Mekapati Family Meets Jagan : మేకపాటి ఫ్యామిలీ నుంచి రాజకీయాల్లోకి మరో వారసుడు!
దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణంతో నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వస్తున్నాయి. నోటిఫికేషన్ వెలువడటాని కంటే ముందే అభ్యర్థిని ఖరారు చేయడానికి సిద్ధమయ్యారు సీఎం జగన్.
దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణంతో నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గానికి ఉపఎన్నికలు వస్తున్నాయి. నోటిఫికేషన్ వెలువడటానికంటే ముందే అభ్యర్థిని ఖరారు చేయడానికి సిద్ధమయ్యారు సీఎం జగన్. మేకపాటి కుటుంబానికే ఆత్మకూరు వైసీపీ టికెట్ ఇస్తారని గతంలో ప్రచారం జరిగింది. గౌతమ్ రెడ్డి భార్య శ్రీ కీర్తి రెడ్డికి అవకాశమిస్తారని అనుకున్నా.. చివరకు మేకపాటి కుటుంబం.. గౌతమ్ సోదరుడు విక్రమ రెడ్డిని రాజకీయాల్లోకి తేవాలని నిర్ణయించింది. ఇప్పటి వరకూ వ్యాపార కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్న విక్రమ్ రెడ్డి ఇప్పుడు రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రేపు అధికారికంగా ఖరారు..
మేకపాటి కుటుంబం విక్రమ్ రెడ్డి పేరు ఖరారు చేసింది. కానీ పార్టీ తరపున ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. కనీసం విక్రమ్ రెడ్డి, జగన్‌ని కలసిన దాఖలాలు కూడా లేవు. ఈ కార్యక్రమానికి మహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డికి రేపు(గురువారం) సీఎం జగన్ అపాయింట్మెంట్ ఇచ్చారు. రాజమోహన్ రెడ్డితోపాటు, ఆయన తనయుడు విక్రమ్ రెడ్డి కూడా జగన్‌తో భేటీ కాబోతున్నారని తెలుస్తోంది. ఈ భేటీ తర్వాత జగన్ నేరుగా అభ్యర్థి పేరుని ప్రకటించే అవకాశముంది.
సజ్జలతో చర్చలు..
విక్రమ్ రెడ్డి పేరు ఖరారు చేసే విషయంలో కూడా మేకపాటి కుటుంబంతో పలు దఫాలుగా సజ్జల రామకృష్ణారెడ్డి చర్చించినట్టు తెలుస్తోంది. రాజ్యసభ సభ్యుడు, ప్రస్తుత జిల్లా పార్టీ అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కూడా ఈ విషయమై చర్చించారు. చివరిగా మేకపాటి కుటుంబ సభ్యులంతా విక్రమ్ రెడ్డికే ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశమివ్వాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ ఏకాభిప్రాయాన్ని సీఎం జగన్ ముందు ఉంచబోతున్నారు. జగన్ వారి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని విక్రమ్ రెడ్డి పేరు ఖరారు చేయబోతున్నారు.
విక్రమ్ రెడ్డి ఐఐటీ చెన్నైలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. అమెరికాలో కన్ స్ట్రక్షన్ మేనేజ్మెంట్ లో ఎం.ఎస్ చేశారు. గౌతమ్ రెడ్డి రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత.. వారి కుటుంబ సంస్థ కేఎంసీ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు అనివార్య పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వస్తున్నారు.
పోటీ అనివార్యమేనా..?
గౌతమ్ రెడ్డి మరణం తర్వాత ఆయనను అజాత శత్రువంటూ అన్ని పార్టీల నేతలు ఆకాశానికెత్తేశారు. అన్ని పార్టీల నేతలు ఆయన అంత్యక్రియల కార్యక్రమానికి హాజరయ్యారు, మేకపాటి కుటుంబానికి తాము అండగా ఉంటామన్నారు. అయితే ఎన్నికలు వస్తే మాత్రం ఇప్పుడు పోటీ అనివార్యంగా మారింది. ఇప్పటికే బీజేపీ తాము పోటీలో ఉంటామని చెప్పింది. బీజేపీ తరపున టికెట్ వచ్చినా, రాకపోయినా తాను మాత్రం పోటీలో ఉంటానని మేకపాటి రాజమోహన్ రెడ్డి మేనల్లుడు బిజివేముల రవీంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే టీడీపీ ఇక్కడ పోటీకి దూరంగా ఉండే అవకాశముంది. దివంగత నేత కుటుంబ సభ్యులకు టికెట్ ఇచ్చారు కాబట్టి.. టీడీపీ తన ఆనవాయితీ ప్రకారం పోటీకి దూరంగా ఉండొచ్చు. బీజేపీతోపాటు, మైనార్టీలకు చెందిన మరో పార్టీ, స్వతంత్ర అభ్యర్థులు కూడా బరిలో దిగేందుకు అవకాశముంది. మొత్తమ్మీద ఏపీలో త్వరలో ఉపఎన్నికల వేడి మొదలు కాబోతోంది.