ఇది పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రజల దశాబ్దాల కలను సాకారం చేసే ప్రతిష్టాత్మక ప్రాజెక్టు. కరవు, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు కృష్ణా నది జలాలను తరలించడం దీని ముఖ్య ఉద్దేశ్యం.
Who is Pula Subbaiah: ఎవరీ పూల సుబ్బయ్య? వెలిగొండ ప్రాజెక్టుకు ఆయన పేరు ఎందుకు పెట్టారు?
తీవ్ర కరువు, ఫ్లోరైడ్ బాధితుల దాహార్తిని తీర్చడానికి కమ్యూనిస్టు నేత పూల సుబ్బయ్య పోరాటం చేశారు. అందుకే వెలిగొండ ప్రాజెక్టుకు ఆయన వేసిన పునాది భవితరాలు గుర్తించుకునేలా ప్రాజెక్టుకు పేరు పెట్టారు.

- పశ్చిమ ప్రకాశం ఫ్లోరైడ్, కరువుకు కృష్ణా జలాలు కీలకమయ్యాయి.
- పూల సుబ్బయ్య కృష్ణానది జలాల మళ్లింపునకు జీవితాంతం పోరాడారు.
- నల్లమల సొరంగాల ద్వారా జలాలు తరలించాలని బృహత్తర ఉద్యమం నడిపారు.
- ఆయన కృషికి గుర్తింపుగా వెలిగొండ ప్రాజెక్టుకు పేరు పెట్టారు.
Who is Pula Subbaiah: ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల రంగానికి సంబంధించిన చరిత్రను పరిశీలిస్తే ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు కనిపిస్తాయి. అయితే, వాటిలో పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రజల దశాబ్ధాల కలల సాకారమైన వెలిగొండ ప్రాజెక్టు అత్యంత విశిష్టమైంది. దశాబ్ధాలుగా ఫ్లోరైడ్ రక్కసి కోరల్లో చిక్కుకుని, కనీసం తాగడానికి చుక్క నీరు లేక, వ్యవసాయానికి సాగునీరు అందక నరకయాతన అనుభవించిన ఆ కరవు నేలకు కృష్ణా నది జలాలను తరలించే ఒక మహా యజ్ఞమే ఈ ప్రాజెక్టు. నల్లమల అటవీ ప్రాంతంలో దట్టమైన కొండలను తొలిచి, అద్భుతమైన ఇంజినీరింగ్ నైపుణ్యంతో నిర్మించిన సుదీర్ఘమైన ట్విన్ టన్నెల్స్ ద్వారా శ్రీశైలం ఫోర్షోర్ నుంచి నీటిని మళ్లించే ఈ భారీ ప్రాజెక్టు పేరు వినగానే తెలుగు ప్రజల మదిలో మెదిలే ఏకైక పేరు - పూల సుబ్బయ్య.
ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం అంటేనే కరవు కాటకాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచేది. ముఖ్యంగా మార్కాపురం, యర్రగొండుపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శి ప్రాంతాల్లో తీవ్రమైన నీటి కొరత ఉండేది. తాగడానికి కనీసం గుక్కెడు మంచినీరు దొరక్క ప్రజలు అల్లాడిపోయేవారు. నీటి కోసం వందల అడుగుల లోతుకు బోర్లు వేసినప్పటికీ, ఆ బోరు బావుల నుంచి వచ్చే నీటిలో ప్రమాదకరమైన స్థాయిలో ఫ్లోరైడ్ మూలకాలు ఉండటం ఆ ప్రాంత ప్రజలకు శాపంగా మారింది.
ఈ విషపూరితమైన ఫ్లోరైడ్ నీటిని తాగడం వల్ల చిన్న వయసులోనే పిల్లల పళ్లు పసుపు రంగులోకి మారిపోయేవి. ఎంతో మంది ప్రజలు ఎముకల బలహీనతతో కాళ్లు చేతులు వంకర్లు పోయి శారీరక వైకల్యానికి గురయ్యేవారు. గ్రామానికి గ్రామాలే వికలాంగుల ఆవాసాలు దర్శనమిచ్చేవి.
ఆ ప్రాంత ప్రజల ఘోరమైన కష్టాలను, వారి శారీరక నరకయాతనను కళ్లారా చూసిన పూల సుబ్బయ్య పరిష్కార మార్గాల కోసం వెతికారు. కృష్ణా నదీ జాలలను తమ మెట్ట ప్రాంతానికి తరలించడమే మేలని నమ్మారు. శ్రీశైలం జలాశయం నిండిన ప్రతీసారి వరద నీరు వృథాగా సముద్రంలోకి కలిసిపోతుందని గ్రహించి వాటిని నల్లమల కొండల అవతలి వైపు ఉన్న తమ కరవు పీడిత ప్రాంతాలకు మళ్లించవచ్చని పట్టుబట్టారు.
అసలు ఎవరీ పూల సుబ్బయ్య?
పూల సుబ్బయ్య సీపీఐకు చెందిన ఈ అగ్రనేత అత్యంత సాధారణ, నిరుపేద కుటుంబంలో జన్మించారు. చిన్నతనం నుంచే నిరుపేదల సమస్యలను చూస్తూ పెరిగిన ఆయన, విద్యార్థి దశ నుంచి ప్రజా సమస్యలపై గళమెత్తారు.
ఆయన నిబద్ధను గుర్తించిన ప్రజలు ఆయనను తమ ప్రతినిధిగా ఎన్నుకున్నారు. గిద్దలూరు, మార్కాపురం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఆయన శాసనసభలో ఎమ్మెల్యేగా అడుగు పెట్టారు. ఎమ్మెల్యేగా పని చేసినప్పటికీ పూల సుబ్బయ్య తనకంటూ ఆస్తులు సంపాదించుకోలేదు. సాధారణ ప్రజల కంటే సింపుల్‌గా జీవించారు. పశ్చిమ ప్రకాశం మెట్ట ప్రాంత ప్రజల దాహార్తిని తీర్చడమే ధ్యేయంగా ఆయన తన జీవితాంతం పాదయాత్రలు, ధర్నాలు చేశారు. అసెంబ్లీ లోపల, వెలుపల కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు. నల్లమల దట్టమైన అడవుల గుండా భారీ సొరంగ మార్గాలను తవ్వ, కృష్ణా జలాలలను నిల్వ చేసే వెలిగొండ ప్రాజెక్టు ప్రాథమి రూపురేఖలను దశాబ్దాల క్రితమే ఊహించి ప్రతిపాదించిన అద్భుత దార్శనికుడు.
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పశ్చిమ ప్రకాశం జిల్లాకు కృష్ణా నది నీటిని మళ్లించడం సాధారణ విషయం కాదు. ఈ రెండు ప్రాంతాల మధ్య దట్టమైన నల్లమల కొండలు ఆటంకంగా నిలిచాయి. అయితే, ఆ కొండలను తొలిచి రాతి గుహల గుండా నీటిని తీసుకెళ్లాలనే విప్లవాత్మకమైన ఇంజనీరింగ్ ఆలోచనను పూల సుబ్బయ్య ముందుకు తెచ్చారు.
ఈ భారీ ప్రాజెక్టు అసాధ్యం కాదని, శాస్త్రీయంగా సాధ్యమేనని నిరూపించడానికి పూల సుబ్బయ్య ప్రకాశం జిల్లాలోని ప్రతి గ్రామాన్ని కాలినడకన చుట్టి వచ్చారు. గ్రామీణ ప్రజలను చైతన్యపరుస్తూ, వారిని భాగస్వామ్యంగా చేస్తూ వెలిగొండ సాధన సమితి ఏర్పాటు చేసి బృహత్తర ఉద్యమాన్ని నడిపారు.
పూల సుబ్బయ్య నిరంతర పోరాటాల ఫలితంగానే ప్రభుత్వం దిగివచ్చి వెలిగొండ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై సర్వే నిర్వహించడానికి ఆదేశాలు జారీ చేసింది. ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాథమిక రూపురేఖలు సిద్దమైనప్పటికీ, దురదృష్టవశాత్తు ప్రాజెక్టు శంకుస్థాపన కాకముందే పూల సుబ్బయ్య కన్నుమూశారు. కానీ ఆయన నాటిన ఉద్యమ బీజం ప్రకాశం జిల్లా గుండెల్లో సజీవంగా నిలిచిపోయింది.
ఒక ప్రజాప్రతినిధి తన జీవిత కాలాన్ని కేవలం ఒక ప్రాజెక్టు సాధన కోసం, ప్రజల నీటి అవసరాల కోసమే ధారపోస్తే, ఆ ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టడమే నిజమైన గౌరవం. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టుకు అధికారికంగా" పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుగా నామకరణం చేశారు.
రాజకీయం అంటే కేవలం ఓట్లు, సీట్లు, పదవులు మాత్రమే కాదని, ప్రజల ప్రాథమిక సమస్యల పరిష్కారం కోసమే సాగించే ప్రాణప్రదమైన పోరాటమని పూల సుబ్బయ్య తన జీవితం ద్వారా నిరూపించారు. ఇప్పుడు వెలిగొండ ప్రాజెక్టు సాకారమవుతుండటం ఆ ప్రాంత ప్రజలంతా పూల సుబ్బయ్యను స్మరించుకుంటున్నారు.
Frequently Asked Questions
వెలిగొండ ప్రాజెక్టు ప్రాముఖ్యత ఏమిటి?
వెలిగొండ ప్రాజెక్టుకు ముందు పశ్చిమ ప్రకాశం జిల్లాలో ప్రజలు ఎదుర్కొన్న ప్రధాన సమస్యలు ఏమిటి?
పశ్చిమ ప్రకాశం జిల్లాలో తీవ్రమైన నీటి కొరత, తాగే నీటిలో ప్రమాదకర ఫ్లోరైడ్ ఉండేది. దీనివల్ల ప్రజలు శారీరక వైకల్యాలకు గురయ్యేవారు.
పూల సుబ్బయ్య ఎవరు? వెలిగొండ ప్రాజెక్టులో ఆయన పాత్ర ఏమిటి?
పూల సుబ్బయ్య ఒక సీపీఐ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే. నల్లమల కొండల గుండా కృష్ణా జలాలను తరలించే ఆలోచనను ప్రతిపాదించి, వెలిగొండ ప్రాజెక్టు కోసం జీవితాంతం పోరాడారు.
వెలిగొండ ప్రాజెక్టుకు పూల సుబ్బయ్య పేరు ఎందుకు పెట్టారు?
ప్రాజెక్టు సాధన కోసం ఆయన చేసిన నిరంతర పోరాటానికి, త్యాగానికి గౌరవంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పేరు పెట్టింది. ఆయన కన్నుమూసిన తర్వాత దీనికి నామకరణం జరిగింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















