Srikakulam: మా ఊర్లోకి ఎవరూ రావొద్దు.. ఒకవేళ వస్తే.. పది రోజులు ఇక్కడే
డిసెంబర్ 4 నుంచి డిసెంబర్ 14 వరకు ఆ ఊరికి ఎవరు వెళ్లకూడదు. అనుకోకుండా వెళ్తారని.. ఊరి బయట ఫ్లెక్సీలు కూడా పెట్టారు. ఇవాళ్టితో పదిరోజులు పూర్తయ్యాయి.
మనం దేశంలో ఎన్నో సంప్రదాయాలు, ఎన్నో ఆచారాలు ఉన్నాయి. కొన్ని సంప్రదాయాలు పూర్వకాలం నుంచి.. పాటిస్తూనే ఉంటారు. అలాంటి ఆచారాన్నే కొనసాగిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని సీతంపేట మండలం.. జరడకోలనీ గ్రామస్థులు. ఇక్కడ గ్రామదేవత ఉత్సవంలో భాగం ఇది. ఈ ఉత్సవం 10 రోజులపాటు జరుగుతుంది. గ్రామంలోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని, గ్రామం సుభిక్షంగా ఉండాలని చెప్పి గ్రామదేవతకు పూజలు చేస్తారు.
ఈ పదిరోజులు ఎవరూ మా ఊరికి రావొద్దు అంటూ.. జరడకోలనీలో ఆచారం ఉంది. పదిరోజుల పాటు బయటి వ్యక్తులు గ్రామంలోకి రాకుండా ఆంక్షలు విధిస్తారు అక్కడి పల్లె వాసులు. గ్రామంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. యజ్జరోడు, దీసరోడు, జన్నోడులుగా పిలుచుకునే.. ఇక్కడి స్థానిక వ్యక్తులు నక్షత్ర బలం ప్రకారం ఆయా రోజుల్లో అమ్మవారికి పూజలు నిర్వహిస్తారు. వారి భాషలో ప్రత్యేక మంత్రాలు చదువుతూ పూజలు చేస్తారు.
ఎప్పటి నుంచి ఈ ఆచారాలు ఉన్నాయో తెలియదు కానీ...గ్రామస్తులంతా కష్టాలు తొలిగిపోయి సుఖంగా ఉండాలని ఈ రోజుకీ పాటిస్తున్నట్లు గ్రామస్థులు చెబుతారు. ఈ నెల 4నుంచి 14వరకూ పదిరోజుల పాటు ఈ పూజలు సాగాయి. ఈ రోజుతో పూజలు ముగియనున్నాయి. గ్రామదేవతల పూజల్లో భాగంగా.. మొదటి రోజున గ్రామ శివారున ఉన్న సందమ్మ, రెండో రోజున అమ్మవారికి, మూడో రోజున గ్రామ పితృదేవతలకు మొక్కులు తీర్చారు. ఒకవేళ బయటి వ్యక్తులు గ్రామంలోకి వస్తారేమోనని సందేహంతో గ్రామానికి నలువైపులా ఫ్లెక్సీలు కట్టారు.
ఒకవేళ కచ్చితంగా గ్రామంలోకి ఎవరైనా రావాలనుకుంటే రావొచ్చని.. కానీ పదిరోజులు ముగిసే వరకూ తిరిగి వెళ్లకూడదని చెబుతారు స్థానికులు. అక్కడి స్థానికుల సహకారంతో దూరం నుంచి విజువల్స్ తీసేందుకు అనుమతినిచ్చారు గ్రామస్థులు. అమ్మవారికి నిష్టగా చేసే పూజలు కావటంతో బయటి వ్యక్తులను రానివ్వమని తమ సంప్రదాయాలను గౌరవించాలని కోరుతున్నారు.
Also Read: Anantapur Petrol Bunks :పెట్రోల్ కోసం కర్ణాటకకు చలో చలో.. మూతపడుతున్న బోర్డర్‌లోని ఏపీ బంకులు !
Also Read: పీఆర్సీ పెంపుపై ఉద్యోగ సంఘాలతో సజ్జల భేటీ... సీఎం జగన్ న్యాయం చేస్తారని హామీ
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి