నెల్లూరు నుంచి ఇంకెవరు వస్తారు? లోకేష్‌తో గిరిధర్ రెడ్డి భేటీ
ఇప్పటికే నెల్లూరు జిల్లాలో వైసీపీ నుంచి 3వికెట్లు పడ్డాయి. జిల్లాలో ఇంకా ఎవరెవరు వైసీపీపై గుర్రుగా ఉన్నారనే విషయాన్ని ఆరా తీశారు లోకేష్. అసంతృప్తులు ఎవరు, వారి ప్లాన్స్ ఏంటని గిరిధర్ రెడ్డిని అడిగారు
ఇటీవలే టీడీపీలో చేరిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి సోదరుగు గిరిధర్ రెడ్డి.. కార్యక్షేత్రంలోకి దిగారు. పసుపు కండువా మెడలో పడిన వెంటనే నెల్లూరు రూరల్ లో ఆయన టీడీపీ నాయకులతో సమావేశమయ్యారు. స్థానిక నేతలతో మంతనాలు జరిపారు. ఈరోజు ఆయన యువగళం పాదయాత్రలో నారా లోకేష్ తో కలసి పాల్గొన్నారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో లోకేష్ యువగళం పాదయాత్రకు మద్దతు తెలిపిన గిరిధర్ రెడ్డి, టీడీపీ నాయకులతో మమేకం అయ్యారు, పాదయాత్రలో పాల్గొన్నారు.
40నిమిషాలు భేటీ..
నారా లోకేష్ సహా ఇతర సీనియర్ నేతలతో కోటంరెడ్డి గిరిధ్ రెడ్డి దాదాపు 40నిమిషాలు మంతనాలు సాగించారు. లంచ్ బ్రేక్ సమయంలో లోకేష్, గిరిధర్ రెడ్డిని నెల్లూరు జిల్లా రాజకీయాలపై వివరాలు అడిగి తెలుసుతున్నారు. పార్టీ కోటంరెడ్డి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు లోకేష్. నెల్లూరు జిల్లాలో టీడీపీని మరింత బలోపేతం చేయాలని సూచించారు.
ఎవరెవరు వస్తారు..?
ఇప్పటికే నెల్లూరు జిల్లాలో వైసీపీ నుంచి మూడు వికెట్లు పడ్డాయి. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తరపున ఆయన తమ్ముడు టీడీపీలో చేరారు. ఆనం కుటుంబం నుంచి కొత్తగా చేరికలేవీ లేవు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మనోగతం ఇంకా బయటపెట్టలేదు. అయితే వీరంతా వైసీపీకి వ్యతిరేకంగా, టీడీపీతో చేతులు కలుపుతారని అంటున్నారు. వీరితోపాటు నెల్లూరు జిల్లాలో ఇంకా ఎవరెవరు వైసీపీపై గుర్రుగా ఉన్నారనే విషయాన్ని ఆరా తీశారు లోకేష్. జిల్లాలో అసంతృప్తులు ఎవరెవరు, వారి ప్లాన్స్ ఏంటి అనే విషయాలు అడిగి తెలుసుకున్నారు.
10కి 10 మనకే రావాలి..
2019 ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. 10కి 10 ఎమ్మెల్యే స్థానాలు, నెల్లూరు, తిరుపతి లోక్ సభ స్థానాలు కూడా టీడీపీకే దక్కాయి. కానీ ఈసారి అలాంటి పరిస్థితి ఉండకూడదన్నారు నారా లోకేష్. జిల్లాలో 10కి 10 స్థానాల్లో టీడీపీ గెలిచేందుకు కృషి చేస్తామని లోకేష్ కి హామీ ఇచ్చారు గిరిధర్ రెడ్డి. ఆమేరకు అందర్నీ కలుపుకొని వెళ్తామన్నారు.
గత ఎన్నికల సమయంలో జగన్ పాదయాత్రను నెల్లూరు జిల్లాలో విజయవంతం చేసేందుకు లో కోటంరెడ్డి సోదరులు చెమటోడ్చిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలనాటికి పరిస్థితులు తారుమారయ్యాయి. నారా లోకేష్ యువగళం యాత్ర నెల్లూరు జిల్లాలో విజయవంతం చేయడానికి కోటంరెడ్డి సోదరులు ఇప్పటినుంచే ప్రణాళిక రచించారు. 300 కార్లతో ఇటీవల చేరికల ర్యాలీని ప్రత్యర్థులు అదిరిపోయేలా ప్లాన్ చేశారు గిరిధర్ రెడ్డి. ఇక జిల్లాలో లోకేష్ యువగళం పాదయాత్రను మరో లెవల్ కి తీసుకెళ్తామంటున్నారు.
నెల్లూరు రూరల్ లో ఈసారి టీడీపీ టికెట్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికే ఖాయమైంది. ఇప్పటికే అక్కడ స్థానిక నాయకులు ఉన్నా కూడా వారిని కాదని రూరల్ టికెట్ ని శ్రీధర్ రెడ్డికే కేటాయిస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు. అందుకే ముందుగా గిరిధర్ రెడ్డి పార్టీలో చేరారు. రూరల్ సీటు కచ్చితంగా గెలవాలని, మిగతా సీట్లలో కూడా పార్టీ గెలుపుకి కృషి చేయాలని సూచించారు నారా లోకేష్. గిరిధర్ రెడ్డితోపాటు, నెల్లూరు జిల్లా టీడీపీ నేత వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి, దాట్ల చక్రవర్ధన్ రెడ్డి, ఒట్టూరు సురేంద్ర యాదవ్ తదితరులు నారా లోకేష్ ని కలిశారు.