Dance Master Chaitanya: డబ్బుల కోసం ప్రాణం ఆత్మహత్యా? మమ్మల్ని ఎప్పుడూ అడగలేదు - ‘ఢీ’ డ్యాన్స్ మాస్టర్ చైతన్య తల్లి ఆవేదన
తన కొడుక్కి అన్ని సమస్యలున్నా తనతో ఒక్క మాటకూడా చెప్పలేదని అంటున్నారు చైతన్య తల్లి లక్ష్మీరాజ్యం. పెళ్లి చోసుకోనని తనతో చెప్పేవాడని, అనాథ పిల్లల్ని దత్తత తీసుకుంటానని అనేవాడని చెప్పారామె.
![Dance Master Chaitanya: డబ్బుల కోసం ప్రాణం ఆత్మహత్యా? మమ్మల్ని ఎప్పుడూ అడగలేదు - ‘ఢీ’ డ్యాన్స్ మాస్టర్ చైతన్య తల్లి ఆవేదన Dhee dance master chaitanya mother reaction on his suicide in Nellore DNN Dance Master Chaitanya: డబ్బుల కోసం ప్రాణం ఆత్మహత్యా? మమ్మల్ని ఎప్పుడూ అడగలేదు - ‘ఢీ’ డ్యాన్స్ మాస్టర్ చైతన్య తల్లి ఆవేదన](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/01/279e3f4b3f0a31149079479b0cebb9e91682926744563234_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
డాన్స్ మాస్టర్ చైతన్య ఆత్మహత్యకు అసలు కారణం ఏంటి..? అప్పులు తీర్చలేకే తాను చనిపోతున్నానంటూ చైతన్య సెల్ఫీ వీడియో విడుదల చేయడం సంచలనంగా మారింది. అప్పులు తీర్చే సామర్థ్యం ఉన్నా కూడా ఒత్తిడి భరించలేకపోతున్నానని అన్నాడు చైతన్య. అయితే తన కొడుక్కి అన్ని సమస్యలున్నా తనతో ఒక్క మాటకూడా చెప్పలేదని అంటున్నారు చైతన్య తల్లి లక్ష్మీరాజ్యం. పెళ్లి చేసుకోనని తనతో చెప్పేవాడని, అనాథ పిల్లల్ని దత్తత తీసుకుంటానని అనేవాడని చెప్పారామె. ఇటీవలే జామాయిల్ అమ్మగా వచ్చిన 4 లక్షలున్నాయని చైతన్యకు చెప్పానని, ఆ డబ్బులు కూడా అడగలేదని ఆమె చెప్పారు. ఇప్పుడిలా అప్పులకోసం ఆత్మహత్య చేసుకున్నాడంటే తనకేమీ అర్థం కావడంలేదని అన్నారామె. తనకి బిడ్డ అన్యాయం చేశాడని అంటున్నారు. చైతన్య మృతదేహాన్ని నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. బంధువులంతా అక్కడికి చేరుకున్నారు.
డ్యాన్స్ మాస్టర్ చైతన్య ఆత్మహత్య విషయంలో అందరూ షాకయ్యారు. ఆయన కుటుంబ సభ్యులే కాదు, ఆయనతో కలసి పనిచేసినవారు, చేస్తున్నవారు కూడా ఆ విషయం జీర్ణించుకోలేకపోతున్నారు. చైతన్య మంచి మనిషి అని, ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటాడని, ఆర్థిక సాయం చేస్తుంటాడని కూడా అంటున్నారు. మరి చైతన్య సడన్ గా ఇలాంటి నిర్ణయం తీసుకోడానికి గల కారణమేంటి అనేది తేలడంలేదు. చైతన్య కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా మరీ అంత దీనంగా ఏమీ లేదు. తల్లిదండ్రులకు ఆస్తులు, పొలాలు ఉన్నాయి. వాటి ద్వారా ఆదాయం వస్తోంది. కేవలం చైతన్య సంపాదించి పెట్టాల్సినంత పరిస్థితి అయితే లేదు. ఇలాంటి దశలో తల్లిదండ్రులకు కూడా తెలియని ఆర్థిక ఇబ్బందులేం ఉంటాయనేదే ఇప్పుడు ప్రశ్నగా మారింది.
చైతన్యను ఎవరైనా బెదిరించారా..?
అప్పులు తీర్చే సామర్థ్యం తనకు ఉందని అంటున్న చైతన్య, ఒత్తిడి తట్టుకోలేకపోతున్నానంటూ సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి స్నేహితులకు పంపించాడు. అంత సామర్థ్యం ఉన్నవాడు ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు..? ఎలాగోలా వాటినీ తీర్చుకోవచ్చు కదా..? ఒత్తిడి తట్టుకోలేకపోతున్నానని చైతన్యే స్వయంగా సెల్ఫీ వీడియోలో చెప్పాడంటే.. అంత ఒత్తిడి ఎవరు చేశారు, ఎందుకు చేశారనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. చైతన్య కాల్ డేటాను విశ్లేషిస్తున్నారు.
జబర్దస్త్ వర్సెస్ ఢీ..
చైతన్య వీడియోలో ఢీ పేరు మాత్రమే ఇస్తుంది, జబర్దస్త్ డబ్బులు కూడా ఇస్తుందని చెప్పడం ఇప్పుడు మరో హాట్ టాపిక్ గా మారింది. ఢీని ఆయన తక్కువ చేసి చూశారా, ఢీలో పాల్గొనేవారంతా పేరు మాత్రమే సంపాదించుకుంటున్నారా..? ఆదాయం వారికి రావడంలేదా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఆయన సహచర డ్యాన్సర్లు కూడా కొంతమంది ఇదే విషయాన్ని చెబుతున్నారు. విలాసవంతమైన జీవితం వల్ల చైతన్య మాస్టర్ అప్పులపాలయ్యారని మొదట్లో కొంతమంది కామెంట్ చేసినా, ఆ తర్వాత ఆయన పరిస్థితి చూసి జాలిపడుతున్నారు. తన దగ్గర లేకపోయినా అవసరం ఉన్నవారికి అప్పు చేసి మరీ సాయం చేసే మనస్తత్వం చైతన్యది అని అంటున్నారు. ఆ మంచి తనమే ఇప్పుడు అతని ప్రాణం తీసిందని చెబుతున్నారు. చైతన్య మరణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. లైమ్ లైట్లో ఉండగానే, మంచి పేరు తెచ్చుకుంటున్న సమయంలోనే చైతన్య ఆత్మహత్య చేసుకోవడం విచారకరం.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)