పవన్‌ను నమ్ముకున్న నిర్మాతలు సూసైడ్ చేసుకునేలా ఉన్నారు - ఎమ్మెల్యే అనిల్ సీరియస్ కాామెంట్స్
తప్పు చేసిన వారికి మహిళా సీఐ బుద్ధి చెబితే పవన్ కి నొప్పేంటని అన్నారు ఎమ్మెల్యే అనిల్. నిలకడలేని వ్యక్తి రాష్ట్రానికి అవసరమా అని ప్రజలు పవన్ గురించి ఆలోచిస్తున్నారని విమర్శించారు.
సీఐ అంజూ యాదవ్ విషయంలో పవన్ కల్యాణ్ వైఖరిపై మరోసారి మండిపడ్డారు నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. విధి నిర్వహణలో మహిళా సీఐ చేసిన దాంట్లో తప్పేముందని ప్రశ్నించారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన సీఐ ఆందళనకారులకు బుద్ధి చెబితే, పవన్ యువతను రెచ్చగొడుతూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తప్పు చేసిన వారికి మహిళా సీఐ బుద్ధి చెబితే పవన్ కి నొప్పేంటని అన్నారు. నిలకడలేని వ్యక్తి రాష్ట్రానికి అవసరమా అని ప్రజలు పవన్ గురించి ఆలోచిస్తున్నారని విమర్శించారు.
చంద్రబాబుని ఏదో ఒక విధంగా అధికారంలోకి తెచ్చేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారని అన్నారు అనిల్. వాలంటీర్లలో అత్యధిక శాతం మహిళలే ఉన్నారని, కరోనా సమయంలో కూడా వారి సేవలు అద్భుతం అని కొనియాడారు అనిల్. వారిని పవన్ అవమానించడం సరికాదన్నారు. వాలంటీర్లలో ఎక్కువమంది మహిళలు ఉన్నారని, వారిని పవన్ అవమానించారని, ఇప్పుడు మహిళా సీఐపై కూడా పవన్ తన అక్కసు వెళ్లగక్కారని అన్నారు. మహిళా లోకంపై పవన్ కి కోపం ఉందని, అందుకే ఇలా చేస్తున్నారని అన్నారు. పవన్ వ్యవహారాన్ని మహిళలు, బీసీలు చూస్తున్నారని మండిపడ్డారు.
పవన్ బైక్ ర్యాలీలో ఎవ్వరూ హెల్మెట్లు పెట్టుకోలేదని, వెర్రి ఫ్యాన్స్ ని రెచ్చగొడుతూ, ఊగిపోతూ ప్రసంగాలిస్తూ పవన్ తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు అనిల్. జగ్గూదాదా, జగ్గూభాయ్ అంటూ సీఎం జగన్ పై పవన్ చేసిన వ్యాఖ్యల్ని ఆయన ఖండించారు. పవన్ ని అనడానికి చాలా ఉన్నాయని, వారిని అంటే మాత్రం నానాయాగీ చేస్తారని, వారు మాత్రం ఇతరులపై ఆరోపణలు చేయొచ్చా అని ప్రశ్నించారు అనిల్.
ముందు వారి సంగతి చూడు..
పవన్ కల్యాణ్ తో సినిమాలు మొదలు పెట్టిన నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారని, ఏఎం రత్నం టెన్షన్ పడుతున్నారని, సినిమా ఆగిపోయిందని బాధ పడుతున్నారని చెప్పారు అనిల్. ముందు పవన్ కల్యాణ్ వారి సంగతి చూడాలని, వారికి న్యాయం చేయాలన్నారు. ఏఎం రత్నం సూసైడ్ స్టేజ్ లో ఉన్నారని, ముందు వారికి పవన్ న్యాయం చేయాలన్నారు. సినిమాల్లో ఉన్న పవన్ కల్యాణ్, రాజకీయాలను ప్రాఫిటబుల్ బిజినెస్ గా భావించి ఇందులోకి వచ్చారని చెప్పారు అనిల్. సినిమాల్లో పవన్ ఎంత బాగా నటిస్తారో, బయట కూడా అలాగే నటిస్తారని అన్నారు. సినిమాల్లో ఉన్నప్పుడు చిరంజీవిని పొగిడిన పవన్, రాజకీయాల్లోకి వస్తే మాత్రం తాను కానిస్టేబుల్ కొడుకుని అని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కానిస్టేబుల్ కొడుకు కాబట్టి పవన్ కల్యాణ్ సినిమాలు ఎవరూ చూడలేదని, చిరంజీవి తమ్ముడు కాబట్టే ఆయనకు కౌంటర్ల వద్ద టికెట్లు చిరిగాయని గుర్తు చేశారు అనిల్.
పవన్ అభిమానులు సోషల్ మీడియాలో ట్రోల్ చేసుకోడానికి పనికొస్తారు కానీ, ఆ పార్టీ వల్ల కానీ, పవన్ వల్ల కానీ ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. చదువు పోగొట్టుకుని అభిమానులు పవన్ కోసం తిరగడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదన్నారు. పవన్ వెనక తిరిగే అభిమానులకు కూడా అనిల్ సలహా ఇచ్చారు. ఉడుకు రక్తంలో ఏమీ తెలియదని, రక్తం చల్లబడ్డాక తిరిగి చూసుకుంటే ఏమీ ఉండదన్నారు. 175 సీట్లలో పోటీ చేయలేని వ్యక్తి సీఎం ఎలా అవుతారని ప్రశ్నించారు అనిల్.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial