కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని
2024లో టీడీపీ నుంచి పోటీ చేస్తున్నానని కోటంరెడ్డి మాట్లాడిన ఆడియో విన్నామని దాని తర్వాతే నిర్ణయం తీసుకున్నామని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి చెప్పారు.
ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో వైఎస్సార్ సీపీ అధిష్టానం ఆగ్రహానికి గురైన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎపిసోడ్ వైసీపీలో ముగిసిపోయిందనే చెప్పాలి. త్వరలో నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి వైసీపీ ఇన్ ఛార్జ్ ని నియమించనున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు వైసీపీ నెల్లూరు జిల్లా రీజనల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ కోటంరెడ్డి ఆరోపణలలో వాస్తవం లేదన్నారు. నాలుగైదురోజుల కిందట తాము కలిశామని, అప్పుడు చెప్పకుండా ఇప్పుడు మీడియా ముందు చెప్పడం సరికాదన్నారు. ఆయన ఫోన్లు ఎవరూ ట్యాప్ చేయలేదని, ఆయనతో మాట్లాడిన వ్యక్తే రికార్డ్ చేసి ఇచ్చారన్నారు. టీడీపీతో టచ్ లో ఉన్న కోటంరెడ్డి వైసీపీపై నిందలేయడం దేనికన్నారు. పార్టీ మారిన తర్వాత ఆయన బాధపడక తప్పదన్నారు.
కోటంరెడ్డి అలా చేసి ఉండాల్సింది..
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ముందు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకొచ్చి ఉండాల్సిందన్నారు మంత్రి బాలినేని. జిల్లా మంత్రి కాకాణికి కానీ, సీఎం జగన్ కి కానీ ఆయన చెప్పలేదు. ఆయన టీడీపీలోకి వెళ్ళేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని బాలినేని అన్నారు. 2024లో టీడీపీ నుంచి పోటీ చేస్తున్నానని కోటంరెడ్డి మాట్లాడిన ఆడియో విన్నామని దాని తర్వాతే పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో మాట్లాడకుండానే కోటంరెడ్డి ఇలాంటి ఆరోపణలు చేస్తారా అని ప్రశ్నించారు. వెళ్ళేవాడు వెళ్లకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం తగదన్నారు.
పదవులెవరిచ్చారు..?
కోటంరెడ్డి విద్యార్థి దశనుంచి రాజకీయాలు చేస్తున్నా.. ఆయనకు ఎమ్మెల్యే టికెట్ పదవి వచ్చింది వైసీపీ హయాంలోనే అని గుర్తు చేశారు బాలినేని శ్రీనివాసులరెడ్డి. పదవులిచ్చి, గుర్తింపు తెచ్చిన పార్టీని వదిలిపెట్టి వెళ్లడం సరికాదన్నారు. కోటంరెడ్డి నిర్ణయం తీసేసుకున్నాడు కాబట్టి.. బయటికెళ్లిన తర్వాతే ఆయన పార్టీ బలమేంటో తెలుసుకోగలుగుతారని చెప్పారు. బయటకు వెళ్లాక తన తప్పేంటో తెలుసుకుంటారని ఘాటుగా వ్యాఖ్యానించారు.
అంత ఫ్రీహ్యాండ్ ఇస్తే ఇలా చేస్తారా..?
నెల్లూరు రూరల్ నియోజకవర్గం విషయంలో ఎవరినీ వేలు పెట్టనీయకుండా కోటంరెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చామని గుర్తు చేశారు బాలినేని. రూరల్ నియోజకవర్గంలో వైసీపీ స్ట్రాంగ్ గా ఉందన్నారు. ఇక్కడి నుంచి వెళ్ళాక ఆయనకు ఏం తప్పు చేశాడో తెలుస్తుందన్నారు. ఫోన్ ట్యాపింగ్ జరగలేదని, పార్టీనుంచి బయటకు వెళ్లేందుకే కోటంరెడ్డి, ఆనం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు.
త్వరలో రూరల్ కి ఇన్ ఛార్జ్..
వెంకటగిరికి ఇన్ చార్జ్ ని పెట్టినట్టే, త్వరలో నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి వైసీపీ ఇన్ చార్జ్ ని ప్రకటిస్తుందన్నారు బాలినేని. ఎవరున్నా లేకున్నా వైసీపీ గెలిచి తీరుతుందని చెప్పారు. రూరల్ ఇన్ చార్జ్ ఎవరనేది ఒకటి రెండు రోజుల్లో తెలుస్తుందని, దానిపై మంత్రి కాకాణి, జిల్లా పార్టీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కసరత్తు చేస్తారని తెలిపారు.
తమ్ముడి సంగతి ఇదీ..
శ్రీధర్ రెడ్డి తమ్ముడు గిరిధర్ రెడ్డికి పార్టీ ఇన్ చార్జ్ పదవి ఇస్తారనే ప్రచారంపై కూడా స్పందించారు బాలినేని. శ్రీధర్ రెడ్డే.. తన తమ్ముడు గిరిధర్ రెడ్డిని పార్టీ దగ్గరకు పంపించారని, తమ్ముడికి ఇన్ చార్జ్ పదవి ఇస్తే అన్న పాలిటిక్స్ నుంచి తప్పుకుంటారని మాట్లాడారని చెప్పారు. అయితే దానికి పార్టీ ఒప్పుకోలేదని, కోటంరెడ్డి వ్యవహారం బయటపడిన తర్వాత ఇక వారికి పార్టీలో చోటు లేదన్నట్టుగా మాట్లాడారు బాలినేని.