నెల్లూరు పోలీస్ స్టేషన్ వీరంగం ఎపిసోడ్ లో ఎమ్మెల్యే ఆనంకు చుక్కెదురు
ఆనం వర్గం వారు తొలగించిన బంకు అసలు ఆలయ స్థలంలోనిది కాదని, అది రోడ్డు మార్జిన్ ని ఆక్రమించి నిర్మించుకున్నదని అధికారులు నివేదిక ఇచ్చారు. దీంతో ఆనం వర్గం వారు, గిరిజన మహిళపై దౌర్జన్యం చేశారని తేలింది.
ఇటీవల నెల్లూరు ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి చిందులు తొక్కిన విషయం తెలిసిందే. ఆ వ్యవహారంలో ఇప్పుడు ఆనం రామనారాయణ రెడ్డికి చుక్కెదురైంది. ఆనం వర్గం వారు తొలగించిన బంకు అసలు ఆలయ స్థలంలోనిది కాదని, అది రోడ్డు మార్జిన్ ని ఆక్రమించి నిర్మించుకున్నదని అధికారులు నివేదిక ఇచ్చారు. ఈ నివేదిక బయటకు రావడంతో ఇప్పుడు ఆనం వర్గం వారు, గిరిజన మహిళపై దౌర్జన్యం చేశారని తేలింది. మరి ఈ ఘటనపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
నెల్లూరులోని వేణుగోపాల స్వామి దేవస్థానం భూములను కొంతమంది ఆక్రమించారని, ఆక్రమణలు తొలగించే క్రమంలో ఓ బంకుని తీసివేశారనే ఆరోపణతో ఆలయ సిబ్బందిని ఆరోజు పోలీస్ స్టేషన్ కి పిలిపించారు. ఆ బంకు యజమాని గిరిజన మహిళ కావడంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ నమోదు చేయాలని వారు కోరారు. ఆలయ నిర్వహణ వ్యవహారాలు మొదటినుంచీ ఆనం కుటుంబం చూస్తుండేది. ఆలయ సిబ్బంది కూడా ఆనం కుటుంబానికి సన్నిహితులు కావడంతో వెంటనే ఎమ్మెల్యే రామనారాయణ రెడ్డి ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నారు. తానే నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి సీఐని హెచ్చరించారు. ఏఎస్పీ, ఎస్పీ వచ్చి ఆయనకు సర్ది చెప్పిన తర్వాతే ఆనం పోలీస్ స్టేషన్ బయటకు వచ్చారు. ఈలోగా ఆనం సోదరులు, ఇతర కుటుంబ సభ్యులు, అనుచరులు కూడా పెద్ద ఎత్తున స్టేషన్ కి వచ్చి హడావిడి చేశారు. చివరకు పోలీసులు ఆలయ సిబ్బందిని విడిచిపెట్టడంతో ఆనం వర్గీయులు శాంతించారు.
అప్పుడే ఆనం రామనారాయణ రెడ్డి ఈ వ్యవహారాన్ని మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆలయ స్థలం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోకి రావడంతో ఇది రాజకీయ రంగు పులుముకుంది. ఆ తర్వాతి రోజు సదరు బాధిత గిరిజన మహిళకు మద్దతుగా గిరిజన సంఘాల వారు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ వెనక రాజకీయ నాయకుల హస్తం ఉందనే గుసగుసలు వినిపించాయి. కట్ చేస్తే ఇప్పుడు ఆనం వర్గానిదే తప్పు అని తేలడంతో వైరి వర్గం మరింతగా హడావిడి చేసే అవకాశముంది.
గిరిజన మహిళ వనపర్తి దేవసేనమ్మ ఏర్పాటు చేసుకున్న బంకు స్థలం నేషనల్ హైవే 67 కి చెందిందని స్కెచ్ తో సహా కార్పొరేషన్ అధికారులు నివేదిక విడుదల చేశారు. దేవసేనమ్మ ఏర్పాటు చేసిన బంకు స్థలం వేణుగోపాల స్వామి ఆలయానికి సంబంధించినది కాదని తేల్చారు. అది నేషనల్ హైవే 67 మార్జిన్ స్థలంగా నిర్ధారించారు. దీనికి సంబంధించి పూర్తి డ్రాయింగ్ కూడా అందజేశారు. కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్, సర్వే అధికారులు పూర్తిస్థాయిలో సంఘటన ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం ఈ నివేదికను సమర్పించారు. వనపర్తి దేవసేనమ్మ అనే మహిళ రహదారి పక్కన ఈ ప్రాంతంలో చిన్న బంకు ఏర్పాటు చేసుకున్నారని ఈ స్థలం 100 అడుగుల జాతీయ రహదారి పరిధిలోకి వస్తుందని నిర్ధారించారు.
దీంతో ఈ వివాదం సరికొత్త మలుపు తిరిగింది. 15 ఏళ్ల నుంచి ఈ ప్రాంతంలో చిన్న బంకు నడుపుతున్న దేవసేనమ్మ, వేణుగోపాల స్వామి దేవస్థానం సిబ్బందిపై అనేక ఆరోపణలు చేసింది. తన వద్ద డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపించింది. తనను బూతులు తిట్టారని, తన బంకు ధ్వంసం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరి దీనిపై ఇప్పుడు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.