నెల్లూరు జిల్లాలో మహిళా పంచాయతీ సెక్రటరీకి వేధింపులు
మహిళా పంచాయతీ సెక్రటరీ ప్రియాంక అవస్థ ఇది. కనీసం మెడికల్ లీవ్ కూడా ఇవ్వకుండా ఆమెను వేధిస్తున్నారు నెల్లూరు జిల్లా కలిగిరి ఎంపీడీవో కళాధర్ రావు. మెడికల్ లీవ్ తన పరిధిలో లేదని చెప్పి తప్పించుకుంటున్నారు
మహిళా పంచాయతీ సెక్రటరీ ప్రియాంక అవస్థ ఇది. కనీసం మెడికల్ లీవ్ కూడా ఇవ్వకుండా ఆమెను వేధిస్తున్నారు నెల్లూరు జిల్లా కలిగిరి ఎంపీడీవో కళాధర్ రావు. సెలవు ఎందుకివ్వట్లేదు అని అడిగితే మెడికల్ లీవ్ తన పరిధిలో లేదని చెప్పి తప్పించుకుంటున్నారు. రెండు కాళ్లకు గాయాలై నడవలేని పరిస్థితిలో ఉన్న ఆమె ఇప్పుడు సెలవు కోసం ఎంపీడీవో ఆఫీస్ చుట్టూ తిరుగుతోంది.
నెల్లూరు జిల్లా కలిగిరి మండలం శిద్ధనకొండూరు గ్రామపంచాయతీలో కార్యదర్శిగా పనిచేస్తున్నారు ప్రియాంక. ఆమెకు ఇటీవల రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లకు గాయాలయ్యాయి. గాయాల కారణంగా ఆమె సెలవు పెట్టారు. అయితే సడన్ గా సచివాలయ ఉద్యోగుల గ్రూప్ లో ఆమె సెలవు పూర్తయినట్టు తిరిగి వెంటనే విధులకు హాజరు కావాలంటూ ఎంపీడీవో మెసేజ్ పెట్టారు. అదేంటని అడిగితే.. మెడికల్ లీవ్ ఇచ్చే అధికారం తనకు లేదని చెప్పారు. దీంతో ప్రియాంక తన తల్లిదండ్రులతో ఎంపీడీవోని కలిసేందుకు వచ్చింది. కాళ్లు విరిగి నడవలేక పోతున్నా అధికారులు తన ఆరోగ్యాన్ని పట్టించుకోవంలేదని వాపోయింది. తనకు న్యాయం చేయాలని మెడికల్ లీవ్ కి అర్హత ఉన్నా ఇవ్వకపోవడం దారుణం అని అన్నారు. ప్రియాంక తల్లి కూడా అధికారుల తీరుని ఎండగట్టారు. ఆమె మెడికల్ సర్టిఫికెట్లు చూపిస్తున్నా కాదు, కుదరదని చెప్పడం సరికాదన్నారు. తన తోటి ఉద్యోగులకు మెడికల్ లీవ్ ఇస్తున్నప్పుడు, తనకెందుకు ఇవ్వరని ప్రియాంక అధికారుల్ని నిలదీశారు. కలిగిరి మండల అధికారుల తీరు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
గ్రూప్ -1తో సంబంధం ఏంటి..
మహిళా సెక్రటరీకి సెలవలు ఇవ్వకపోవడానికి కారణం గ్రూప్-1 ఎగ్జామ్ అని చెప్పడం విచిత్రంగా తోస్తోంది. ఇటీవల సచివాలయం ఉద్యోగులు చాలామంది గ్రూప్ -1 ఉద్యోగాలకోసం ప్రిపేర్ అవుతున్నారు. వీరంతా లాంగ్ లీవ్ పెట్టి వెళ్లిపోతున్నారు. ఈ దశలో ప్రభుత్వం ఉద్యోగులకు సెలవలు ఇవ్వడంపై కఠినంగా వ్యవహరిస్తోంది. ఇలా అందరూ సెలవు పెట్టి వెళ్లిపోతే పాలన ఎలా సాగుతుందని అంటున్నారు ఎంపీడీవో. అందుకే సెలవలు ఇవ్వడంలేదంటున్నారు.
ప్రియాంక ఆందోళన..
ఉద్యోగంలో చేరినప్పటినుంచి ఇప్పటి వరకు మూడుసార్లు తనను డిప్యుటేషన్ పై పంపించారని, తానేమీ ఇబ్బంది పడకుండా ఎక్కడ పోస్టింగ్ ఇస్తే అక్కడకు వెళ్లి పనిచేశానని చెబుతున్నారు ప్రియాంక. చివరకు రోడ్డు ప్రమాదంలో గాయపడితే తనకు ప్రభుత్వం ఇచ్చే బహుమతి ఇదా అని ప్రశ్నిస్తున్నారు. విధులకు వచ్చే క్రమంలో తాను మరింత ఇబ్బందికి గురవుతానని అంటున్నారామె. కాలు ఎముక చిట్లడంతో నడవలేని స్థితిలో ఉన్నానని, సెలవు ఇవ్వాలని వేడుకున్నా కుదరదని అధికారులు చెప్పడం సరికాదంటున్నారు.
జిల్లాలో ఇప్పుడీ విషయం చర్చనీయాంశంగా మారింది. పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీవో మధ్య జరిగిన చర్చ, గొడవ జిల్లాలో సంచలనంగా మారింది. అటు ఉన్నతాధికారులు మాత్రం గ్రూప్-1 పరీక్ష వల్ల చాలామంది ఇలా సెలవలు అడుగుతున్నారని చెబుతున్నారు. కొంతమంది మెడికల్ సర్టిఫికెట్లు తీసుకొస్తున్నారని అంటున్నారు. అయితే ఇక్కడ ప్రియాంకది న్యాయబద్ధమైన డిమాండ్ అని, ఆమెకు కచ్చితంగా సెలవు ఇవ్వాల్సిందేనని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.