![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Narayana House Searched: మాజీమంత్రి నారాయణ ఇల్లు, ఆస్పత్రిలో ఔషధ నియంత్రణ అధికారుల సోదాలు
Narayana House Searched:మాజీమంత్రి నారాయణ ఇల్లు, ఆస్పత్రిలో డ్రగ్స్ కంట్రోలర్ అధికారులు తనికీలు చేయడమేగాక...అల్మారాల తాళాలు పగులగొట్టి సోదాలు చేశారు.
![Narayana House Searched: మాజీమంత్రి నారాయణ ఇల్లు, ఆస్పత్రిలో ఔషధ నియంత్రణ అధికారుల సోదాలు Narayana house and hospital were searched by drug control officials Narayana House Searched: మాజీమంత్రి నారాయణ ఇల్లు, ఆస్పత్రిలో ఔషధ నియంత్రణ అధికారుల సోదాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/10/bdf0e2e023640ff39fa60f955a3e8e831707534935289215_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Narayana News:మాజీమంత్రి నారాయణ ఇంటితోపాటు ఆయనకు చెందిన ఆస్పత్రిలో ఔషధ నియంత్రణ అధికారులు తనిఖీలు చేపట్టారు. శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఆస్పత్రికి వచ్చిన అధికారులు ఔషధ దుకాణంతోపాటు ఇంట్లో సోదాలు నిర్వహించారు. దాదాపు నాలుగున్నర గంటల పాటు తనిఖీలు చేసి పంచనామాపత్రం ఇచ్చి వెళ్లిపోయారు.
నారాయణ ఇంట్లో సోదాలు
మాజీమంత్రి, తెలుగుదేశం సీనియర్ నేత పొంగూరి నారాయణ ఇల్లు, ఆస్పత్రిలో డ్రగ్స్ కంట్రోల్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం ఆయన ఇంట్లో లేని సమయంలో తనిఖీకి వచ్చిన అధికారులు ఆస్పత్రితోపాటు నారాయణ ఇంట్లోనూ సోదాలు చేశారు. నెల్లూరులోని చింతారెడ్డిపాలెంలో ఉన్న నారాయణ వైద్యకళాశాల ఆస్పత్రి ప్రాంగణంలో ఉన్న మందుల దుకాణాంలో అనధికారికంగా, నిబంధనలకు విరుద్ధంగా మందులు విక్రయిస్తున్నారన్న ఫిర్యాదు మేరకు ఫార్మసీ డ్రగ్స్ కంట్రోలర్ అధికారులు దాడులు చేశారు. అనంతరం నారాయణ ఇంటిని సైతం పరిశీలించారు. ఆ సమయంలో నారాయణ భార్య రమాదేవి, మేనేజర్ శ్రీనివాసులు ఇంట్లో ఉన్నారు. వారిద్దరినీ విచారించిన అధికారులు..అనంతరం పై అంతస్తులో ఉన్న అల్మరాలు, కబోర్డులు తెరవాల్సిందిగా ఆదేశించారు. వాటి తాళాలు తమ వద్ద లేవని చెప్పగా వండ్రంగిని పిలిపించి పగులగొట్టించారు. వాటిల్లో ఎలాంటి అనుమానాస్పద ఔషధాలు లభించలేదు . నిబంధనలకు విరుద్ధంగా ఏమీ లభించలేదని నిర్థరించుకున్న తర్వాతే వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఆస్పత్రి వద్ద హడావుడి
నారాయణ ఆస్పత్రిలో ఔషధ నియంత్రణ అధికారుల సోదాలు గురించి తెలుసుకున్న తెలుగుదేశం శ్రేణులు పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు. వైకాపా ప్రభుత్వం కక్షసాధింపులో భాగంగానే ఎన్నికల ముందు ఇలాంటి దాడులకు పాల్పడుతోందని మండిపడ్డారు. నారాయణ ఇంట్లో లేని సమయంలో దాడులు చేయడం ఏంటని వారు ప్రశ్నించారు. తెలుగుదేశం శ్రేణులను భయబ్రాంతులకు గురిచేసేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం విజయం ఖాయమని తెలిసి జగన్‌కు ఏమీపాలుపోక ఇలాంటి దాడులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో అనధికారికంగా మందులు విక్రయిస్తున్నారన్న ఫిర్యాదు వస్తే ఆస్పత్రిలో మాత్రమే తనిఖీలు చేయాలని ఇంట్లో ఎందుకు సోదాలు నిర్వహించారని వారు ప్రశ్నించారు. ఇలాంటి దాడులతో తెలుగుదేశం నేతలను భయపెట్టలేరని వారు హెచ్చరించారు.
రోగుల పాట్లు
ఆస్పత్రిలో తనిఖీల సందర్భంగా పెద్దఎత్తున పోలీసులను మోహరించారు. డీఎస్పీతోపాటు ఇద్దరు సీఐలు, పలువురు ఎస్‌ఐలతోపాటు 50 మంది వరకు పోలీసులను మోహరించారు. ఆస్పత్రిలోకి వచ్చి వెళ్లే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత అనుమతించారు. దీంతో ఆస్పత్రికి వచ్చే సామాన్య రోగులు ఇబ్బందులకు గురయ్యారని ఆస్పత్రి యాజమాన్యం ఆరోపించింది. ఒక్కసారిగా చుట్టుముట్టిన పోలీసులు, ఔషధ నియంత్రణ అధికారులతో రోగులు, వారి బంధువులు ఒకింత భయాందోళనకు గురయ్యారు. తనిఖీల పేరిట నాలుగు గంటల పాటు అధికారులు అక్కడే ఉండటంతో రోగులకు అందాల్సిన సేవల్లో కొంత అంతరాయం కలిగింది.
భయపడే..బెదిరింపులు
నారాయణ సంస్థల ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడిందని నారాణయ విద్యాసంస్థల జేఎం వేమిరెడ్డి విజయభాస్కర్‌రెడ్డి మండిపడ్డారు. రాజకీయంగా నారాయణను ఎదుర్కొలేక అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇలాంటి చర్యలకు పాల్పడటం తగదన్నారు. సోదాల నెపంతో ఆయన ఇంట్లోని తలుపులు, బీరువాలు పగులగొట్టడమేంటని ఆయన మండిపడ్డారు. దేశవ్యాప్తంగా నారాయణ సంస్థలకు ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయని 600 స్కూల్స్, 400 కాలేజీలకు పైగా నారాయణ ఆధ్వర్యంలో నడుస్తున్నాయని తెలిపారు. రానున్న ఎన్నికల్లో నారాయణ నెల్లూరు నుంచి పోటీలో నిలవనున్నారని తెలిసే ప్రభుత్వం భయపెట్టేందుకు ఇలాంటి దాడులు నిర్వహించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)