Nellore Road Accidents: రోడ్డు ప్రమాదాల నివారణలో నెల్లూరు జిల్లా ఫస్ట్ ప్లేస్, ఎలా సాధ్యమైందంటే
Nellore: ఏపీ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణలో నెల్లూరు జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని తెలిపారు జిల్లా ఎస్పీ విజయరావు. గతేడాదితో పోల్చి చూస్తే 47.27% రోడ్డు ప్రమాదాలు తగ్గాయని చెప్పారాయన.
రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణలో నెల్లూరు జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని తెలిపారు జిల్లా ఎస్పీ విజయరావు. గతేడాదితో పోల్చి చూస్తే 47.27% రోడ్డు ప్రమాదాలు తగ్గాయని చెప్పారాయన. నెల నెలా రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక డ్రైవ్ పెడుతున్నామని, సమీక్షలో ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గినట్టు తేలిందని చెప్పారు. రాష్ట్రంలోనే రోడ్డు ప్రమాదాల నివారణలో నెల్లూరు ప్రథమ స్థానంలో ఉందని, ఈమేరకు ఉన్నతాధికారులు అభినందించారని చెప్పారు ఎస్పీ విజయరావు.
బ్లాక్ స్పాట్స్ గుర్తింపు..
జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని బ్లాక్ స్పాట్ లను గుర్తించి వాహనదారులు, ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమం నిరంతరాయంగా సాగుతుందని తెలిపారు ఎస్పీ. రోడ్డు భద్రతకు సంబందించి అన్ని శాఖల సమన్వయంతో సైన్ బోర్డులు, లైటింగ్ సిస్టం, పెయింటింగ్ వర్క్స్, ట్రాఫిక్ కోన్స్ ఏర్పాట్లు, తదితర అంశాలపై చర్చించి ప్రణాళికలు రూపొందించామన్నారు.
విజిబుల్ పోలీసింగ్..
బ్లాక్ స్పాట్ ప్రాంతాలలో జిల్లా వ్యాప్తంగా హైవేపై హెచ్చరిక బోర్డులు, రేడియం స్టిక్కర్స్, ఇసుక డ్రమ్ముల ఏర్పాటు చేసినట్టు తెలిపారు. విజబుల్ పోలీసింగ్, హైవేపై స్టాపర్స్ ఏర్పాటు వంటి పలు వినూత్న కార్యక్రమాలు నిర్వహించడం వల్ల జిల్లా మొదటి స్థానంలో నిలిచిందన్నారు. ముఖ్యంగా విజిబుల్ పోలీసింగ్ తో సత్ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. బందోబస్తు డ్యూటీల సమయంలోనే కాకుండా.. మిగతా సమయంలో కూడా పోలీసులు ప్రజలకు కనిపించే ప్రయత్నం చేయాలని, అప్పుడే నేరాలు తగ్గుముఖం పడతాయనేది ఎస్పీ ఆలోచన. దానికి అనుగుణంగా విజిబుల్ పోలీసింగ్ ని ఆయన ప్రోత్సహిస్తున్నారు.
హైవే పెట్రోలింగ్ పై ప్రత్యేక శ్రద్ధ..
నెల్లూరు జిల్లానుంచి రెండు ప్రధాన రహదారులు వెళ్తున్నాయి. ఒకటి చెన్నై రహదారి కాగా, మరొకటి ముంబై రహదారి. ఈ రెండు రహదారులపై ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. దీన్ని నివారించేందుకు నెల్లూరు జిల్లా పోలీసులు ఎప్పటికప్పుడు నూతన చర్యలు చేపట్టారు. ప్రతి నెల నేర సమీక్ష సమావేశంలో రోడ్డు ప్రమాదాల నివారణకోసం చర్యలు చేపట్టేవారు. బైక్ పై వెళ్లేటపుడు వాహనదారులకు హెల్మెట్ ప్రాధాన్యత వివరించేందుకు ప్రత్యేక డ్రైవ్ లు చేపట్టారు. స్పీడ్ లెన్స్ గన్స్, బ్రీత్ ఎలైజర్ టెస్ట్ లు నిర్వహిస్తూ ఓ ప్రణాళిక ప్రకారం రోడ్డు ప్రమాదాల నివారణకు కృషిచేశారు. జిల్లా సరిరిహద్దులలో చెక్ పోస్ట్ లు, పికెట్స్ ఏర్పాటు చేసి, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
జిల్లా పోలీసులు చేపట్టిన నివారణ చర్యల కారణంగా నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గింది. గతేడాదితో పోల్చి చూస్తే ప్రతి నెలా ప్రమాదాల సంఖ్య తగ్గుతూనే ఉంది. భవిష్యత్తులో ప్రమాదాల సంఖ్య మరింత తగ్గించేందుకు కృషి చేస్తామన్నారు జిల్లా ఎస్పీ విజయరావు.