వివాదాల్లోకి లాగొద్దంటూనే అనిల్ కాంట్రవర్సీ స్టేట్‌మెంట్- లోకేష్, ఆనంపై ఘాటు విమర్శలు
"ఒరే పప్పుగా, నువ్వు మగాడివైతే రా జిల్లాలోనే ఉన్నావ్ కదా, టైమ్ చెప్పు, ప్లేస్ చెప్పు మనిద్దరం చర్చకు కూర్చుందాం.." అంటూ నారా లోకేష్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు అనిల్.
నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ చాలా రోజుల గ్యాప్ తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్‌కి ముందురోజు ఆయన సిటీ నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం పెట్టుకున్నారు. ఆ సమావేశంలో సొంత పార్టీ నేతలపై మండిపడిన అనిల్, శనివారం మాత్రం పూర్తిగా టీడీపీని టార్గెట్ చేశారు. నెల్లూరు జిల్లాలో యువగళం యాత్ర చేస్తున్న నారా లోకేష్ పై మండిపడ్డారు.
"అరే పప్పుగా.. అసలు నువ్వు పాదయాత్ర చేస్తున్నావట్రా.. జగన్ పాదయాత్ర చేస్తే ఉదయం 9నుంచి సాయంత్రం ఐదున్న వరకు ప్రజల్లో కలసి ఉండేవారు. నీకు భాష రాదు, మంగళగిరిని మందళగిరి అంటావ్.. ఒరే పప్పుగా, నువ్వు మగాడివైతే రా జిల్లాలోనే ఉన్నావ్ కదా, టైమ్ చెప్పు, ప్లేస్ చెప్పు మనిద్దరం చర్చకు కూర్చుందాం.." అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు అనిల్.
తాను జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మూడేళ్లలో రెండేళ్లు కరోనాతోనే సరిపోయిందని, అయినా కూడా ప్రాజెక్ట్ లు పూర్తి చేసేందుకు శాయశక్తులా కృషి చేశానన్నారు అనిల్ కుమార్ యాదవ్. గతంలో చంద్రబాబు నెల్లూరు బ్యారేజ్‌కి నాలుగుసార్లు వచ్చారని, కానీ వారి హయాంలో పనులు పూర్తి కాలేదన్నారు. వైసీపీ హయాంలోనే నెల్లూరు, సంగం బ్యారేజ్ పూర్తి చేశామని, జగన్ ఆశీస్సులతో తానే ఆ పని పూర్తి చేశానన్నారు.
ఆనంపై విసుర్లు..
వైసీపీకి దూరమై, లోకేష్‌తో కలసి నడుస్తున్న ఆనం రామనారాయణ రెడ్డిపై కూడా తీవ్ర విమర్శలు చేశారు అనిల్ కుమార్ యాదవ్. జగన్ దయతో ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయం ఆనం గుర్తు పెట్టుకోవాలన్నారు. అసలు ఆనం కుటుంబానికి ఇంకా చరిత్ర మిగిలి ఉంది అనుకుంటే అది ఆనం విజయ్ కుమార్ రెడ్డి వల్లేనని చెప్పారు. ఆనం రామనారాయణ రెడ్డి గురించి అందరూ మరచిపోయారని చెప్పారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడు ఆనం నెల్లూరు జిల్లాకు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో ఆనం వెంకటగిరిలో పోటీ చేసినా, ఆత్మకూరులో పోటీ చేసినా, చివరకు నెల్లూరు వచ్చినా కూడా గెలవడం అసాధ్యమని చెప్పారు అనిల్.
వాళ్లంతా స్క్రాప్..
నెల్లూరు జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడినంత మాత్రాన తమకేం నష్టం లేదన్నారు అనిల్. అసలు ఆ ముగ్గురూ పార్టీని వీడి వెళ్లిపోలేదని, అదంతా స్క్రాప్ అని తామే ఆ ముగ్గుర్ని విసిరేశామని చెప్పారు. ఆనంకు సిగ్గు, శరం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
నెల్లూరు జిల్లాలో మళ్లీ వైసీపీ జయకేతనం ఎగురవేస్తుందని చెప్పారు అనిల్ కుమార్ యాదవ్. ఎవరెన్ని యాత్రలు చేసినా వైసీపీకి వచ్చే నష్టమేమీ లేదన్నారు. ఆత్మీయ సమావేశంలో తమ కష్టసుఖాలు చెప్పుకున్నామని, ఇప్పటి వరకూ ఏమైనా గ్యాప్ ఉంటే భర్తీ చేసుకుంటామని, ఇకపై అందరం కలసి వెళ్తామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తన గెలుపు ఖాయమన్నారు అనిల్. అనవసరంగా తనను కాంట్రవర్సీల్లోకి లాగొద్దని, తాను వివాదాలకు దూరంగా ఉండాలనుకుంటున్నానని చెప్పారు అనిల్. లోకేష్, ఆనంపై అనిల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెల్లూరులో సంచలనంగా మారాయి.