Nellore YSRCP : నెల్లూరులో వైఎస్ఆర్‌సీపీ వర్సెస్ వైఎస్ఆర్‌సీపీ - ఫ్లెక్సీ చించేయడంతోనే రాజుకుంది !
నెల్లూరులో కొత్త మంత్రి కాకాణికి శుభాకాంక్షలు చెబుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. ఇది వైఎస్ఆర్‌సీపీ నేల పనేనన్న ఆరోపణలు వస్తున్నాయి.
నెల్లూరు జిల్లాలో పవర్ పాలిటిక్స్ వైఎస్ఆర్‌సీపీకి ఇబ్బందికరంగా మారుతున్నాయి. నెల్లూరుజిల్లాలో గతంలో మంత్రిగా అనిల్ కుమార్ యాదవ్ ఉండేవారు. ఇప్పుడు ఆయనను తప్పించి ఆయన స్థానంలో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డికి చాన్సిచ్చారు. దీంతో వర్గ పోరాటం మరో స్థాయికి చేరుతోంది. మంగళవారం మాజీ మంత్రి అనిల్ ప్రెస్ మీట్ పెట్టి మరీ.. కాకాణి ప్రమాణ స్వీకారానికి తనకు ఆహ్వానం లేదని చెప్పారు. తాను పదవిలో ఉండగా కాకాణి తనపై చూపించిన ప్రేమ, వాత్సల్యాన్ని రెట్టింపు స్థాయిలో చూపిస్తానంటూ నర్మగర్భంగా మాట్లాడారు.
ఏపీ మంత్రి విడదల రజనీ గురించి ఎవరికీ తెలియని విషయం ఇదే !
అనిల్ కుమార్ మంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు వ్యతిరేకంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి రాజకీయాలు నడిపారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే అనిల్ కుమార్ అలా మాట్లాడారన్న అభిప్రాయం వినిపించింది. మంత్రి అనిల్ అలా మాట్లాడిన ఒక్క రోజులోనే... నెల్లూరు టౌన్ లో మంత్రి కాకాణి ఫ్లెక్సీలను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు. కొన్ని చోట్ల మాత్రమే ఫ్లెక్సీలను తొలగించారు. చాలా చోట్ల బాగానే ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధం పేరుతో మున్సిపల్ అధికారులు తొలగించారని అనుకున్నారు. కానీ మున్సిపల్ సిబ్బంది కూడా తాము తొలగించలేదని స్పష్టం చేశారు.
మంత్రి పదవి చేపట్టిన తర్వాత విజయవాడలోనే ఉన్న కాకాణి, మరో మూడు రోజుల్లో నెల్లూరు జిల్లాకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అభిమానులు నెల్లూరు నగరంతోపాటు, సర్వేపల్లి నియోజకవర్గంలో ఫ్లెక్సీలు వేశారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ఫ్లెక్సీలకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ నెల్లూరు టౌన్‌లో మాత్రం చనిగిపోతున్నాయి. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కావడంతో ఆయన అనుచరులే ఇలా చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై వైఎస్ఆర్‌సీపీలోని ఇతర వర్గాలు నోరు మెదపడం లేదు.
తగ్గెదేలే - పట్టువీడని మాజీ హోం మంత్రి సుచరిత, నేడు సీఎం జగన్‌తో భేటీ అవుతారా !
గతంలో ఆనం కుటుంబానికి చెందిన ఫ్లెక్సీలను కూడా మున్సిపల్ అదికారులు తొలగించడం వివాదాస్పదమయింది. అయితే ఫ్లెక్సీలను నిషేధించామని అందుకే తీసేశామని అప్పటి అధికారులు చెప్పారు. ఆ తర్వాత మంత్రిగా ఉన్న అనిల్ కుమార్ ఫ్లెక్సీలు ఎక్కడ చూసినా కనిపించేవి. ఇప్పుడు కొత్తగా కాకాణి ఫ్లెక్సీల వివాదం తెరపైకి వచ్చింది. కాకాణి ఫ్లెక్సీలు తొలగించింది ఎవరు..? అనేది ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఫ్లెక్సీల తొలగింపు ఘటనపై కాకాణి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం చినికి చినికి గాలి వానగా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.