MLA About CM Jagan: జగన్ ఇక జన్మలో సీఎం కాలేరు! వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు
సీఎం జగన్ కి ధనదాహం తీవ్రమైందని విమర్శించారు ఎమ్మెల్యే మేకపాటి. రుషికొండలో భవనాలను సరదాగా కట్టుకున్నట్టుగా ఉందన్నారు. దివంగత నేత వైఎస్సార్ కు ఉన్న గుణగణాలేవీ జగన్ కు రాలేదని విమర్శించారు.
![MLA About CM Jagan: జగన్ ఇక జన్మలో సీఎం కాలేరు! వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు Ysrcp suspended mla Mekapati sensational comments against AP CM YS Jagan DNN MLA About CM Jagan: జగన్ ఇక జన్మలో సీఎం కాలేరు! వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/25/65a2a06baae0bf8a07efbfe72ce8cdc61703511262030473_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యేలందరూ సీఎం జగన్ ని ఆడిపోసుకోవడం లేదు. ఆ మాటకొస్తే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అసలు జగన్ పేరెత్తడంలేదు. తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. స్థానికంగా పాదయాత్రలు చేస్తూ జనంలోకి వెళ్తున్నారు. ఉండవల్లి శ్రీదేవి కూడా జగన్ ని పెద్దగా విమర్శించడంలేదు. తన సీటు కోసం ఆమె టీడీపీ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆనం రామనారాయణ రెడ్డి పరిస్థితి ఎటూ తేలకుండా ఉంది. ఆయన కనీసం నియోజకవర్గాన్ని ఇంకా ఖాయం చేసుకోలేదు, అసలు జనంలోకే పెద్దగా రావడం లేదు. ఎన్నికల ప్లానింగ్ కి దూరంగా ఉన్నారు. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మాత్రం జగన్ విషయంలో బాగా హర్ట్ అయ్యారు. టికెట్ ఇవ్వలేమని తనకు ముందే చెప్పేయడంతో ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు. ఇప్పుడు సీఎం జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.
జగన్‌ను గెలిపించి మనం తప్పు చేశామని అంటున్నారు ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. కడపలో నిర్వహించిన మాజీ మంత్రి వీరారెడ్డి వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, ఇతర టీడీపీ నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే మేకపాటి మాత్రం సీఎం జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఎమ్మెల్యేగా నాలుగు సార్లు గెలిచినా, తన గ్రాఫ్ బాగా లేదంటూ సీఎం జగన్ కించపరిచారని గుర్తు చేశారు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. ఉదయగిరిలో తాను డబ్బులు వసూలు చేశానని జగన్ చెప్పారని, అసలు ఉదయగిరిలో ఏముందని సంపాదించడానికి? అని ప్రశ్నించారు. పార్టీ బలోపేతం కోసం ఎంతో శ్రమించానని, లేనిపోని అనుమానాలతో తనకు టికెట్ లేదని చెప్పారని, ఇప్పుడా టికెట్ ని అమ్మకానికి పెట్టారని ఆరోపించారు. అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రాన్ని జగన్ సర్వనాశనం చేశారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఎటుచూసినా అభివృద్ధి అనేదే లేదని, జగన్ చుట్టూ ఉండేవారు, సలహాదారులు ఎవరికివారు దోచుకునేవాళ్లేనని మండిపడ్డారు. బటన్లు నొక్కడమే పనిగా పెట్టుకొని రాష్ట్రాన్ని జగన్ నాశనం చేశారని విమర్శించారు.
సీఎం జగన్ కి ధనదాహం తీవ్రమైందని విమర్శించారు ఎమ్మెల్యే మేకపాటి. రుషికొండలో భవనాలను సరదాగా కట్టుకున్నట్టుగా ఉందన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఉన్న గుణగణాలేవీ జగన్ కు రాలేదని విమర్శించారు. ఏపీలో అక్రమ కేసులు, అన్యాయాలను ఇక భరించలేమన్నారు. జగన్ ఇక జన్మలో ముఖ్యమంత్రి కాలేరని తేల్చి చెప్పారాయన. జగన్ లాంటి వారు రాష్ట్రాన్ని పాలిస్తే ప్రజలు బాగుపడరని, మరింత అప్పుల్లో కూరుకుపోతారని చెప్పారు. ఏపీలో ఈసారి టీడీపీ ప్రభుత్వం రాకపోతే ప్రజలంతా గుండు కొట్టించుకోవాల్సిందేనన్నారు.
ఏపీలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల సీట్ల వ్యవహారం ఇప్పుడు హైలైట్ అవుతుంది కానీ.. ఆయన సీటివ్వలేను అని చాన్నాళ్ల క్రితమే ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి తేల్చి చెప్పారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేకపాటి విప్ ధిక్కరించి వ్యతిరేక ఓటు వేసి జగన్ ఆగ్రహానికి గురయ్యారు. పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. అప్పటినుంచి ఆయన టీడీపీతో కలసి నడుస్తున్నారు. ఇటీవల అధికారికంగా టీడీపీ కండువా కప్పుకున్నారు. అప్పటినుంచి సీఎం జగన్ పై విమర్శల డోసు మరింతగా పెంచారు. సీఎం జగన్ జీవితంలో ముఖ్యమంత్రి కాలేరంటూ శాపనార్థాలు పెడుతున్నారు. వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యేలలో సీఎం జగన్ ని ఘాటుగా తిడుతున్న నేత ఈయనే కావడం విశేషం.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)