Nellore News : ఖమ్మంలో చిగురించిన ప్రేమ, నెల్లూరు పోలీస్ స్టేషన్ లో పంచాయితీ
పెళ్లి చేసుకున్న ఓ ప్రేమజంట తల్లిదండ్రులనుంచి అపాయం ఉంటుందని నెల్లూరు పోలీసులను ఆశ్రయించారు.
ప్రేమజంట రక్షణ కోరుతూ నెల్లూరు జిల్లా పోలీసుల్ని ఆశ్రయించింది. పెద్దలు తమ వివాహానికి ఒప్పుకోలేదని, వారినుంచి హాని ఉందని అనుమానిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు నూతన దంపతులు. ఐదు రోజుల క్రితం వీరి వివాహం జరిగింది. ఐదు రోజులుగా ఇంట్లో వాళ్లకి కనపడకుండా తలదాచుకున్న వారు, చివరకు బంధువుల సాయంతో నెల్లూరు జిల్లా కొండాపులం పోలీసుల్ని ఆశ్రయించారు. తమకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు. పోలీసులు వారి ఫిర్యాదు స్వీకరించారు, వారికి రక్షణగా ఉంటామన్నారు. వారిద్దరూ మేజర్లు కావడంతో వారి పెళ్లికి వచ్చిన ఇబ్బందేమీ లేదని భరోసా ఇచ్చారు. రెండు కుటుంబాలకు సమాచారం తెలియపరిచారు. వారిని ఇబ్బంది పెట్టొద్దని సూచించారు.
పామూరు మండలం కుంటపల్లికి చెందిన గురవయ్య, వరలక్ష్మి దంపతులు కొన్నాళ్ల క్రితం ఖమ్మం వెళ్లి స్థిరపడ్డారు. వారికి గురుబ్రహ్మం అనే కొడుకు ఉన్నాడు. గురుబ్రహ్మంతో కలసి ఖమ్మంలోనే వారు నివశిస్తున్నారు. వారి ఇంటికి దగ్గర్లోనే ఉండే యువతి కుటుంబంతో కలసి నివశిస్తోంది. గురుబ్రహ్మానికి, యువతికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. కులాలు వేరు కావడంతో ఇంట్లో ఒప్పుకోరని వారు నిర్థారించుకున్నారు. చూచాయగా విషయం తెలియపరిచినా ఇంట్లో కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పెద్దల్ని ఒప్పించి ఒకటి కావడం కుదరదని వారు గ్రహించారు. ఇంట్లో చెప్పకుండా వారిద్దరూ పారిపోయారు.
గురుబ్రహ్మం, యువతి గుడిలో పెళ్లి చేసుకున్నారు. అయితే తల్లిదండ్రుల నుంచి అపాయం ఉంటుందని వారు భయపడ్డారు. గురుబ్రహ్మం బంధువులు నెల్లూరు జిల్లా కొండాపురంలో ఉండటంతో కొత్త జంట వారి ఆశ్రయం కోసం వచ్చింది. బంధవులతో కలిసి గురుబ్రహ్మం, యువతి కొండాపురం పోలీసులను ఆశ్రయించారు. తమకు రక్షణ కల్పించాలని కోరారు. పోలీసులు వారిద్దరూ మేజర్లు అని నిర్థారించుకున్న తర్వాత తల్లిదండ్రులకు ఫోన్ చేసి వివరాలు తెలియజేశారు. వారికి ఎలాంటి హాన తలపెట్టవద్దని చెప్పారు.