ఆరోగ్య శ్రీ కార్యక్రమానికి మించి కార్యక్రమాలు తీసుకొస్తున్న వైసీపీ ఎమ్మెల్యే!
ఆరోగ్య శ్రీ వల్ల కొంతమందికి మాత్రమే లబ్ధి చేకూరుతోంది. అందులో కవర్ కాని వ్యాధులు, దీర్ఘకాలిక రోగాలకు చికిత్స మందులు కూడా ఆరోగ్య రక్ష ద్వారా అందిస్తామన్నారు శ్రీధర్ రెడ్డి.
ఆరోగ్యశ్రీతో ఇప్పటికే పేదలకు అవసరమైన వైద్య సేవలను ప్రభుత్వం అందిస్తోంది. అయితే ప్రభుత్వంతో సంబంధం లేకుండా, రాజకీయ పార్టీలకు అతీతంగా మరో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. దానికి ఆరోగ్య రక్ష అనే పేరు పెట్టారు. త్వరలో దీని గురించి పూర్తి వివరాలు తెలియజేస్తానన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారాయన.
ఆరోగ్య రక్ష అంటే ఏంటి..?
ఆరోగ్య శ్రీ వల్ల కొంతమందికి మాత్రమే లబ్ధి చేకూరుతోంది. అందులో కవర్ కాని వ్యాధులు, దీర్ఘకాలిక రోగాలకు చికిత్స మందులు కూడా ఆరోగ్య రక్ష ద్వారా అందిస్తామన్నారు శ్రీధర్ రెడ్డి. దీనికి రాజకీయాలతో సంబంధం లేదని, ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా దీనిలో భాగస్వాములు కావచ్చని ప్రకటించారు. అందరి ఆరోగ్యం కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఆరోగ్య రక్ష ద్వారా దీర్ఘ కాలిక వ్యాధులబారిన పడినవారికి వాహన సౌకర్యంతోపాటు, ఆపరేషన్లు కూడా నిర్వహించి వారికి ఉచితంగా మందులు కూడా అందిస్తామన్నారు.
ఎలా చేస్తారు..?
ఆరోగ్య రక్ష కోసం తనకు కొంతమంది కార్పొరేట్ ఆస్పత్రులు, నిపుణులైన వైద్యులు సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. రథ సప్తమి రోజున ఈ కార్యక్రమాన్ని ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. నెల్లూరులోని 6 కార్పొరేట్ ఆస్పత్రులు 33మంది నిపుణులైన వైద్యులు, రెండు సామాజిక సేవా సంస్థలు ఈ కార్యక్రమం కోసం తమ వంతు సాయం అందిస్తున్నాయని తెలిపారు. ఆస్పత్రుల పేర్లు, వైద్య నిపుణుల పేర్లు త్వరలో ప్రకటిస్తామన్నారు. పేద ప్రజల వైద్యం కోసం తాను ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నానని, ఇందులో ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు తాను ఆశించడంలేదన్నారు.
ప్రభుత్వానికి, పార్టీకి సంబంధం లేదా..?
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పార్టీతో సంబంధం లేకుండా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి మంచి ఫాలోయింగ్ ఉంది. వైసీపీ ప్రభుత్వం గడప గడప కార్యక్రమాన్ని మొదలు పెట్టకముందే శ్రీధర్ రెడ్డి నియోజకవర్గంలో ప్రతి ఇంటికీ వెళ్లే కార్యక్రమాలను మొదలు పెట్టారు. మీ ఇంటికి మీ ఎమ్మెల్యే అనే కార్యక్రమం ద్వారా ఆయన ప్రజల్లోకి వెళ్లారు. ఆ తర్వాత కొంత కాలానికి సీఎం జగన్ గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రం మొదలు పెట్టారు. ఒకరకంగా శ్రీధర్ రెడ్డి చేపట్టిన మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమమే గడప గడపకు కూడా స్ఫూర్తి అని చెప్పుకోవాలి. అలాంటి శ్రీధర్ రెడ్డి ఇప్పుడు ఆరోగ్య రక్ష అనే మరో కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం విశేషం. ఈ కార్యక్రమంలో ఎక్కడా పార్టీ పేరు కానీ, పార్టీ అధినాయకుడు పేరు కానీ లేదు. అంటే ప్రభుత్వంతో కానీ, పార్టీతో కానీ ఈ కార్యక్రమానికి సంబంధం లేదనే చెప్పాలి. పార్టీలకు అతీతంగా శ్రీధర్ రెడ్డి ఈకార్యక్రమాన్ని మొదలు పెట్టారు.
స్పూర్తి అదే..
ఇటీవల కొంతమంది ప్రముఖులు అకస్మాత్తుగా అనారోగ్యం బారిన పడి చనిపోయిన ఉదాహరణలు ఉన్నాయని చెప్పారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. అయితే వారంతా ముందు జాగ్రత్త పడి ఆరోగ్య పరీక్షలు చేయించుకుని ఉంటే, ఇప్పుడున్న అధునాతన వైద్య సదుపాయాల ద్వారా వారు రక్షణ పొందే అవకాశం ఉండేదని చెప్పారు. పేద ప్రజల, సామాన్యులు ఇలాంటి వైద్య పరీక్షలకు సహజంగా దూరంగా ఉంటారని, అలాంటి వారందరికీ తాను పరీక్షలు చేయిస్తానని, ఒకవేళ ఏవైనా ఆరోగ్య ఇబ్బందులు ఎదురైతే ఉచితంగా అందరికీ ఆపరేషన్లు చేయిస్తానన్నారు.
నెల్లూరు జిల్లా వ్యాప్తంగా జర్నలిస్ట్ లకు ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహిస్తామన్నారు శ్రీధర్ రెడ్డి. ఇక రూరల్ నియోజకవర్గానికే ప్రస్తుతం ఆరోగ్య రక్ష పరిమితం అవుతుందని, భవిష్యత్తులో దీన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహించాలనే ఆలోచన తనకు ఉందన్నారు. మరింతమంది దాతలు ముందుకు వస్తే దీన్ని జిల్లా వ్యాప్తంగా చేపడతామన్నారాయన.