YSRCP: నెల్లూరులో వైసీపీ చేజారిన మరో కీలక నేత, మాజీ ఎమ్మెల్యే వంటేరు రాజీనామా
Andhra News: నెల్లూరులో కీలక నేతలంతా వైసీపీని వీడిపోతుండటం గమనార్హం. సీఎం జగన్ సొంత సామాజిక వర్గానికి చెందిన నేతలే పార్టీని వదిలి బయటకు పోవడం ఇక్కడ మరో విశేషం.
Nellore YSRCP News: ఏపీ మొత్తం పరిస్థితి ఎలా ఉన్నా.. నెల్లూరు జిల్లాలో మాత్రం వైసీపీకి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరు కీలక నేతలంతా పార్టీని వీడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి తాజాగా వైసీపీకి గుడ్ బై చెప్పారు. రెండ్రోజులుగా భవిష్యత్ కార్యాచరణకోసం అనుచరులతో చర్చలు జరుపుతున్న ఆయన, ఈరోజు తన నిర్ణయం ప్రకటించారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
పదేళ్లు వైసీపీలో ఉంటే సరైన గుర్తింపు లేదని, సీనియర్ ని అయిన తనను హీనంగా చూశారని ఆవేదన వ్యక్తం చేశారు వంటేరు. ఆత్మాభిమానం చంపుకొని ఉండలేకే రాజీనామా చేశానన్నారు. గతంలో కావలి, ఉదయగిరిలో వైసీపీ అభ్యర్థుల విజయం కోసం తాను పనిచేశానని చెప్పారు వంటేరు. ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీనుంచి బయటకు వచ్చిన తర్వాత ఉదయగిరి సీటుకోసం వంటేరు వేణుగోపాల్ రెడ్డి ప్రయత్నించారు. ఓ దశలో ఆయన్ను ఇన్ చార్జ్ గా కూడా ప్రకటించారనే ప్రచారం జరిగింది. అయితే చివరకు ఆ సీటు మేకపాటి కుటుంబానికే సీఎం జగన్ కేటాయించారు. దీంతో వంటేరు అలకబూనారు. ఇప్పటి వరకు ఆయన పార్టీతో కాస్త దూరంగానే ఉన్నారు. ఇటీవల నెల్లూరు జిల్లా రాజకీయాల్లో పెను మార్పులు సంభవించాయి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీని వీడి టీడీపీలోకి రావడంతో ఆయన వెంట చాలామంది నేతలు తెలుగుదేశంలోకి క్యూ కట్టారు. కాస్త ఆలస్యంగా వంటేరు వేణుగోపాల్ రెడ్డి కూడా వైసీపీని వీడారు. ఆయన టీడీపీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది.
కావలి నియోజకవర్గానికి గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు వంటేరు వేణుగోపాల్ రెడ్డి. కొత్త తరం వచ్చిన తర్వాత ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. వైసీపీలో చేరి, ఆ పార్టీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేశారు. గత రెండు ఎన్నికల్లో కావలి, ఉదయగిరి నియోజకవర్గాల పరిధిలో వైసీపీకోసం పనిచేశారు వంటేరు. అలాంటి కీలక నేత ఇప్పుడు వైసీపీని వీడటం ఆ పార్టీకి నష్టం అనే చెప్పాలి. అన్ని పార్టీల నుంచి తనకు ఆహ్వానాలు అందుతున్నాయని, ఏ పార్టీలో చేరేది త్వరలోనే ప్రకటిస్తాన్నారాయన. అయితే ఆయన టీడీపీలోకి వెళ్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి.
నెల్లూరులో వైసీపీకి కష్టమే..
గత ఎన్నికల్లో నెల్లూరు క్లీన్ స్వీప్ చేసిన వైసీపీకి ఇప్పుడు కనీసం సగానికి సగం సీట్లు గెలవడం కష్టంగా కనపడుతోంది. కీలక నేతలంతా వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఏకంగా ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరగా, అందులో ఇద్దరు ఇప్పుడు టీడీపీ తరపున అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. నెల్లూరు రూరల్ నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆత్మకూరు నుంచి ఆనం రామనారాయణ రెడ్డి బరిలో ఉన్నారు. ఉదయగిరి నుంచి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీలో చేరినా, ఆయనకు చంద్రబాబు టికెట్ కేటాయించలేదు. ఇటీవల ఎంపీ వేమిరెడ్డి కూడా టీడీపీలో చేరారు.. ఆయన వెంట రూప్ కుమార్ యాదవ్ సహా మరికొందరు కీలక నేతలు వైసీపీని వదిలి చంద్రబాబు జట్టులో చేరారు.
నెల్లూరులో వైసీపీ బలహీనపడుతుందేన ఉద్దేశంతోనే ఎంపీ విజయసాయిరెడ్డిని రంగంలోకి దించారు సీఎం జగన్. విజయసాయిరెడ్డి నెల్లూరు ఎంపీగా వైసీపీ నుంచి పోటీ చేయబోతున్నారు. ఆయన వచ్చిన తర్వాత వైసీపీలో కాస్త కదలిక వచ్చినా ఏమేరకు పార్టీ కోలుకుంటుందో వేచి చూడాలి. మొత్తమ్మీద నెల్లూరులో కీలక నేతలంతా వైసీపీని వీడిపోతుండటం గమనార్హం. సీఎం జగన్ సొంత సామాజిక వర్గానికి చెందిన నేతలే పార్టీని వదిలి బయటకు పోవడం ఇక్కడ మరో విశేషం.