Minister Ambati Rambabu : పథకాలు ఇవ్వాలంటే లంచం చెల్లించాల్సిందేనా?, మంత్రి అంబటిని ప్రశ్నించిన మహిళ
Minister Ambati Rambabu : సంక్షేమ పథకాలు మంజూరు చేయాలంటే లంచాలు అడుగుతున్నారని ఓ మహిళ మంత్రి అంబటి రాంబాబును ప్రశ్నించారు. ఎవరు లంచం అడిగారో రాసిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు.
Minister Ambati Rambabu : ఏపీలో అధికార వైసీపీ చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఒకింత ఇబ్బందిగానే సాగుతోంది. ప్రజలు తమ సమస్యలపై ఎమ్మెల్యేలు, మంత్రులను నిలదీస్తున్నారు. అయితే ప్రశ్నిస్తున్న వాళ్లు ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలని నేతలు అంటున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే కొందరు నేతలు మెల్లగా అక్కడి నుంచి జారుకుంటుంటే, మరికొందరు నోరు జారుతున్నారు. తాజాగా మంత్రి అంబటికి మరో చేదు అనుభవం ఎదురైంది. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెంలో మంత్రి అంబటి రాంబాబు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. సంక్షేమ పథకాలు అందాలంటే లంచాలు అడుతున్నారని ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెం ఎస్సీ కాలనీకి చెందిన రుద్రపాటి అంజమ్మ అనే మహిళ మంత్రి అంబటి రాంబాబును ప్రశ్నించారు.
లంచం అడిగారని మహిళ ఫిర్యాదు
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మంత్రి అంబటి ఈ కాలనీకి వచ్చారు. అమ్మఒడి పథకం కోసం వాలంటీర్ లంచం తీసుకున్నారని, డ్వాక్రా రుణానికి రూ. 2 వేలు లంచం ఇచ్చానని అంజమ్మ మంత్రితో తెలిపారు. ఈ విషయాన్ని కాగితంపై రాసిస్తే ఎవరు లంచం అడిగారో వారిపై చర్యలు తీసుకుంటానని మంత్రి చెప్పడంతో అంజమ్మ ఫిర్యాదు పత్రం అందజేశారు.
మీరొస్తున్నారనే బ్లీచింగ్ చల్లారు
మీరొస్తున్నారని ఈ రోజే బ్లీచింగ్ చల్లారు. రహదారులు, డ్రైనేజీలను శుభ్రం చేయడం లేదంటూ స్థానికులు మంత్రికి ఫిర్యాదు చేశారు. రోజూ బ్లీచింగ్ చల్లాలా అని ఎంపీపీ భర్త రామలింగారెడ్డి గట్టిగా మాట్లాడబోగా, నువ్వు ఆగవయ్యా అంటూ మంత్రి రాంబాబు నిలువరించారు. గ్రామానికి చెందిన ఎం. లలిత తమకు రైతుభరోసా ఆగిపోయిందని, తాము పొలం సాగు చేస్తున్నా ఎందుకు నిలిపేశారని ప్రశ్నించారు. ఆమె భర్త విద్యుత్తుశాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి కావడంతో రైతుభరోసా నిలిపివేశారని అధికారులు తెలిపారు. మొత్తానికి మంత్రి అంబటి రాంబాబుకు సొంత నియోజకవర్గంలో షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు స్థానికులు.
ఇటీవల మరో ఘటన
మంత్రి అంబటి రాంబాబుకు తన సొంత నియోజకవర్గంలో ఇటీవల చేదు అనుభవం ఎదురైంది. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో సోమవారం రాజుపాలెం గ్రామానికి వెళ్లిన మంత్రిని మహిళలు సమస్యలపై నిలదీశారు. గెలిచిన మూడేళ్లకు గుర్తొచ్చామా అని ప్రశ్నించారు. తమ సమస్యలు పరిష్కరించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేయండంతో అంబటి అసహనం వ్యక్తంచేశారు. అయితే మహిళలు తిరగబడడంతో మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోయారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి అంబటి రాంబాబుకు నిరసన సెగతగిలింది. పల్నాడు జిల్లా రాజుపాలెంలో మంత్రి అంబటి సోమవారం పర్యటించారు. పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుని మూడేళ్లు అయిన రాలేదని ఓ దివ్యాంగురాలు మంత్రిని నిలదీశారు. పక్కనే ఉన్న అధికారులు వాళ్ల ఇంటికి వెళ్లి నాలుగు విద్యుత్ మీటర్లు ఉన్న కారణంగా పింఛన్ మంజూరు కాలేదన్నారు. దీంతో మంత్రి సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుండగా ఆమె తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : Gorantla Madhav : ఏపీలోనూ ఉప ఎన్నిక ఖాయమా ? గోరంట్లతో రాజీనామా చేయిస్తారా ?
Also Read : శాపనార్థాలు, తిట్ల దండకాలు- ప్రజల ముందు నోరు జారుతున్న సిక్కోలు నేతలు