Nellore Adala : జిల్లాల విభజనపై నెల్లూరు వైఎస్ఆర్‌సీపీ ఎంపీ అసంతృప్తి - ఆ నియోజకవర్గాలను మార్చొద్దని సీఎంకు లేఖ !
జిల్లాల విభజన వైఎస్ఆర్‌సీపీకి ఇబ్బందులు సృష్టిస్తోంది. నెల్లూరు జిల్లాలో ఇప్పటికే ఆనం వ్యతిరేక స్వరం వినిపిస్తూండగా తాజాగా ఎంపీ అదాల కూడా సీఎంకు లేఖ రాశారు.
ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్‌సీపీకి ( YSRCP ) జిల్లాల విభజన చిక్కులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఇప్పటి వరకూ సైలెంట్‌గా ఉన్న నేతలు కూడా ఇప్పుడు నోరెత్తుతున్నారు. నెల్లూరు జిల్లాలో ఇప్పటికే వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ( MLA Anam ) తమ అసంతృప్తి వ్యక్తం చేస్తూండగా.. తాజాగా ఎంపీ అదాల ప్రభాకర్ రెడ్డి ( MP Adala Prabhakar Reddy ) కూడా గొంతు సవరించుకున్నారు. జిల్లాల విభజనపై తన అభ్యంతరాలను తెలుపుతూ సీఎం జగన్‌కు ఓ లేఖ రాశారు. అపాయింట్ ఇస్తే స్వయంగా వచ్చి చెబుతానన్నారు.
నెల్లూరు ఎంపీగా అదాల ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. తన నియోజకవర్గంలోని గూడురు ( Gudur ) నియోజకవర్గాన్ని ఆయన నెల్లూరు ( Nellore ) జిల్లాలోనే ఉంచాలని ఉంచాలని కోరుతున్నారు. అంతే కాకుండా నెల్లూరులో కలపాలని అనుకుంటున్న ప్రకాశం జిల్లా కందుకూరును నెల్లూరు జిల్లాలో కలపవద్దని ప్రకాశం జిల్లాలోనే ఉంచాలని అంటున్నారు. పార్టీ హైకమాండ్ ఏమనుకుంటుందో అన్నఉద్దేశంతో చాలా మంది నేతలు నోరెత్తడంలేదు. జిల్లాల విభజనపై అనేక అభ్యంతరాలు ఉన్నాయి. పార్టీపై అంతో ఇంతో అసంతృప్తితో ఉన్న వారు మాత్రం నోరెత్తుతున్నట్లుగా తెలుస్తోంది.
అదాల ప్రభాకర్ రెడ్డి సీనియర్ నేత.. ఎంపీ అయినప్పటికీ వైఎస్ఆర్‌సీపీలో ఆయన పెద్దగా యాక్టివ్‌గా లేరు. గత ఎన్నికలకు ముందు పార్టీలో చేరి టిక్కెట్ తెచ్చుకుని విజయం సాధించారు. ఇప్పటికే వెంకటగిరి ఎమ్మెల్యే ( Venkatagiri ) ఆనం రామనారాయణరెడ్డి తన అసంతృప్తిని తెలియచేస్తూ మూడు మండలాల ప్రజలతో ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. ఆయన పార్టీ పరిస్థితిపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రజల మనోభావాలు పట్టించుకోకుండా విభజన చేస్తే రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే పడుతుందని చెబుతున్నారు. నెల్లూరులో ఆయనకు తోడుగా ఇప్పుడు అాదాల ప్రభాకర్ రెడ్డి కూడా తన వాయిస్ వినిపస్తున్నారు.
ఏపీలో కొత్త జిల్లాల రాజకీయం వైసీపీకి తలనొప్పిగా మారుతోంది. అధికార పార్టీనుంచే నేతలు కొత్త జిల్లాల విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక్క నెల్లూరు జిల్లాలోనే కాదు మొత్తంగా అన్ని జిల్లాల్లోనూ వైఎస్ఆర్‌సీపీలో ఈ జిల్లాల విభేదాలు వెలుగు చూస్తున్నాయి. వీటిని హైకమాండ్ ఎలా సర్దుబాటు చేస్తుందోనన్న ఆ పార్టీ నేతల్లో టెన్షన్ కనిపిస్తోంది. అటు చిత్తూరు జిల్లాలోనే నగరి ( Nagari ) నియోజకవర్గాన్ని కొనసాగించాలంటూ మరో ఎమ్మెల్యే రోజా ( Roja ) డిమాండ్ చేస్తున్నారు. దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ ఉన్న ఇలాంటి పంచాయతీలను వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్ పరిష్కరించాల్సి ఉంది.