Vande Bharath: తిరుపతి వందేభారత్ ట్రైన్‌లో పొగలు, రైలు నిలిపివేత - అసలు విషయం తెలిసి అవాక్కు!
పొగ రావడం గమనించిన ప్రయాణికులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో రైలును నెల్లూరు జిల్లా మనుబోలు రైల్వే స్టేషన్ లో నిలిపివేయాల్సి వచ్చింది.
తిరుపతి నుంచి సికింద్రాబాద్ వస్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలులో పొగ రావడం అందర్నీ ఉరుకులు పరుగులు పెట్టించింది. పొగ రావడం గమనించిన ప్రయాణికులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో రైలును నెల్లూరు జిల్లా మనుబోలు రైల్వే స్టేషన్ లో నిలిపివేయాల్సి వచ్చింది. వెంటనే వాకీటాకీల ద్వారా సమాచారాన్ని చేరవేసుకొని అధికారుల సూచనల మేరకు రైలును నిలిపివేశారు. ఆ వెంటనే ప్రయాణికులను కూడా బోగీల్లో నుంచి కిందకి దింపేశారు. ముందు నుంచి మూడో భోగీలో పొగలు వచ్చినట్లుగా అధికారులు గుర్తించారు.
తీరా ఆ బోగీలోకి వెళ్లి అంతా పరిశీలించగా, మూడో బోగీ బాత్ రూమ్ నుంచి పొగలు వచ్చినట్లుగా గుర్తించారు. బాత్ రూమ్‌లో కాల్చి పారేసిన సిగరెట్ ముక్కను ఆర్పకుండా వేయడం వల్ల పొగ వ్యాపించిందని తేల్చారు. ఈ పని చేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. అంతేకాక, అతనికి టికెట్ కూడా లేదని తేల్చారు. ఆ ప్రయాణికుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాత్రూంకి వెళ్లి తలుపు వేసుకొని సిగరేట్ తాగినట్లుగా ప్రయాణికుడు ఒప్పుకున్నాడు. చెలరేగిన పొగను, మంటను పూర్తిగా ఆర్పివేసి రైలును పంపించి వేశారు. దాదాపు అరగంట పాటు రైలును మనుబోలు స్టేషన్ లోనే నిలపాల్సి వచ్చింది. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
వందే భారత్ రైలులో పొగలు
— Telugu Scribe (@TeluguScribe) August 9, 2023
గూడూరు - మనుబోలు మధ్య రైలు నిలిపివేత. తిరుపతి నుంచి హైదరాబాద్ వెళుతుండగా ఘటన.
రైలు టాయిలెట్లో ఓ వ్యక్తి సిగరెట్ తాగడంతో రైలు నిండా పొగలు.#VandeBharat #VandeBharatExpress pic.twitter.com/Vl2tW65oph
సికింద్రాబాద్ - తిరుపతి మధ్య ఏప్రిల్ 8 నుంచి ప్రారంభమైన వందేభారత్ రైలు
ఏప్రిల్ 8న సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ రైలును ప్రారంభించిన సంగతి తెలిసిందే. సికింద్రాబాద్‌లో ఉదయం 6 గంటలకు రైలు ప్రారంభం అవుతుంది. తిరుపతికి మధ్యాహ్నం 14.30 గంటలకు చేరుతుంది. సికింద్రాబాద్ - తిరుపతి రైలు నెంబరు 20701.
మధ్యలో స్టాపులు ఇవే
నల్గొండ 07.19, గుంటూరు 09.45, ఒంగోలు 11.09, నెల్లూరు 12.29
తిరుపతి - సికింద్రాబాద్ రైలు నెంబరు 20702. తిరుపతిలో మధ్యాహ్నం 15.15కు రైలు ప్రారంభం అవుతుంది. సికింద్రాబాద్‌కు రాత్రి 23.45 గంటలకు చేరుతుంది.
మధ్యలో స్టాపులు ఇవీ
నెల్లూరు 17.20, ఒంగోలు 18.30, గుంటూరు 19.45, నల్గొండ 22.10
సెమీ హై స్పీడ్ ట్రైన్
వందేభారత్ రైలును పూర్తిగా ఇండియాలోనే తయారీ చేస్తున్నారు. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారు అవుతూ ఉంది. దీన్ని సెమీ హై స్పీడ్ ట్రైన్‌గా పిలుస్తున్నారు. వందేభారత్‌కు ప్రత్యేక ఇంజిన్ ఉండదు. ఇందులో ఆటోమేటిక్ డోర్లు, ఏసీ చైర్ కార్ వంటివి ఉంటాయి. తక్కువ విద్యుత్తును వినియోగించుకునేలా వీటిని అభివృద్ధి చేస్తున్నారు. ఈ రైళ్లను స్టీల్‌తో కాకుండా తక్కువ బరువు ఉండే అల్యూమినియంతో రూపొందిస్తున్నారు. వందే భారత్ ట్రైల్ రన్స్ సక్సెస్ అవుతుండటంతో.. త్వరలో వాటిని దేశవ్యాప్తంగా ప్రవేశపెడుతారు. ఇవి ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించనున్నాయి. దేశంలో 400 వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు గత కేంద్ర బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇందులో భాగంగా తయారైన ఐదు రైళ్లను పలు ప్రాంతాల్లో పట్టాలెక్కించారు.