(Source: ECI/ABP News/ABP Majha)
Nellore Crime: నెల్లూరులో పరువు హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి!
Nellore Crime: నెల్లూరు జిల్లాలో తల్లిదండ్రులు కర్కోటకులుగా మారారు. కనిపెంచిన మమకారాన్ని కూడా మరచిపోయి కన్న కూతురిని చంపుకున్నారు.
Houner Killing In Nellore:ఇతర మతానికి చెందిన యువకుడిని పెళ్లి చేసుకుందని సొంత కూతురినే చంపి ఇంటి పక్కనే పూడ్చిపెట్టారు తల్లిదండ్రులు. ఈ ఘోరం నెల్లూరు జిల్లాలో జరిగింది. పెళ్లి జరిగిన తర్వాత ప్రేమగా ఇంటికి పిలిచి కూతురిని హత్య చేశారు, ఆ తర్వాత ఆ ఘోరం వెలుగులోకి రాకుండా ఇంటి పక్కనే శవాన్ని పాతిపెట్టి.. తమ కుమార్తె కనిపించడం లేదంటూ నాటకమాడారు. చివరకు కటకటాలపాలయ్యారు.
ఇప్పటి వరకు చాలా రకాలైన పరువు హత్యల గురించి వింటుంటాం కానీ, నెల్లూరు జిల్లాలో తల్లిదండ్రులు కర్కోటకులుగా మారారు. కనిపెంచిన మమకారాన్ని కూడా మరచిపోయి కన్నకూతురిని చంపుకున్నారు. తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని ఆమెను తీవ్రంగా హింసించి మరీ చంపారు. ఈ ఘటన కొడవలూరు మండలం వద్మనాభసత్రం పల్లెపాలెంలో జరిగింది. తిరుమూరు వెంకటరమణయ్య, దేవసేనమ్మ దంపతులు పల్లెపాలెంలో నివాసం ఉండేవారు. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. పెద్ద కుమార్తెకు పదేళ్ల క్రితం వివాహమైంది. రెండో కుమార్తె శ్రావణికి ఆరేళ్ల క్రితం పెళ్లి కాగా.. ఆమెకు భర్తతో గొడవలు ఉన్నాయి. విడాకులకోసం కోర్టులో దరఖాస్తు చేసుకుంది. ప్రస్తుతం ఇంటి వద్ద తల్లిదండ్రులతో కలసి ఉంటోంది.
ఇంటి వద్ద ఉంటున్న శ్రావణికి అల్లూరు మండలం నార్త్ ఆములూరుకు చెందిన షేక్ రబ్బానీ బాషా అనే పెయింటర్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో వారు పెళ్లి చేసుకుని నార్త్ ఆమూలూరులో కాపురం కూడా పెట్టారు. ఈ వ్యవహారం ఇరు కుటుంబాల మధ్య గొడవలకు కారణం అయింది. శ్రావణి తల్లిదండ్రులు ఆమెకు నచ్చజెప్పి ఇంటికి తీసుకొచ్చారు. తమ కులానికి చెందిన మరో వ్యక్తితో వివాహం జరిపిస్తామని, రబ్బానీ వద్దకు తిరిగి వెళ్లొద్దని చెప్పారు. కానీ ఆమె వినలేదు.
తల్లిదండ్రులు ఆమెను తీవ్రంగా హింసించారు. తమ మాట వినాలని, మరో పెళ్లి చోసుకోవాలన్నారు. కానీ శ్రావణి మాత్రం వారి మాటలకు తలొగ్గలేదు. చిత్రహింసలు పెట్టినా మౌనంగా భరించింది. చివరకు వారి దెబ్బలు తాళలేక ఆమె చనిపోయింది. ఈ ఘటన జరిగి దాదాపు నెలరోజులు కావొస్తోంది. శ్రావణి శవాన్ని ఇంటి పక్కనే పూడ్చిపెట్టారు తల్లిదండ్రులు. ఏమీ ఎరగనట్టు ఉండిపోయారు. చివరకు రబ్బానీ, శ్రావణిని వెదుక్కుంటూ ఆ ఊరు వచ్చారు. ఆమె తల్లిదండ్రుల ప్రవర్తన అనుమానంగా ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల రాకతో అసలు విషయం బయటపడింది.
శ్రావణిని ఆమె తల్లిదండ్రులతో పాటు సోదరుడు, సోదరి కలసి హత్య చేసినట్టు తెలిసింది. ఇంటి పక్కన ఉన్నవారి సాయంతో గుంత తీసి పూడ్చిపెట్టారు. పోలీసుల విచారణలో ఈ వ్యవహారం బయటపడింది. తల్లిదండ్రుల్ని వారు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా మొత్తం కథ చెప్పారు. వారిద్దర్నీ అరెస్ట్ చేశారు. వారికి సాయం చేసిన చెంచయ్య అనే వ్యక్తిపై కూడా కేసు పెట్టారు. ఈ హత్యలో భాగస్వాములైన శ్రావణి సోదరి, సోదరుడు పరారీలో ఉన్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. కన్న కూతుర్ని హత్య చేసిన తల్లిదండ్రులు నెలరోజులుగా ఏమీ తెలియనట్టు ఉండటం, ఇంటి పక్కనే శవాన్ని పాతి పెట్టడంతో కలకలం రేగింది.
Also Read: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను కోర్టులో హాజరుపరిచిన పోలీసులు - 14 రోజుల రిమాండ్