Kotamreddy Sridhar Reddy: సొంతవారిని చంపే డీఎన్‌ఏ మాది కాదని జగన్‌పై కోటంరెడ్డి సెటైర్లు- నన్ను చంపితే డబ్బు ఎవరు ఇస్తారో తేలాలని డిమాండ్
Kotamreddy Sridhar Reddy: తన హత్యకు కుట్ర జరిగిందన్న వీడియోపై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు. పోలీసులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జగన్‌పై సెటైర్లు వేశారు.

Kotamreddy Sridhar Reddy: టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై వేసిన మర్డర్ స్కెచ్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. దీనిపై స్పందించిన కోటంరెడ్డి తనకు ఇలాంటి బెదిరింపులు కొత్తకాదని అన్నారు. ఇలాంటి వాటికి బెదిరిపోయే రకాన్ని కాను అన్నారు. కానీ తనను చంపితే డబ్బే డబ్బు వస్తుందని అంటున్నారని ఆ డబ్బు ఎవరు ఇస్తారో తేలాలి అని పోలీసులకు డిమాండ్ చేశారు.
పోలీసులు ఎందుకు అప్రమత్తం చేయలేదు: కోటంరెడ్డి
నెల్లూరులో మీడియాతో మాట్లాడిన కోటం రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. "నిన్న నా మిత్రుడు వీడియో పంపారు.వీడియో చూసి షాక్‌కు గురయ్యాను. ఎస్పీకి 3 రోజుల ముందే సమాచారం ఉందంటున్నారు. జిల్లా ఎస్పీ నాకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు. పోలీసులు నన్ను ఎందుకు అప్రమత్తం చేయలేదు. ఎమ్మెల్యేగా కాదు.. పౌరుడిగా అడుగుతున్నాను అని నిలదీశారు.
చంపితే డబ్బులు ఎవరు ఇస్తారు?: కోటం రెడ్డి
ఆ వీడియోలో జాగ్రత్తగా వింటే కోటంరెడ్డిని చంపితే డబ్బులే డబ్బులు అంటూ మాటలు వినిపించాయని కోటంరెడ్డి అన్నారు. ఆ డబ్బులు ఎవరు ఇస్తారో ఎక్కడి నుంచి వస్తాయో ఆ విషయాన్ని పోలీసులు తేల్చాలని డిమాండ్ చేశారు. "నన్ను చంపితే డబ్బే డబ్బు అని వీడియోలో మాట్లాడారు. నన్ను చంపితే డబ్బు ఎవరు ఇస్తారో పోలీసులు తేల్చాలి.
వీడియో బయటకు రావడంతో వైసీపీ నేతల హడావిడి
వైసీపీ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి తనకు ప్రధాన ప్రత్యర్థి వైసీపీ నేతలేనని కోటంరెడ్డి చెప్పుకొచ్చారు. అయితే ఈ వీడియో బయటకు రావడంతో వైసీపీ నేతలు అలర్ట్ అయ్యారని అన్నారు. ఎలాంటి సంబంధం లేదంటూ భుజాలు తడుముకుంటున్నారు ఎందుకని ప్రశ్నించారు." నేను వైసీపీకి ప్రత్యర్థిగా ఉన్నాను. వైసీపీ నేతలు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు. నా తమ్ముడే కుట్ర చేశాడని ఆరోపణలు చేశారు. అధికారం కోసం సొంత వాళ్లను హతమార్చే DNA మాది కాదు. ఇలాంటి బెదిరింపులకు భయపడను." అని వైసీపీ నేతలకు సెటైర్లు వేశారు.
విద్యార్థి దశలోనే రౌడీలను తరిమికొట్టానని కోటంరెడ్డి గుర్తు చేశారు. అలాంటి తన ఫ్యామిలీపై నిందలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఈ సంవత్సరం జులై 1న ఆ వీడియో సంభాషణ జరిగినట్టు తెలుస్తుంది. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మూడు రోజుల ముందే విషయం తెలుసు అని చెప్పారు, మరి నాకు ఆ సమాచారం ఇవ్వలేదనే అసంతృప్తి ఉంది. నన్ను జాగ్రత్తగా ఉండమని చెప్పి ఉంటే సంతోష పడే వాడిని. నేను బాధితుడిని అలాంటిది నా మీద వైసీపీ,మరో పత్రిక రోత రాతలు రాశారు. నా తమ్ముడు కుట్ర అని కొన్ని పత్రికల్లో రాశారు అలాంటి సంస్కృతి మా DNAలో లేదు. విద్యార్ది దశలోనే నెల్లూరులో రౌడీలను తరిమిన చరిత్ర నాది,ఇలాంటి బెదిరింపులకు నేను భయపడను. వైసీపీ నా చరిత్ర తెలుసుకోవాలి, ప్రజా జీవితంలో నాతోటి నడిచే వారికోసం ఎంత దూరం అయినా పోతా. నన్ను హత్య చేస్తానని బెదిరించిన వారికి చెబుతున్న నాతో నడిచే కార్యకర్తలు, నాయకులు, చివరకు నా మనువడు,నా మనవరాలు కూడా లెక్కచేయరు. నా చివరి శ్వాస వరకు,నాకు ఓపిక ఉన్నంత వరకు ప్రజాజీవితంలో కొనసాగుతా. చంద్రబాబు,ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి,మంత్రి నారాయణ సహకారంతో రూరల్ నియోజక వర్గంలో మూడు వందల కోట్లతో అభివృద్ధి పనులు చేశాను,ఇంకా చేస్తూనే ఉంటా." అని అన్నారు.





















