Cyclone Michaung: నెల్లూరులో పునరావాస కేంద్రాలు, మంత్రికి కష్టాలు చెప్పుకున్న బాధితులు
Cyclone Michaung: నెల్లూరుతోపాటు పొదలకూరు, కసుమూరులోని పునరావాస కేంద్రాలను మంత్రి కాకాణి సందర్శించారు. అక్కడ అందుతున్న సౌకర్యాలను ఆయన అడిగి తెలుసుకున్నారు.
Cyclone Michaung News Telugu: నెల్లూరు జిల్లాపై తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది. వారం రోజులనుంచి జిల్లాపై ముసురు ఉంది. రెండు రోజులుగా భారీ వర్షాలు, తీవ్ర గాలులతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. నెల్లూరు నగరంలో కూడా గతంలో ఎప్పుడూ లేనంతగా రోడ్లన్నీ జలమయం అయ్యాయి. నెల్లూరు జూబ్లీ హిల్స్ గా పేరున్న మాగుంట లే అవుట్ లో కూడా నీరు భారీగా చేరింది పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ల ముందు కూడా నీరు నిలబడిపోయింది. అండర్ బ్రిడ్జ్ లు నీరు చేరి రాకపోకలకు అవకాశం లేకుండా పోయింది. పెద్దపెద్ద చెట్లు నేలకొరిగాయి, రవాణా స్తంభించడంతోపాటు, కరెంటు కష్టాలు కూడా తీవ్రమయ్యాయి.
నగర వాసుల కష్టాలు అలా ఉంటే.. నెల్లూరు చుట్టుపక్కల పల్లెల్లో పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయి. పల్లెటూళ్లకు నగరంతో సంబంధాలు తెగిపోయాయి. నిత్యావసరాలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వారందర్నీ పునరావాస కేంద్రాలకు తరలించారు. నెల్లూరుతోపాటు పొదలకూరు, కసుమూరులోని పునరావాస కేంద్రాలను మంత్రి కాకాణి సందర్శించారు. అక్కడ అందుతున్న సౌకర్యాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. బాధితులతో నేరుగా మాట్లాడారు. వారికి స్వయంగా ఆహారపదార్థాలను అందించారు కాకాణి.
నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. ఇటు ఆత్మకూరులో కూడా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి.. పునరావాస కేంద్రాలను సందర్శించారు. బాధితులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వర్షాలు తగ్గే వరకు పునరావాస కేంద్రాల్లోనే ఉండాలని సూచించారు. ఎప్పటికప్పుడు వారి అవసరాలు తీర్చాలని అధికారులకు సూచించారు. పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి ఇంటికి వెళ్లేటపుడు ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం అందించాలని సూచించారు. ఆత్మకూరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి బాధితులను అక్కడికి తరలించాలని సూచించారు.
అటు ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా వరద బాధితులకు భరోసా ఇస్తున్నారు. నెల్లూరు రూరల్ పరిధిలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆదేశాలతో ఆయన సోదరుడు గిరిధర్ రెడ్డి తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులతో మాట్లాడారు. గతంలో ఉన్న సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సమస్యలు ఎదురయ్యాయని చెప్పారు. బాధితులకు టీడీపీ నేతలు అండగా ఉంటారని చెప్పారు. మరిన్ని పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జనసేన నేతలు కూడా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు తాము తుపాను బాధితులకు సహాయం చేస్తున్నామని చెప్పారు నేతలు. ప్రభుత్వం మరింత సమర్థంగా యంత్రాంగాన్ని ఉపయోగించాలని వారు సూచించారు. పునరావాస కేంద్రాల్లో బాధితులకు సౌకర్యాలు కల్పించాలని కోరారు.
నెల్లూరు జిల్లాను తుపాను తీవ్రంగా నష్టపరిచింది. తీవ్ర గాలులు, వర్షంతో పంటలు దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల వరి నాట్లు వేసి ఉన్నారు. ఆ పొలాలన్నీ నీటమునిగాయి. వాణిజ్య పంటలు కూడా దెబ్బతిన్నాయని చెబుతున్నారు రైతులు. భారీ వర్షాలకు సోమశిల జలాశయంలోకి కూడా వరదనీరు భారీగా చేరుతోంది. సోమశిల నీటిమట్టం 30 టీఎంసీలు దాటింది. మరింత వరదనీరు జలాశయంలోకి వచ్చే అవకాశముందని తెలుస్తోంది. నీటిమట్టం మరింత పెరిగితే.. గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేసే అవకాశముంది.