపోతే ఏపీ ప్రభుత్వం, పోలీసులు బాధ్యత వహించాలన్నారు. తలుపులు బద్దలు కొట్టుకుని వచ్చి మరీ తన భర్తను అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఎలాంటి గాయాలు లేవని, అరెస్ట్ తరువాత తనకు గాయాలు అయితే పోలీసులు, ప్రభుత్వానిదే బాధ్యత అని పట్టాభి అన్నారు.
Also Read: నిన్నటి వరకూ బూతులు .. ఇప్పుడు దాడులు ! ఏపీ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారాయా ?
పట్టాభిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ముందుగానే ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా నేటి ఉదయం నుంచి భారీ ఎత్తున పోలీసు బలగాలను పట్టాభి ఇంటి వద్ద మోహరించారు. పట్టాభిని అరెస్ట్ చేస్తారని భావించిన టీడీపీ శ్రేణులు సైతం తామేం తక్కువ కాదన్నట్లు టీడీపీ నేత ఇంటికి చేరుకోవడం మొదలుపెట్టారు. కానీ పోలీసులు వారిని అడ్డుకుని నిలిపివేశారు. పరిస్థితి అదుపులో ఉందనుకున్న సమయంలో పట్టాభి ఇంటికి చేరుకున్న పోలీసులు మైక్‌లో అనౌట్స్ చేశారు.
Also Read: అంతా చంద్రబాబే చేశారు.. వైసీపీ మంత్రులు, నేతల ఘాటు విమర్శలు!
పట్టాభి ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో తలుపులు కొట్టారు. అయినా ఏ స్పందన లేకపోవడంతో పోలీసులు తలుపులు బద్ధలుకొట్టుకుని మరీ ఇంట్లోకి వెళ్లి పట్టాభిని అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. టీడీపీ శ్రేణులు పట్టాభి అరెస్టును అడ్డుకునే ప్రయత్నం చేయడంతో కాసేపు అక్కడ హైడ్రామా నడిచింది. ఉద్దేశపూర్వకంగానే ఏపీ ప్రభుత్వం టీడీపీ నేతలను అరెస్ట్ చేస్తుందని ప్రతిపక్ష పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.
Also Read: చేతకాని దద్దమ్మలే తిడతారు.. తిడితే ఇక ముందు అదే రియాక్షన్ వస్తుందని సజ్జల హెచ్చరిక !