YSRCP News: నా పార్టీ నేతల నుంచి నాకు ప్రాణ హాని.. రాష్ట్రంలో ఎవ్వరికీ రక్షణ లేదు.. వైసీపీ నేత వ్యాఖ్యలు
డిసెంబరు 12న ఓ కార్యక్రమంలో సుబ్బారావు గుప్తా మాట్లాడుతూ.. మంత్రులు కొడాలి నాని, అంబటి రాంబాబు, ఎమ్మెల్యే వల్లభనేని వంశీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
ఒంగోలుకు చెందిన వైఎస్ఆర్ సీపీ నేత సోమిశెట్టి సుబ్బారావు గుప్తా సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీకి చెందిన నేతల నుంచి తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఢిల్లీకి వచ్చిన ఆయన జంతర్ మంతర్ వద్ద కాసేపు ధర్నా చేశారు. విలేకరులు ప్రశ్నించగా.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసేందుకు తాను ఢిల్లీ వచ్చినట్లు చెప్పారు. తన ఇంటి మీద లాడ్జిలో దాడి చేసిన వారిని, దాడి చేయించిన వారిని కఠినంగా శిక్షించాలని అమిత్ షాను కలిసి విజ్ఞప్తి చేస్తానని సుబ్బారావు గుప్తా తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో అందరి మీద దాడులు చేస్తున్నారని, ఏ ఒక్కరికీ రక్షణ లేకుండా పోతుందని సుబ్బారావు గుప్తా వ్యాఖ్యలు చేశారు. గతంలో తనపై దాడి చేసిన వారిని ఇప్పటికీ అరెస్టు చేయలేదని అన్నారు. తనపై గతంలో జరిగిన దాడికి కారణమైన మంత్రులను బర్తరఫ్ చేయాలని సుబ్బారావు డిమాండ్ చేశారు. వారిని తాను వదిలి పెట్టబోనని హెచ్చరించారు.
గతేడాది డిసెంబరు 12న ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరావు పుట్టిన రోజు సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో సుబ్బారావు గుప్తా మాట్లాడుతూ.. మంత్రి కొడాలి నాని, అంబటి రాంబాబు, వల్లభనేని వంశీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ముగ్గురు నేతల వల్ల పార్టీకి తీరని నష్టం కలుగుతోందని అన్నారు. వారు తమ నోటిని అదుపులో ఉంచుకోకపోతే వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టమని కూడా మాట్లాడారు.
దీంతో ఆయన వ్యాఖ్యలు కొడాలి నాని, బాలినేని, వల్లభనేని అనుచరులకు కోపం తెప్పించింది. వారి అనుచరులుగా భావిస్తున్న వారు సుబ్బారావు గుప్తా ఇంటిపై దాడి చేశారు. ఆ తర్వాత గుంటూరులో ఓ లాడ్జీలో ఉన్న సుబ్బారావు గుప్తాపై దాడి చేసి బలవంతంగా క్షమాపణలు చెప్పించారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో సుబ్బారావు గుప్తాపై దాడిచేసిన బాలినేని అనుచరుడు సుభానిని అరెస్ట్ చేసి తర్వాత బెయిలుపై విడుదల చేశారు. ఈ నేపథ్యంలో గుప్తా ఢిల్లీలో ప్రదర్శన నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
దాడి జరిగిన నాటి నుంచి సుబ్బారావు గుప్తా దూకుడు కొనసాగించారు. సొంత పార్టీని టార్గెట్ చేస్తూ వచ్చారు. తనకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. తాను గొడవలకు దూరమని.. కాకపోతే తన కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు. తనకు గన్ మెన్‌లను కూడా ప్రభుత్వం కేటాయించాలని కోరారు.