Nellore MLA Anil: నెల్లూరు ప్రజల తుపాను కష్టాలు, ఎమ్మెల్యే అనిల్ కి ఎన్నికల కష్టాలు
ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి రిపీట్ అవుతుందేమోనని భయపడుతున్నారు అనిల్. తుపాను కష్టాలు ఎన్నికలప్పుడు ప్రజలు గుర్తు తెచ్చుకుంటే మాత్రం అధికార వైసీపీకి ఇబ్బంది తప్పదు.
ఏపీలో ఎన్నికలకు టైమ్ దగ్గరపడుతోంది. ఈ సమయంలో ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా.. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై అది తీవ్ర ప్రభావం చూపెడుతోంది. ప్రస్తుతం నెల్లూరుకు వచ్చిన తుపాను ముప్పు కూడా ఇలాంటిదే. గతంలో ఎన్నడూ లేనంతగా నెల్లూరు నగరం తుపాను ప్రభావానికి గురైంది. నగరంలోని ప్రధాన రోడ్లన్నీ నీట మునిగాయి. నగరం పరిధిలోకి వచ్చే కొన్ని లోతట్టు ప్రాంతాలు కూడా జలమయం అయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు కానీ, ఆయన కాస్త దిగాలుగానే కనిపించారు. ప్రజలంతా తమ బాధలు చెప్పుకోవడంతో వారిని ఓదార్చారు అనిల్. మోకాళ్ల లోతు నీళ్లలో తానే స్వయంగా నడిచి నగరంలో పర్యటించారు.
నెల్లూరులో ఎప్పుడూ ఇదే సమస్య..
చిన్నపాటి వర్షం పడినా నెల్లూరులో ఇదే సమస్య. నెల్లూరు నగరంలో ఉన్న అండర్ బ్రిడ్జ్ లు నీటమునుగుతాయి. అటునుంచి ఇటు, ఇటునుంచి అటు రాకపోకలు ఆగిపోతాయి. ధైర్యం చేసి ఎవరైనా ముందడుగు వేస్తే అండర్ బ్రిడ్జ్ దగ్గర వాహనం ఆగిపోతుంది. అందుకే ఎవరూ సాహసం చేయరు. ఎన్నికలొస్తున్నాయి, ఎమ్మెల్యేలు మారుతున్నారు కానీ ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనేవారు లేరు.
పరిష్కారం ఏంటి..?
నగరంలో వర్షాలకు నీళ్లు నిలబడకుండా ఉండాలంటే డ్రైనేజీ వ్యవస్థ బాగు చేయాలి, ఆక్రమణలు తొలగించాలి. ఆక్రమణల జోలికెళ్లడానికి నాయకులెవరూ సాహసం చేయరు. అక్కడ ఉండేవారి బాగోగులకంటే వారి ఓట్లు నేతలకు ముఖ్యం. అందుకే చూసీ చూడనట్టు ఉంటారు. వర్షాలు వచ్చినపుడు మాత్రం వారికి పక్కా ఇళ్లు కట్టించి తరలిస్తామంటారు. డ్రైనేజీ వ్యవస్థను బాగుచేయడంతోపాటు.. అండర్ బ్రిడ్జ్ లకు ప్రత్యామ్నాయంగా ఫ్లైఓవర్లు నిర్మించాలి. కనీసం నగర పరిధిలో ఒక ఫ్లైఓవర్ నిర్మించినా అది ప్రజలకు బాగా ఉపయోగపడుతుంది. ఎమ్మెల్యే అనిల్ హయాంలో నెల్లూరు నగరంలో కొత్తగా ఒక ఫ్లైఓవర్ నిర్మించారు కానీ, దానివల్ల ఉపయోగం లేదనే విమర్శలున్నాయి. రోడ్డుపైన ఫ్లైఓవర్ వేశారు కానీ, రైల్వే ట్రాక్ ని దాటి వెళ్లేందుకు ఆ ఫ్లైఓవర్ వేస్తే ఉపయోగం ఉండేదని అంటున్నారు స్థానికులు.
తాజా తుపాను ప్రభావాన్ని కొన్నిరోజుల్లోనే ప్రజలు మరచిపోవచ్చు. కానీ ఎన్నికలప్పుడు ఇలాంటి కష్టాలన్నీ వారికి గుర్తురాక మానవు. వైసీపీ హయాంలోనే పెన్నానదికి వచ్చిన వరదలు కూడా నెల్లూరు నగరంపై తీవ్ర ప్రభావం చూపించాయి. సోమశిల ప్రాజెక్ట్ నుంచి సకాలంలో నీరు విడుదల చేయడం ఆలస్యం కావడంతో.. ఒకేసారి గేట్లన్నీ ఎత్తివేశారు. ఆ ధాటికి నెల్లూరు ప్రాంతంలో పెన్నా ఉగ్రరూపం చూపించింది. దీంతో నగరంపై ఆ ప్రభావం ఎక్కువగా కనపడింది. పొర్లుకట్ట ఇరువైపులా ఉన్న ఇళ్లు కొట్టుకుపోయాయి. అప్పటికప్పుడు పెన్నా పొర్లుకట్ట వద్ద గోడ నిర్మాణం చేడతామన్నా.. ఇప్పటికీ అది పూర్తి కాలేదు. ప్రస్తుతం పెన్నాకు వరదరాలేదు కానీ, తుపాను వల్ల నగరంలో భారీగా నీరు చేరింది.
టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా చేసిన నారాయణ 2019లో నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. సరిగ్గా ఎన్నికలకు ఏడాది ముందు నెల్లూరు నగరంపై నారాయణ చేపట్టిన ఓ ప్రయోగం వికటించడంతో ఆయనపై ప్రజల్లో అసంతృప్తి ఎక్కువైంది. నెల్లూరు నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్ పైప్ లైన్ కోసం రోడ్లన్నీ తవ్వేశారు. ఆ తర్వాత వాటిని పట్టించుకోలేదు. ఎన్నికల టైమ్ వచ్చినా కూడా రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఆ ప్రభావం ఎన్నికల్లో స్పష్టంగా కనపడింది. నారాయణ చేసిన మిగతా అభివృద్ధి పట్టించుకోలేదు జనం. తమకు కలిగిన అసౌకర్యానికి బదులు తీర్చుకున్నారు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి రిపీట్ అవుతుందేమోనని భయపడుతున్నారు అనిల్. తుపాను కష్టాలు ఎన్నికలప్పుడు ప్రజలు గుర్తు తెచ్చుకుంటే మాత్రం అధికార వైసీపీకి ఇబ్బంది తప్పదు. కనీసం ఇప్పటికైనా పాలక పక్షం మేల్కొని, డ్రైనేజీ సమస్య పరిష్కరిస్తుందేమో చూడాలి.