(Source: ECI/ABP News/ABP Majha)
గంజాయి కేసులో సుబ్బారావు గుప్తా అరెస్ట్- కుట్రపూరితంగా ఇరికించారంటున్న నిందితుడు
ఇటీవల బాలినేని అనుచరుడు ఓ మహిళా హాస్టల్ పై దాడి చేసిన సమయంలో కూడా గుప్తా ఆరోపణలు చేశారు. సరిగ్గా మూడు రోజుల తర్వాత గుప్తా గంజాయి కేసులో అరెస్ట్ అయ్యారు
ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఆమధ్య సోమిశెట్టి సుబ్బారావు గుప్తా పేరు మారుమోగింది. ఒంగోలుకు చెందిన వైసీపీ నాయకుడు గుప్తా బాలినేని శ్రీనివాసులరెడ్డిపై చేసిన కామెంట్లు, ఆ తర్వాత ఆయనపై జరిగిన దాడి, అనంతరం రాజీ.. అన్నీ హాట్ టాపిక్ గానే మారాయి. అయితే ఇప్పుడు మళ్లీ గుప్తా పేరు మారుమోగిపోయింది. ఎందుకంటే అప్పటినుంచీ బాలినేని వ్యవహారంలో కాస్త అంటీ ముట్టనట్టు ఉన్న గుప్తా, ఇటీవల మళ్లీ రెచ్చిపోయారు. ఆయన రెచ్చిపోతే అది విశేషం కాదు, ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేయడం, అది కూడా గంజాయి కేసులో అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది.
బాలినేనితో అంతేనా..?
బాలినేనిని ఢీకొట్టేంత పెద్దనాయకుడు కాకపోయినా, సోమిశెట్టి సుబ్బారావు గుప్తా ఎందుకో ఎదురు తిరిగారు. ఆయనపైనే కామెంట్లు చేశారు, చివరకు దాడి జరిగినా కూడా ఆయన మారలేదు. ఇప్పుడు పోలీసులు గంజాయి కేసు పెట్టడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఒంగోలులో వాహనాలు తనిఖీ చేస్తుండగా 1.05 కేజీల గంజాయితో ఆయన పట్టుబడినట్లు ఒంగోలు డీఎస్పీ నాగరాజు చెబుతున్నారు. అయితే ఈ అరెస్ట్ పై సుబ్బారావు గుప్తా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనకు గంజాయితో ఎలాంటి సంబంధం లేదని, ఎవరో కుట్రపూరితంగా ఈ కేసులో ఇరికించారని అంటున్నారు గుప్తా. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరుగుతోందని, ఇందులో కుట్ర కోణాన్ని సైతం పరిశీలనలోకి తీసుకుంటామని డీఎస్పీ పేర్కొన్నారు.
2021 డిసెంబర్‌లో అప్పటికి మంత్రిగా ఉన్న బాలినేని శ్రీనివాసులరెడ్డి జన్మదినం సందర్భంగా సభ నిర్వహించి చీరల పంపిణీ కార్యక్రమాన్ని సుబ్బారావు గుప్తా చేపట్టారు. అప్పటికే కొడాలి నాని, వల్లభనేని వంశీ చంద్రబాబుపై ఓ రేంజ్ లో ఫైరవుతున్నారు. వారు మాట్లాడిన వ్యాఖ్యల్ని, వారి భాషపై అదే సభలో గుప్తా అభ్యంతరం వ్యక్తం చేశారు. అలానే మంత్రి పదవి వచ్చిన తర్వాత వెంట తిరిగినవారు మాత్రమే అనుచరులు కాదని పరోక్షంగా బాలినేనికి కౌంటర్ ఇచ్చారు. మొదటి నుంచి అనుసరించిన వారికి గుర్తింపు ఇవ్వాలని కోరారు గుప్తా. అప్పట్లో ఆ వీడియోలు కలకలం రేపడంతో అదే రోజు రాత్రి గుప్తా ఇంటిపై కొందరు దాడి చేశారు. ఆ తర్వాత ఆయన గుంటూరులో తేలారు.
గుంటూరులోని ఓ లాడ్జిలో ఉన్న సుబ్బారావు గుప్తాపై బాలినేని అనుచరులు కొంతమంది దాడి చేశారు. దాన్ని ఫోన్ లో చిత్రీకరించి వైరల్ చేశారు. అప్పట్లో గుప్తా బాలినేనికి సారీ కూడా చెప్పారు. అయితే ఆ తర్వాత తనపై దాడికి కారణం అయిన వారిని అరెస్టు చేయాలని గుప్తా డిమాండ్ చేశారు. ఆ తర్వాత గుప్తాను ఓసారి పోలీసులు అరెస్ట్ చేశారు. పొట్టి శ్రీరాములు విగ్రహ ప్రతిష్ట విషయంలో కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లిన గుప్తా, తనను దూషించారని మేయర్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అరెస్టు చేశారు. బెయిల్‌పై వచ్చిన తర్వాత కూడా గుప్తా తిరుగుబాటు అజెండా మార్చుకోలేదు. బాలినేనితో పాటు ద్వితీయ శ్రేణి నాయకులపై కూడా గుప్తా ఆరోపణలు గుప్పించేవారు.
ఇటీవల బాలినేని అనుచరుడు ఓ మహిళా హాస్టల్ పై దాడి చేసిన సమయంలో కూడా గుప్తా ఆరోపణలు చేశాడు. సరిగ్గా మూడు రోజుల తర్వాత గుప్తా గంజాయి కేసులో అరెస్ట్ కావడం విశేషం. ప్రస్తుతం కేసు విచారణ దశలో ఉందనీ, దర్యాప్తులో అన్ని విషయాలు వెల్లడవుతాయని డీఎస్పీ నాగరాజు చెప్పారు. రెండేళ్ల క్రితం అక్రమ మద్యంకేసులో గుప్తా సెబ్ అధికారులకు పట్టుబడ్డారు. ఈ కేసులో అతను ఏ-3గా ఉన్నాడు. అయితే ఈ కేసుతో తన భర్తకు ఏ సంబంధం లేదని గుప్తా భార్య ఆరోపిస్తున్నారు. కావాలనే ఎవరో ఈ కేసులో ఆయనను ఇరికించారన్నారు. అధికార పార్టీ నాయకులెవరూ తమకు సహకరించడంలేదన్నారు.