MLA Kotamreddy: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఓ రాజకీయ దళారి - కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు
రామోజీరావుని వేధిస్తే ఆయన మీకు లొంగుతాడని అనుకోవడం అవివేకం అన్నారు కోటంరెడ్డి. సాక్షి ఛానెల్ కి తనను పిలిస్తే, ఈనాడు గురించి, రామోజీరావు గురించి జరిగే చర్చల్లో తాను పాల్గొంటానని అన్నారు ఎమ్మెల్యే.
ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులుపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఓ రాజకీయ దళారి అంటూ మండిపడ్డారు. ఉద్యోగుల్ని వేధిస్తున్నారని, ఎమ్మెల్యేలపై నిఘా పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. ఆయనకు ఏపీ అంతటా నెట్ వర్క్ ఉంటే, తనకు ఆయన దగ్గరే నెట్ వర్క్ ఉందన్నారు. ఆయన చేస్తున్న పనులు ఇవీ అంటూ మీడియా ముందు చెప్పారు. తన మాటలు వింటే సీతారామాంజనేయులు ఉలిక్కిపడటం ఖాయమన్నారు శ్రీధర్ రెడ్డి. ఆయన అలా ఉలిక్కి పడాల్సిన అవసరం లేదని, ఆయనకు ఇంకా 6 నెలలు మాత్రమే సమయం ఉందని, మంచిగా మారాలన్నారు.
గతంలో తన ఫోన్లు ట్యాపింగ్ కి గురయ్యాయని సంచలన ఆరోపణలు చేసిన కోటంరెడ్డి.. అప్పుడు కూడా ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ నుంచే తనకు ఫోన్ వచ్చిందని అన్నారు. ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ టార్గెట్ గా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన రాజకీయ దళారి అన్నారు. తన విధుల్ని పక్కనపెట్టి ఆయన.. ఉద్యోగులను, ఎమ్మెల్యేలను వేధిస్తున్నారని చెప్పారు.
ఉండవల్లి అరుణ్ కుమార్ తో ఢిల్లీలో రామోజీరావుకి వ్యతిరేకంగా మాట్లాడించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు కోటంరెడ్డి. ఈనాడు, మార్గదర్శి, రామోజీరావు పై ఉండవల్లి చేత ఇవాళ కానీ, రేపు కానీ ప్రెస్ మీట్ పెట్టించబోతున్నారని, ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టించేందుకు ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు ప్రయత్నిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
రామోజీరావుపై ఏపీ నుంచి వైసీపీ నేతలు చెప్పే మాటల్ని ఢిల్లీలో ఎవరూ వినడం లేదన్నారు కోటంరెడ్డి. అందుకే వారు ఉండవల్లిని వాడుకోవాలని చూస్తున్నారని చెప్పారు. ఉండవల్లి వైసీపీ నేతల ట్రాప్ లో పడకూడదన్నారు. 20 ఏళ్లుగా ఉండవల్లికి తాను ఏకలవ్య శిష్యుడినని, ఆయనంటే తనకు మంచి గౌరవం ఉందని చెప్పారు. ఉండవల్లి అరుణ్ కుమార్ ని సీతారామంజనేయులు ట్రాప్ చేస్తున్నారన్నారని ఆరోపించారు.
రామోజీని వేధిస్తే ఆయన మీకు లొంగుతాడని అనుకోవడం అవివేకం అన్నారు కోటంరెడ్డి. సాక్షి ఛానెల్ కి తనను పిలిస్తే, ఈనాడు గురించి, రామోజీరావు గురించి జరిగే చర్చల్లో తాను పాల్గొంటానని అన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. మార్గదర్శిపై కేసులు పెట్టి రామోజీరావుని, ఆయన కుటుంబ సభ్యుల్ని వేధిస్తున్నారని.. కానీ మార్గదర్శి వల్ల తాము నష్టపోయామంటూ ఒక్కరైనా పోలీసులకు ఫిర్యాదు చేశారా అని ప్రశ్నించారు కోటంరెడ్డి. ఒక్కరన్నా మార్గదర్శి కార్యాలయం వద్దకి వెళ్లి తమ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారా అని అడిగారు.
సీతారామంజనేయులు రహస్య ప్రణాళిక తనకు తెలిసిపోయిందని, ఆ విషయం తెలిసి ఆయన భయపడాల్సిన పనిలేదన్నారు. ఆయన విషయాలన్నీ తనకు తెలిసిపోతాయని, తనకు అంత నెట్ వర్క్ ఉందన్నారు. తనకు సెక్యూరిటీ తగ్గించి, వేధించాలని చూశారని సీతారామాంజనేయులుపై మండిపడ్డారు కోటంరెడ్డి. ఆయన బాగోతం మరో 6 నెలల్లో ముగుస్తుందన్నారు. ఆయన ఆటలు ఇక సాగవని చెప్పారు. ఆయన తన విధులు మరిచి, ప్రతిపక్ష నేత చంద్ర బాబు, జన సేన నేత పవన్ గురించి ఆరా తీస్తున్నారని.. టీడీపీ, జనసేన కార్యకలాపాలకు అడ్డు తగులుతున్నారని చెప్పారు. పోలీస్ బలంతో వారిని అడ్డుకుంటున్నారని అన్నారు కోటంరెడ్డి. సీఎం జగన్ మెహ ర్బానీ కోసమే రామాంజనేయులు ఇదంతా చేస్తున్నారన్నారు. ఆరు నెలలే ఆయనకు అధికారం ఉందని, రాజకీయ దళారీగా చేస్తున్న వ్యవహారాలకు ఆయన తప్పక మూల్యం చెల్లిస్తారన్నారు.