(Source: ECI/ABP News/ABP Majha)
Ex Minister Narayana: సోషల్ మీడియాలో ప్రచారంపై ఫోకస్ పెంచిన మాజీ మంత్రి నారాయణ
AP Ex minister Narayana: టీడీపీ సోషల్ మీడియా విభాగం ఐటీడీపీ ఆధ్వర్యంలో ప్రస్తుతం ప్రచారం జోరుగా సాగుతోంది. ఇకపై ఐటీడీపీ కార్యకలాపాలు మండల స్థాయికి విస్తరించాలనేది ఆ పార్టీ వ్యూహం.
AP Ex minister Narayana: మాజీ మంత్రి నారాయణ సోషల్ మీడియా ప్రచారంపై ఫోకస్ పెంచారు. తన నియోజకవర్గంతోపాటు.. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యకలాపాలపై ఆయన దృష్టి సారించారు. టీడీపీకి అనుబంధంగా పనిచేస్తున్న ఐటీడీపీ కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల ఐటీడీపీ ఇన్ చార్జ్ నేతలతో భవిష్యత్తుకి గ్యారంటీ ఔట్ రీచ్ శిక్షణ తరగతులపై నారాయణ చర్చించారు. క్షేత్రస్థాయిలో టెక్నికల్ ఇబ్బందులపై అరా తీశారు. వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తానని చెప్పారు.
మండలానికి ఒకరు..
టీడీపీ తరపున ఈసారి సోషల్ మీడియా సైన్యం బలంగా తయారవ్వాలని చెప్పారు నారాయణ. ఐటీడీపీ ఆధ్వర్యంలో మండలానికి ఒక రోజు చొప్పున ట్రైనింగ్ ఇవ్వాలని సూచించారు. తరగతుల్లో కార్యకర్తలకు వచ్చే అన్ని రకాల సందేహాలు నివృత్తి అయ్యేలా చూడాలని లీడర్లకు సూచించారు. శిక్షణ తరగతులు కోసం పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మొబైల్ ప్రొజెక్టర్ ఇస్తామని చెప్పారు. వీలైనంత త్వరగా శిక్షణ తరగతులు పూర్తి చేయాలని సూచించారు.ప్రతి నెల రెండవ వారం తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాలని చెప్పారు.సంక్షేమ పథకాల గురించి కూడా అవగాహన కల్పించాలని, ప్రజలకు టీడీపీ మేనిఫెస్టోను చేరవేయాలని చెప్పారు.
నారాయణ ఆధ్వర్యంలో..
టీడీపీ సోషల్ మీడియా విభాగం ఐటీడీపీ ఆధ్వర్యంలో ప్రస్తుతం ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఇదంతా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి జరుగుతోంది. ఇకపై ఐటీడీపీ కార్యకలాపాలు మండలాల స్థాయికి విస్తరించాలనేది ఆ పార్టీ వ్యూహం. దాన్ని అమలుపెట్టే బాధ్యత నారాయణ తీసుకున్నారు. ఐటీడీపీ నాయకులతో ఆయన సమావేశమై వ్యూహాలపై చర్చించారు.
నెల్లూరులోనే మకాం..
నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి బరిలో దిగబోతున్న నారాయణ ఇక్కడే మకాం పెట్టారు. వారానికి రెండు రోజులు మాత్రం ఆయన విజయవాడ వెళ్తున్నారు, అక్కడ ఆయన విద్యాసంస్థల కార్యకలాపాలు పర్యవేక్షిస్తారు. మిగతా రోజులన్నీ నెల్లూరులోనే ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఇటీీవల నేరుగా ప్రజల్లోకి వెళ్లి పథకాలను వివరించారు. వారం రోజులుగా ఆయన నేతలతో సమావేశం అవుతున్నారు. సోషల్ మీడియా విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నారు. సోషల్ మీడియాలో టీడీపీ యాక్టివిటీ వైరల్ కావాలని సూచించారు. నిత్యం ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో ఆయన సిటీకి దూరంగా ఉన్నప్పుడు నాయకులను పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు వారందర్నీ మళ్లీ దగ్గరకు తీస్తున్నారు. కార్పొరేషన్లో పోటీ చేసిన వాళ్లు, మాజీ కార్పొరేటర్లను కూడా చేరదీసి వచ్చే ఎన్నికల్లో గెలుపుకోసం ప్రయత్నిస్తున్నారు.
2019 ఎన్నికల్లో నెల్లూరు సిటీ నియోజకవర్గంనుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి నారాయణ.. 2024నాటికి సర్వ శక్తులూ ఒడ్డి మరోసారి తన అదృష్టం పరీక్షించుకోబోతున్నారు. అప్పటి నారాయణ ప్రత్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు మాజీ మంత్రిగా రంగంలోకి దిగుతున్నారు. ఈసారి ఆర్థిక బలాబలాలు దాదాపుగా సమానం అని అంటున్నారు. నారాయణకు పోటీగా ఖర్చు పెట్టేందుకు అనిల్ కూడా రెడీగా ఉన్నారు. మరి వీరిద్దరిలో పైచేయి ఎవరిదో వేచి చూడాలి. గత ఎన్నికల్లో చేసిన తప్పుల్ని సరిదిద్దుకుంటూ ఈసారి నారాయణ దూకుడుమీదున్నారు. అప్పట్లో మంత్రి హోదాలో ఆయన అతి విశ్వాసమే కొంప ముంచిందని అంటారు స్థానిక నాయకులు. ఈసారి వ్యూహాలు మార్చి అనిల్ ప్రత్యర్థి వర్గాన్ని, తటస్తులను తమవైపు తిప్పుకుంటూ నారాయణ రాజకీయం మొదలు పెట్టారు.