పిల్లికి భిక్షం పెట్టని వాళ్లు ప్రజలకేం చేస్తారు, సోదరులపై మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం
ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వారసత్వంగా రావాల్సిన ఆస్తి పంపకాల్లో సోదరులే తీవ్ర అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వారసత్వంగా రావాల్సిన ఆస్తి పంపకాల్లో సోదరులే తీవ్ర అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదమ్ములు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, చిల్లిగవ్వ కూడా ఇవ్వకుండా, ఇంటి నుంచి గెంటేశారని వాపోయారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోనిమర్రిపాడులో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారు. అన్నదమ్ములు ముగ్గురు ఒకసారి ఆస్తుల గురించి మాట్లాడుకున్నామని... ఎవరికి ఎంతెంత వాటా వస్తుందో చర్చించుకున్నామని తెలిపారు. రాజగోపాల్‌రెడ్డి ఎంత మోసగాడో ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసన్నారు. ఆస్తి పంపకాల కోసం బెంగళూరుకు రమ్మన్నారని, తీరా అక్కడికి వెళ్లాక అందుబాటులో ఉండకుండా పోయారన్నారు. తనను మానసిక ఇబ్బందులకు గురిచేయడంతోనే గుండెపోటు వచ్చిందన్నారు.
మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి చెప్పిన విధంగా ఇప్పటికీ ఆస్తుల పంపిణీ చేయలేదని చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. రాజకీయ పదవి, భవిష్యత్తు కోసం రాజగోపాల్‌రెడ్డి ఆస్తి పంపిణీ చేసినట్లు అబద్ధాలు చెబుతున్నారని తెలిపారు. తనకు న్యాయంగా రావాల్సిన ఆస్తి ఇవ్వకపోతే కోర్టుకెళ్తానని స్పష్టం చేశారు. న్యాయబద్ధంగా రావాల్సిన ఆస్తుల విషయంలో వెనక్కి తగ్గేది లేదని, ఎలాగైనా సాధించుకుంటానని చెప్పారు. తన మొదటి భార్య పిల్లలు, ఆస్తిపాస్తుల్ని, తన అన్నదమ్ములు దూరం చేశారని అన్నారు.
తాను కత్తులు, గొడ్డళ్లు పట్టుకుని పోరాటం చేస్తేనే అన్నదమ్ములకు రాజకీయ భవిష్యత్తు వచ్చిందని చంద్రశేఖర్ రెడ్డి గుర్తు చేశారు. ఇక నుంచి వారికి రాజకీయ భవిష్యత్తు ఉండదని హెచ్చరించిన ఆయన, తానే వ్యతిరేకంగా నిలబడతానని స్పష్టం చేశారు. సీఎం జగన్ కోసం ఎమ్మెల్యే పదవిని త్యాగం చేశానన్న చంద్రశేఖర్ రెడ్డి, సీఎం జన్మదిన వేడుకలు, వైసీపీ ప్లీనరీ సమావేశాలకు 2 కోట్ల సొంత నిధులు ఖర్చు చేశానన్నారు. పార్టీ కోసం ఇంత చేస్తే సస్పెండ్ చేశారని అన్నారు. ఆ తర్వాత ఉదయగిరి నియోజకవర్గానికి ఇన్‌ఛార్జిని నియమించడానికి వైసీపీకి మూడు నెలల సమయం పట్టిందన్నారు. గత్యంతరం లేక మేకపాటి రాజగోపాల్‌రెడ్డిని ఇన్‌ఛార్జిగా పెట్టుకున్నారని సెటైర్లు వేశారు.
2024 ఎన్నికల్లో వైసీపీ తరఫున రాజగోపాల్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారో లేదో కూడా నమ్మకం లేదన్నారు చంద్రశేఖర్ రెడ్డి. వైసీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా బాధ్యత ఇవ్వగానే ఎమ్మెల్యే అయినట్లు భావిస్తున్నారని వ్యాఖ్యానించారు. తాను ఈ స్థితిలో ఉండడానికి కారణం రాజగోపాల్ రెడ్డేనన్నారు. తన మొదటి భార్య బిడ్డలను దూరం చేసి ఆస్తి పంచకుండా చేసి అన్యాయం చేసిన పరమ దరిద్రులంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లికి భిక్షం పెట్టని మీరు నియోజకవర్గ ప్రజలకు ఏం చేస్తారని ప్రశ్నించారు. తన భార్య శాంతమ్మని దుష్టశక్తి అని అంటే, మీ భార్యలు కూడా దుష్టశక్తులే అవుతారంటూ ఫైర్ అయ్యారు. తన భార్య శాంతమ్మ మాట విని ఉంటే రాజారెడ్డి ఉదయగిరిలో రాజకీయం చేసే వాడే కాదన్నారు. న్యాయంగా ఆస్తి ఇవ్వకపోతే కోర్టుకెళ్లిన సాధించుకుంటానని ఆయన సవాల్ చేశారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీ అభ్యర్థికి ఓటు వేశారని వైసీపీ సస్పెండ్ చేసింది. అప్పటి నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వం తీవ్ర విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయాన్ని తీవ్రంగా ఖండించారు. త్వరలోనే టీడీపీలో చేరనున్నట్లు ప్రకటించారు.