Elections: నెల్లూరు జిల్లాలో ఎన్నికల కోలాహలం.. ఇక ప్రచారంలోకి పార్టీలు!
నెల్లూరు జిల్లాలోనూ ఎన్నికల కోలాహలం మెుదలైంది. ఎన్నికలు నిర్వహించేదుకు అధికారులు సిద్ధమయ్యారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని రెండు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల కోలాహలం ఉంది. ఏపీలోని నెల్లూరు జిల్లాలో కూడా దాదాపు ఇదే పరిస్థితి ఉంది. నెల్లూరు నగర కార్పొరేషన్ తోపాటు, బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయితీకి కూడా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు అధికారులు. వీటితోపాటు.. సర్పంచ్, వార్డు సభ్యులు, ఎంపీటీసీ స్థానాలకు కూడా ఉప ఎన్నికలను నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు.
నెల్లూరు జిల్లాలో వివిధ కారణాలతో ఏడు ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. రెండు చోట్ల సర్పంచి స్థానాలకు, 37 వార్డు స్థానాలకు ఖాళీలు ఏర్పడ్డాయి. ఇందులో కొందరు మృతి చెందగా, మరికొందరు రాజీనామాలు చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని 27 మండలాల్లో 35 పంచాయతీల్లో మొత్తం 37 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. నెల్లూరు రూరల్ మండలం, పెళ్లకూరు, సూళ్లూరుపేట, బాలాయపల్లి, కోవూరు, సైదాపురం, కోట మండలాల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ మేరకు ఇప్పటికే అధికారులు ఓటర్ల జాబితాలను సిద్ధం చేసి పోలింగ్ కేంద్రాలను గుర్తించి పరిశీలించారు.
నెల్లూరు నగర కార్పొరేషన్ కి కూడా త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలున్నాయి. మొత్తం 54 డివిజన్లకు ఎన్నికలు జరుగుతాయి. ఇప్పటికే వైసీపీ ప్రచారాన్ని మొదలు పెట్టగా, టీడీపీ కార్పొరేటర్లకు స్థానాలు కేటాయిస్తోంది. అటు బుచ్చి నగరపాలక సంస్థకు కూడా ఎన్నికలు నిర్వహిస్తారు. బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీలో 20 వార్డులకు ఎన్నికలు నిర్వహించి.. ఆ మరుసటి రోజు ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే అధికారులు వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశాలు నిర్వహించారు. వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని కూడా ఇటీవల ఆయా జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్నికల ఏర్పాట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. నోటిఫికేషన్ వెలువడిన వెంటనే జిల్లాలో కోడ్ అమలులోకి వస్తుంది. ప్రస్తుతం బద్వేల్ లో ఉప ఎన్నికల వేడి ఉండగా.. అది చల్లారే లోపు.. నెల్లూరు జిల్లాలో కూడా ఎన్నికల హీట్ మొదలయ్యే అవకాశాలున్నాయి.
Also Read: వైఎస్ఆర్సీపీ ఉగ్రదాడి చేసింది... పోలీసులు దగ్గరుండి మరీ దాడి చేయించారు... వైసీపీపై చంద్రబాబు ఫైర్
Also Read: టీడీపీ వర్సెస్ వల్లభనేని వంశీ... నేతల మధ్య ట్వీట్ వార్