Nellore News: వామ్మో వాలంటీర్- పింఛన్ సొమ్ముపైనే కన్నేశాడు- చివరకు..
సామాజిక పింఛన్ సొమ్ముని దోచుకెళ్లారనే సమాచారంతో పోలీసులు ఈ కేసుని సీరియస్ గా తీసుకున్నారు. వెంటనే స్పెషల్ టీమ్ లను ఏర్పాటు చేసి గాలించారు. ఎట్టకేలకు పట్టుకున్నారు.
నెల్లూరులో ఇటీవల సామాజిక పింఛన్ల సొమ్ముని కొంతమంది దొంగలు ఎత్తుకెళ్లారు. అల్లూరుకి చెందిన వెల్ఫేర్ అసిస్టెంట్ బ్యాంకు నుంచి నగదు డ్రా చేసుకుని వెళ్తుండగా వెనకనుంచి మాటు వేసిన దొంగలు బైక్ పై ఉన్న క్యాష్ బ్యాగ్ ని తీసుకెళ్లారు. ఆ తర్వాత వెల్ఫేర్ అసిస్టెంట్ వారిని వెంబడించినా ఫలితం లేదు, వెంటనే అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. అయినా సరే దొంగల ఆచూకీ దొరకలేదు. తాజాగా వారిని పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు కేసు వివరాలు తెలియజేశారు. ఈ కేసు ఛేదనలో చొరవ చూపించిన పోలీసులకు ఆయన క్యాష్ రివార్డ్ లు అందించారు. వారిని అభినందించారు.
అసలేం జరిగింది... ?
ఈ నెల సామాజిక పింఛ్ల పంపిణీ కోసం అల్లూరుకి చెందిన వెల్ఫేర్ అసిస్టెంట్ బ్యాంక్ లో సొమ్ము డ్రా చేసుకుని వెళ్తున్నాడు. బైక్ పై ముందు బ్యాగ్ లో క్యాష్ పెట్టుకుని వెళ్తున్నాడు. వెనకనుంచి స్పీడ్ గా ఓ బైక్ లో ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఆ బైక్ లో వెనక కూర్చున్న వ్యక్తి క్యాష్ బ్యాగ్ ని ఒడిసి పట్టుకున్నాడు. వెంటనే బైక్ స్పీడ్ పెంచి అక్కడినుంచి జారుకున్నారు.
మాజీ వాలంటీర్..
ఈ దొంగతనంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి పేరు నరేంద్ర. ఇతను మాజీ వాలంటీర్. ఆ తర్వాత వైన్ షాపులో పనికి కుదిరాడు. సామాజిక పింఛన్ సొమ్ముని బ్యాంక్ నుంచి ఎవరు తీసుకొస్తారు, ఏరోజు తీసుకొస్తారు, ఎలా పంపిణీ చేస్తారనే విషయాలన్నీ అతనికి తెలుసు. ఆ నాలెడ్జ్ తోనే ఓ టీమ్ ఏర్పాటు చేసుకున్నారు. వీరంతా క్రైమ్ సినిమాలు చూసి దొంగతనాలు ఎలా చేయాలో నేర్చుకున్నారు. గతంలో బిట్రగుంట వద్ద ఓ దొంగతనం చేశారు. 2 లక్షల 33వేల రూపాయలు కాజేశారు. అప్పుడు పోలీసులకి చిక్కలేదు. దీంతో ఈసారి ఏకంగా పింఛన్ సొమ్ముపై కన్నేనశారు. మాజీ వాలంటీర్ నరేంద్ర ఈ టీమ్ కి లీడర్ గా వ్యవహరించాడు. మొద్దం ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం నిందితుల వద్ద 13 లక్షల 56వేల రూపాయల నగదుని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సామాజిక పింఛన్ సొమ్ముని దోచుకెళ్లారనే సమాచారంతో పోలీసులు ఈ కేసుని సీరియస్ గా తీసుకున్నారు. వెంటనే స్పెషల్ టీమ్ లను ఏర్పాటు చేసి గాలించారు. ఎట్టకేలకు పట్టుకున్నారు. నిందితులు గతంలో ఒంగోలులో బైక్ లు దొంగతనం చేశారని, అలా దొంగతనం చేసిన బైక్ ల సాయంతోనే ఇప్పుడీ దొంగతనాలు కూడా చేశారని మీడియాకు తెలిపారు జిల్లా ఎస్పీ విజయరావు.