నెల్లూరులో సుపారీ కిల్లర్ గ్యాంగ్ ఆట కట్టించిన పోలీసులు
డబ్బులిస్తే ఎలాంటి పని చేయడానికైనా తయారయ్యే బ్యాచ్ లు నెల్లూరులో కూడా పుట్టుకొస్తున్నాయి. అలాంటి సుపారీ గ్యాంగ్ ని జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.
క్షణికావేశంలోనో లేదో ప్రతీకారంతోనో దాడులు, హత్యలు చేస్తుంటారు. కానీ డబ్బులకోసం హత్యలు చేయడం, దాడులు చేయడం నెల్లూరు జిల్లా సంస్కృతి కాదు. దానికోసం వేరే ప్రాంతాలనుంచో లేక ఇతర రాష్ట్రాలనుంచో కొన్ని ముఠాలు జిల్లాకు వచ్చిన ఉదాహరణలున్నాయి. కానీ ఇప్పుడు నెల్లూరులోనే సుపారీ గ్యాంగ్ లు తయారయ్యాయి. డబ్బులిస్తే మట్టుబెడతారు, కాలు, చెయ్యి తీసేస్తారు, లేదా వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారు. అంతా డీల్ ప్రకారం జరిగిపోతుంది. డబ్బులిస్తే ఎలాంటి పని చేయడానికైనా తయారయ్యే బ్యాచ్ లు నెల్లూరులో కూడా పుట్టుకొస్తున్నాయి. అలాంటి సుపారీ గ్యాంగ్ ని జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.
టాస్క్ – 1 బుచ్చి మండలం రామచంద్రాపురంలోని ఓ ఇంట్లో దొంగతనానికి పథకం వేశారు.
టాస్క్ – 2 నెల్లూరులోని ఓ ఇంట్లో రూ.30 లక్షల విలువైన ఆస్తిపత్రాలు దొంగిలించి మరో వ్యక్తికి అప్పగించేందుకు సుపారీ మాట్లాడుకున్నారు.
టాస్క్ – 3 నెల్లూరు నవాబుపేటలో ఓ వ్యక్తి అపహరణకు 5 లక్షల రూపాయలకు డీల్ సెట్ చేసుకున్నారు.
టాస్క్ – 4 సంగం పరిధిలో ఒకరి హత్యకు 5 లక్షల రూపాయల ఒప్పందం కుదుర్చుకున్నారు.
టాస్క్ – 5 కోవూరులో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఒకరిని హత్య చేసేందుకు కిరాయి తీసుకుని పథక రచన చేశారు.
ఈ 5 నేరాలు చేసేందుకు సుపారీ గ్యాంగ్ అడ్వాన్స్ లు తీసుకుంది. కానీ వీటిలో ఏ ఒక్కటీ చేయకుండానే పోలీసులకు చిక్కింది. అన్నిటికీ పథకాలు రెడీ చేసుకున్నారు. క్రమంగా తమ ప్లాన్ అమలు చేయాలనుకున్నారు. రెక్కీ చేస్తుండగా ఒక కేసులో పోలీసులకు దొరికి, మిగతా వివరాలన్నీ బయటపెట్టారు. కావలి డివిజన్ అల్లూరులో పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు. నెల్లూరు జిల్లా ఏఎస్పీ హిమవతి ఈ ముఠా వివరాలు మీడియాకు వెల్లడించారు.
ఐదుగురితో ముఠా..
అల్లూరు మండలం అల్లూరుపేటకు చెందిన పర్యాని కార్తిక్, ఆర్డీఆర్ కాలనీకి చెందిన యనమల మోహన్‌కృష్ణ, కోనేరు సర్కిల్ కి చెందిన కంది శివప్రసాద్, కోవూరు మండలం పోతిరెడ్డిపాలెంకు చెందిన శానంపూడి మహేష్, నెల్లూరు బాలాజీనగర్ కు చెందిన తువ్వర వంశీకృష్ణ.. వీరంతా పాత నేరస్థులు. గతంలో నేరాలు చేసిన అనుభవమే వీరిని దగ్గర చేసింది. వీరంతా ఓ ముఠాగా ఏర్పడి నేరాలు చేయాలనుకున్నారు. చివరకు పోలీసులకు చిక్కారు.
ఎలా దొరికారంటే..?
అల్లూరు ఎస్సై పి.శ్రీనివాసులురెడ్డి సింగపేట కూడలిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా, కారులో వస్తున్న నిందితులు పోలీసులను గమనించి పారిపోయేందుకు ప్రయత్నించారు. అది చూసిన పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు. స్టేషన్‌కు తీసుకువెళ్లి విచారించి, పాత నేరస్థులని కనిపెట్టారు. ఆ తర్వాత అసలు విషయం బయటపడింది. గతంలో చేసిన దొంగతనాలు బయటపెట్టారు. ఈ నెల 14న అల్లూరు గ్రామంలోని ఆర్డీఆర్ కాలనీలో ఓ ఇంట్లో రెండు ల్యాప్ టాప్ లు వీరు చోరీ చేశారు. గతంలో కలువాయి సమీపంలోని ఓ మామిడి తోటలో ఉన్న వ్యక్తిని బంధించి బంగారు నగలు, రూ. 70వేల నగదు దోచుకున్నారు. మిగతా వ్యవహారాలన్నీ విచారణలో బయటపడ్డాయి. ఐదు నేరాలు చేసేందుకు ఆల్రడీ సుపారీ తీసుకున్నా ఈ ఐదుగురిని పోలీసులు కటకటాల వెనక్కు నెట్టారు.