Kakani Govardhan Reddy Arrest: వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్ట్- ఏపీకి తరలిస్తున్న పోలీసులు
Andhra Pradesh News | ఏపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని క్వార్జ్ అక్రమాల కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటకలో అదుపులోకి తీసుకున్న పోలీసులు కాకాణిని ఏపీకి తరలిస్తున్నారు.

former AP minister Kakani Govardhan Reddy | అమరావతి: వైసీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్టయ్యారు. క్వార్జ్ అక్రమాల కేసులో కాకాణిని ఏపీ పోలీసులు కేరళలో అదుపులోకి తీసుకున్నారు. ఫిబ్రవరి నెలలో కాకిణిపై క్వార్జ్ అక్రమ తవ్వకాలు, రవాణా, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగంపై పొదలకూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పరారీలో ఉన్న మాజీ మంత్రి కాకాణిని పోలీసులు కర్ణాటకు వెళ్లి వెళ్లి అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. గుంటూరు రేంజ్ పోలీసులు బెంగళూరులో కాకాణిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఆయనను అక్కడి నుంచి సోమవారం ఉదయం నెల్లూరుకు తరలించే అవకాశం ఉంది.
కాకాణి అరెస్ట్ సమాచారం అందడంతో నెల్లూరు జిల్లా వైసీపీ శ్రేణులు అలర్ట్ అయ్యాయి. మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరులోని వైసీపీ కార్యాలయానికి చేరుకున్నారు. కాకాణిని ఏపీకి తరలించి, ఏ క్షణంలోనైనా కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున పార్టీ కార్యాలయానికి చేరుకుంటున్నారు.
క్వార్జ్ తవ్వకాలపై ఫిర్యాదు, పేలుడు పదార్థాలు వినియోగం
గత వైసీపీ హయాంలో నెల్లూరు జిల్లాలోని వరదాపురం సమీపంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి క్వార్జ్ ఖనిజాన్ని టన్నుల కొద్దీ తవ్వి తరలించారని మైనింగ్ అధికారి బాలాజీ నాయక్ ఫిర్యాదు చేశారు. ఎలాంటి పర్మిషన్ లేకుండా పేలుడు పదార్థాలు భారీగా వినియోగించారని, క్వార్జ్ తవ్వి అక్రమంగా తరలించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదుతో ఫిబ్రవరి 16న పొదలకూరు పోలీసులు మాజీ మంత్రి కాకాణిపై కేసు నమోదు చేశారు.
కోర్టులో దక్కని ఊరట..
ఈ కేసులో కాకాణి నాలుగో నిందితుడిగా ఉన్నారు. ముందస్తు బెయిల్ పిటిషన్ కోరగా హైకోర్టు, సుప్రీంకోర్టులలో ఊరట దక్కలేదు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలన్న పిటిషన్లను సైతం కోర్టులు కొట్టివేయడంతో మాజీ మంత్రి కాకాణికి ఉచ్చు బిగుసుకుంది. కోర్టుల్లో ఊరట దక్కకపోవడంతో గత కొంతకాలం నుంచి పరారీలో ఉన్న కాకాణిని కర్ణాటకలో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకుని రాష్ట్రానికి తరలిస్తున్నారు.






















