Nellore YSRCP leader: హైదరాబాద్ డ్రగ్స్ కేసు, నెల్లూరు వైసీపీలో కలకలం- అసలేం జరిగిందంటే?
ఈరోజు తండ్రీకొడుకులిద్దరూ కలసి ప్రెస్ మీట్ పెట్టారు. ప్రేమ్ చంద్ మాత్రం మౌనంగానే ఉన్నారు. ముక్కాల ద్వరానాథ్ మాత్రం అవి తప్పుడు వార్తలంటూ నిప్పులుచెరిగారు. గిట్టనివారు చేస్తున్న ప్రచారం అన్నారు.
Hyderabad Drugs case links with Nellore: హైదరాబాద్ లో బయటపడిన డ్రగ్స్ కేసులో తన కొడుకు తప్పేం లేదంటూ నెల్లూరు వైసీపీ నాయకుడు, నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ ప్రెస్ మీట్ పెట్టారు. డ్రగ్స్ కేసుపై వివరణ ఇచ్చేందుకు ఆయన జిల్లా వైసీపీ ఆఫీస్ ని ఉపయోగించుకోవడం ఇక్కడ విశేషం. హైదరాబాద్ డ్రగ్స్ కేసు బయటపడినప్పటి నుంచి మీడియా అంతా పులిహార కలిపిందని ఆయన మండిపడ్డారు. కలిపిందే కలిపి కొంతమంది తప్పుడు వార్తలిచ్చారన్నారు. సోషల్ మీడియాలో కూడా ఉద్దేశపూర్వకంగానే తన ఫొటోలు, తన కొడుకు ఫొటోలు సర్కులేట్ చేశారని, ఎవ్వరినీ వదిలిపెట్టబోనని వార్నింగ్ ఇచ్చారు.
హైదరాబాద్ లో ఓ సర్వీస్ అపార్ట్ మెంట్ నుంచి తన కొడుకు ప్రేమ్ చంద్, మరికొందరు స్నేహితులను పోలీసులు తీసుకెళ్లిన మాట వాస్తవమేనని, అయితే వారిని కేవలం విచారణ జరిపి పంపించివేశారని, వారు చేసిన పరీక్షలన్నిట్లో నెగెటి వచ్చిందని, వారెవరూ డ్రగ్స్ తీసుకోలేదని చెప్పారు. ఈ క్రమంలో ఆయన వైసీపీలోని తన ప్రత్యర్థులపై పరోక్షంగా మండిపడ్డారు ద్వారకానాథ్. పార్టీలో ఉన్నవారు ఇలాంటి పనులు చేస్తారని తాను అనుకోవడం లేదని, ఎవరు ఎవరికి ఫొటోలు పంపించారు, ఎందుకు దుష్ప్రచారం చేశారో తనకు తెలుసన్నారు. తనని ఎదుర్కోవడం చేతగాక, తన బిడ్డపై ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తారా అని మండిపడ్డారు. సర్ఫ్ ఎక్సెల్ తో కడిగేస్తానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నెల్లూరు వైసీపీలో హడావిడి..
హైదరాబాద్ డ్రగ్స్ కేసులో నెల్లూరు కుర్రాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టడంతో జిల్లాలో నిన్నటి నుంచి కలకలం రేగింది. అదే సమయంలో అరెస్టైన వారిలో వైసీపీ నాయకుడు నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ తనయుడు పేరు కూడా ఉన్నట్టు ప్రచారం జరిగింది. అంతలోనే ఆయన్ను అరెస్ట్ చేయలేదని, విచారణ జరిపి విడిచిపెట్టారని, పొలిటికల్ ప్రెజర్ పనిచేసిందని కూడా పుకార్లు వచ్చాయి. నెల్లూరు సోషల్ మీడియా గ్రూపుల్లో ఒకటే రచ్చ. ఆ తర్వాత ద్వారకానాథ్ తనయుడు ప్రేమ్ చంద్ పేరుతో ఓ వాట్సప్ మెసేజ్ కూడా సర్కులేట్ అయింది.
"మిత్రులకు, శ్రేయోభిలాషులకు నా నమస్కారాలు
నేను ముక్కాల ద్వారకానాథ్ గారి కుమారుడును ప్రేమ్ ని
టీవీలో వస్తున్న కథనాలు అవాస్తవాలు.. ఎందుకంటే...?
మమ్మల్ని పిలిచింది వాస్తవం
మమ్మల్ని ఎంక్వయిరీ చేసింది వాస్తవం.
మేము ఎలాంటి తప్పు చేయలేదని నిర్ధారించుకొని
మమ్మల్ని పంపించి వేయడం జరిగింది.
ఒకవేళ మేము గాని డ్రగ్స్ కేసులో తప్పు చేసి ఉంటే .
మమ్మల్ని పోలీస్ లు అరెస్ట్ చేసివుండేవారు
మేం బయటకు వచ్చేవారం కాదని తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
టీవీలో, వాట్సాప్ లో వచ్చే కథనాలు అవాస్తవమని తెలియజేస్తూ
ఎప్పటికీ మీ ఆదరభిమానాలు మాకు ఉండాలని కోరుకుంటూ
మీ
ముక్కాల ప్రేమ్" అనేది ఆ వాట్సప్ మెసేజ్ సారాంశం.
వాట్సప్ మెసేజ్ ని విడుదల చేయడంతోపాటు.. ఈరోజు తండ్రీకొడుకులిద్దరూ కలసి ప్రెస్ మీట్ పెట్టారు. ప్రేమ్ చంద్ మాత్రం మౌనంగానే ఉన్నారు. ముక్కాల ద్వరానాథ్ మాత్రం అవి తప్పుడు వార్తలంటూ నిప్పులుచెరిగారు. గిట్టనివారు చేస్తున్న ప్రచారం అన్నారు. తన బిడ్డ స్నేహితుల తల్లిదండ్రులు ఎంతో మానసిక క్షోభ అనుభవించారని, తప్పుడు ప్రచారం చేసినవారికి వారందరి ఉసురు తగలకమానదన్నారు. మొత్తమ్మీద వైసీపీలో జరిగిన ఈ అలజడికి ఈ ప్రెస్ మీట్ ఫుల్ స్టాప్ పెడుతుందేమో చూడాలి.