Nellore Politics: 4 ఏళ్లు నెల్లూరు వైపు చూడలేదు, 2024లోనూ నారాయణ ఓడిపోయి హైదరాబాద్ కు మకాం! ఎమ్మెల్యే అనిల్
Nellore YSRCP News: నెల్లూరు సిటీలో ఇంటిపోరుని తట్టుకుని అనిల్ మళ్లీ టికెట్ సాధించగలిగితే నారాయణపై ఆయన పోటీ చేయాల్సి ఉంటుంది. దీంతో నారాయణని ముందునుంటే టార్గెట్ చేస్తున్నారు అనిల్.
Nellore YSRCP News: నెల్లూరు సిటీ ఫైట్ లో 2019లో తన చేతిలో ఓడిపోయిన మాజీ మంత్రి నారాయణ మళ్లీ తన ప్రత్యర్థిగా వచ్చారని, ప్రజా క్షేత్రంలోనే ఎవరి బలం ఏంటో తేల్చుకుందామని అన్నారు వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. నాలుగేళ్లకు పైగా నెల్లూరు వైపు చూడని నారాయణ ఇప్పుడొచ్చి హడావిడి చేస్తున్నారని మండిపడ్డారు. కరోనా టైమ్ లో నారాయణ ఎక్కడకు వెళ్లారని, వరదలొచ్చినప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. 2024లో కూడా నారాయణ ఓడిపోయి హైదరాబాద్ వెళ్లిపోతారని ఎద్దేవా చేశారు. కనీసం ఓట్లు వేసిన నియోజకవర్గ ప్రజల మొహం చూడని నాయకుడిని ప్రజలు ఆదరించరన్నారు.
స్పీడ్ పెంచిన అనిల్..
అనారోగ్యం కారణంగా ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కొన్నిరోజులుగా గడప గడప కార్యక్రమంలో కూడా పాల్గొనలేదు. ఇప్పుడు ఆయన తిరిగి స్పీడ్ పెంచారు. ఓవైపు గడప గడపలో పాల్గంటూనే మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలకు హాజరవుతున్నారు. ఈరోజు ఉదయం 9.00 గంటలకు నగరంలోని రంగనాయకులపేట శ్రీ కళ అపార్ట్మెంట్స్ వద్ద అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఉదయం 9.30 గంటలకు నగరంలోని 54వ డివిజన్ భగత్ సింగ్ కాలనీ జగనన్న లేఔట్ లో విద్యుత్ సబ్ స్టేషన్ కు శంకుస్థాపన చేశారు. 10 గంటలకు 16వ డివిజన్ ఆదిత్య నగర్ లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు.
నెల్లూరు నగరంలోని 54 వ డివిజన్ భగత్ సింగ్ కాలనీ జగనన్న లేఅవుట్ లో రూ.4.5 కోట్లతో జగనన్న కాలనీ కి సంబంధించి ఒక సబ్ స్టేషన్, 5వ డివిజన్ కు సంబంధించి బోడిగాడితోటలో మరో సబ్ స్టేషన్ లకు ఎమ్మెల్యే అనిల్ శంకుస్థాపన చేసారు. ఇప్పటి వరకు నగర నియోజకవర్గంలో రూ.65 కోట్లతో విద్యుత్ సబ్ స్టేషన్ ల నిర్మాణం, విద్యుత్ విభాగానికి సంబంధించి ఖర్చు చేశామన్నారు అనిల్.
నెల్లూరులో మళ్లీ టఫ్ ఫైట్..
2019లో నెల్లూరు సిటీలో నారాయణపై స్వల్ప మెజార్టీతో గెలిచారు అనిల్ కుమార్ యాదవ్. 2024లో కూడా వీరిద్దరి మధ్యే పోటీ అనివార్యంగా మారింది. నెల్లూరు సిటీలో ఇంటిపోరుని తట్టుకుని అనిల్ మళ్లీ టికెట్ సాధించగలిగితే నారాయణపై ఆయన పోటీ చేయాల్సి ఉంటుంది. దీంతో నారాయణని ముందునుంటే టార్గెట్ చేస్తున్నారు అనిల్. ఆయన ప్రజలకు అందుబాటులో ఉండరని అంటున్నారు. 2019లో ఓడిపోయిన తర్వాత నారాయణ హైదరాబాద్ వెళ్లిపోయారని, అక్కడ పార్టీ ఆఫీస్ లో ఉన్నానని కబుర్లు చెబుతున్నారని, ఓట్లు వేసిన నెల్లూరు ప్రజల్ని మాత్రం ఆయన మరచిపోయారని ఎద్దేవా చేశారు అనిల్. నెల్లూరులో వరదలు వచ్చినప్పుడు తానే దగ్గరుండి ప్రజల కష్టాలు తీర్చానని, కరోనా టైమ్ లో కూడా తానే నెల్లూరులో ఉండి ప్రజల బాగోగులు చూసుకున్నానని వివరించారు. నారాయణ పక్కా బిజినెస్ మేన్ అని, ఆయన మళ్లీ ఓడిపోయి నెల్లూరు వదిలి వెళ్లిపోతారని, ఇక్కడ ప్రజలతో ఆయనకు సంబంధం లేదన్నారు.
అనిల్ కు నారాయణతోపాటు, ఇంటిపోరు కూడా బాగానే ఉంది. ఆయనకు నెల్లూరు సిటీ నుంచి టికెట్ రాకుండా చూడాలని చాలామంది ప్రయత్నిస్తున్నారు. ఆయనపై జగన్ కు చాలానే ఫిర్యాదులందాయి. అయితే అనిల్ మాత్రం ఈసారి కూడా నెల్లూరు సిటీ టికెట్ తనదేననే ధీమాగా ఉన్నారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial