Normon And Foster : ఏపీ ప్రభుత్వం నుంచి బిల్లులు ఇప్పించండి - సుప్రీంకోర్టులో నార్మన్ ఫోస్టర్స్ పిటిషన్ !
ఏపీ ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని సుప్రీంకోర్టులో నార్మన్ ఫోస్టర్స్ సంస్థ పిటిషన్ దాఖలు చేసింది. మధ్యవర్తిత్వం చేసి బకాయిలు చెల్లించాలని కోరింది
Normon And Foster : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడం లేదని ప్రపంచ ప్రసిద్ద ఆర్కిటెక్ట్ సేవల కంపెనీ నార్మన్ అండ్ ఫోస్టర్స్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తమకు రావాల్సిన బిల్లులను మధ్యవర్తిత్వం ద్వారా ఇప్పించాలన పిటిషన్‌లో కోరింది. నార్మన్ అండ్ పోస్టర్ కంపెనీ పిటిషన్ వేయగా విచారణకు స్వీకరించింది. అధికారంలోకి రాగానే అమరావతి నిర్మాణాన్ని జగన్ పక్కన పెట్టారు. నిర్మాణాలు నిలిపివేశారు. కాంట్రాక్టర్లకు కూడా బిల్లులు చెల్లించడం లేదు. దీంతో పనులు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. దీంతో తమకు రావాల్సిన నిధుల కోసం నార్మన్ అండ్ పోస్టర్ కంపెనీ నోటీసులు ఇవ్వగా... పోస్టర్ కంపెనీ నోటీసులను జగన్ సర్కార్ పట్టించుకోలేదు. దీంతో నార్మన్ అండ్ పోస్టర్ కంపెనీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
అమరావతికి ఆకృతులు అందించిన లండన్‌కు చెందిన నార్మన్ ఫోస్టర్స్
గత ప్రభుత్వం రాజధాని అమరావతి నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. డిజైన్లు రూపొందించడంలో అంతర్జాతీయ స్థాయి కంపెనీలను సంప్రదించింది. ప్రపంచంలోనే నెంబర్ వన్‌గా ఉన్న లండన్‌లోని నార్మన్ ఫోస్టర్స్ కంెపనీ అమరావతికి ఓ రూపు తెచ్చేందుకు అంగీకరించింది. అమరావతిలోని పరిపాలనా నగరానికి మాస్టర్ ఆర్కిటెక్ట్‌గా వ్యవహరిస్తూ దాని మాస్టర్‌ప్లాన్‌తో పాటు అసెంబ్లీ, హై కోర్టు సహా సచివాలయ సముదాయానికి డిజైన్లను అందజేసింది. గవర్నమెంట్ కాంప్లెక్స్‌లో ప్రధాన భవనమైన సచివాలయ సముదాయ డిజైన్లను రూపొందించే బిడ్‌కూడా నార్మన్ ఫోస్టరే దక్కించుకుంది.
అమరావతి నిర్మాణం నిలిపివేతతో బిల్లుల చెల్లింపు ఆపేసిన జగన్ ప్రభుత్వం
పలుమార్లు నార్మన్ ఫోస్టర్స్ సంస్థ ప్రతినిధులు అమరావతికి వచ్చి డిజైన్లు ప్రదర్శించారు. లండన్ కు వెళ్లి ఆ సంస్థ కార్యాలయాన్ని అప్పటి ముఖ్యమంత్రితో పాటు సీఆర్డీఏ అధికారులు కూడా సందర్శించి అమరావతి నిర్మాణాలు డిజైన్లను పరిశీలించారు. మార్పు చేర్పులు చేశారు. ప్రపంచంలో ఎన్నో నగరాలను డిజైన్ చేసిన అనుభవం ఉన్న నార్మన్ ఫోస్టర్స్ సేవలు ఖరీదైనవి. ఒప్పందం ప్రకారం చేయాల్సిన చెల్లింపులు గత మూడేళ్లుగా చేయలేదు. ప్రస్తుత ప్రభుత్వం ప్రాధాన్యతాంశాల్లో అమరావతి లేదు. అధికారంలోకి రాగానే సీఎం జగన్ అమరావతి నిర్మాణాన్ని పూర్తి స్థాయిలో నిలిపివేశారు. అదే సమయంలో కాంట్రాక్టర్లకు.. ఇలా ఆర్కిటెక్ట్ సేవలు అందించిన వారికి కూడా ఎలాంటి బిల్లులు చెల్లింపులు చేయలేదు.
మధ్యవర్తిత్వం ద్వారా బిల్లులు ఇప్పించాలని నార్మన్ ఫోస్టర్స్ పిటిషన్
ఈ కారణంగా తమకు బిల్లులు రావాల్సిన వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ ప్రభుత్వం స్పందించకపోవడంతో కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఇలా నార్మన్ ఫోస్టర్స్ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే మధ్యవర్తిత్వం వహించి తమ డబ్బులను తమకు ఇప్పించాలని నార్మన్ ఫోస్టర్స్ కోరుతోంది . ఈ విషయంలో ప్రభుత్వ వాదనేమిటో స్పష్టత లేదు. సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసినందున ఈ సంస్థలు చెల్లింపుల విషయంలో తమ అభ్యంతరాలేమిటో వెల్లడించే అవకాశం ఉంది. ఇటీవల హైకోర్టు అమరావతి నిర్మాణాన్ని కొనసాగించాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ నిర్ణయంలో ఏమైనా మార్పులంటే కోర్టుకు తెలిపే అవకాశం ఉంది.