నెల్లూరులో దారుణం- వివాహితపై కత్తితో దాడి
నెల్లూరు జిల్లాలో ఉన్మాది రెచ్చిపోయాడు. వివాహిత అయిన ఓ మహిళపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. ఆమె రక్తపు మడుగులో పడిపోగా, స్థానికుల సమాచారంతో పోలీసులు బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు.
నెల్లూరు జిల్లాలో ఉన్మాది రెచ్చిపోయాడు. వివాహిత అయిన ఓ మహిళపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. ఆమె రక్తపు మడుగులో పడిపోగా, స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. నిందితుడికోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఎందుకీ దాడి..
కొడవలూరు మండలం మానెగుంటపాడు గ్రామానికి చెందిన చెంచులక్ష్మి వివాహిత, ఇద్దరు పిల్లల తల్లి. భర్తతో విడిపోయి జీవిస్తోంది. కోవూరు మండలం లేగుంటపాడు గ్రామానికి చెందిన ప్రసాద్ కి కూడా వివాహం అయింది. ఇద్దరు పిల్లలున్నారు. అతను కూడా భార్య లేకుండా విడిగా ఉంటున్నాడు. ఈ క్రమంలో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం పెరిగి, ఇద్దరూ సన్నిహితంగా ఉండేవారని తెలుస్తోంది.
ఇటీవల వీరి మధ్య ఘర్షణ తలెత్తడంతో గొడవలు ఏర్పడ్డాయి. వెటర్నరీ ఆస్పత్రిలో పని చేస్తున్న చెంచులక్ష్మి ఈ గొడవల తర్వాత, అతడిని పట్టించుకోవడం మానేసింది. తప్పించుకుని తిరుగుతోంది. ఇది నచ్చని ప్రసాద్ ఆమెతో గొడవ పడ్డాడు. పదేపదే ఘర్షణకు దిగాడని పోలీసులు అంటున్నారు.
ఈ క్రమంలో ఈరోజు చెంచులక్ష్మి ఆటోలో వెళ్తుండగా నార్తురాజుపాలెం డీజిల్ ఫ్యాక్టరీ సమీపానికి వచ్చిన తర్వాత ప్రసాద్ ఆటోకి బైక్ అడ్డంగా పెట్టాడు. చెంచులక్ష్మిని కిందకు లాగి కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో ఆమె ప్రాణాపాయ స్థితి వెళ్లి స్పృహ తప్పింది. వెంటనే ప్రసాద్ అక్కడినుంచి పారిపోయాడు.
ఆటో డ్రైవర్ అడ్డుకోబోగా ప్రసాద్ కత్తి చూపించి బెదిరించాడు. ప్రసాద్ పారిపోయిన తర్వాత ఆటో డ్రైవర్, స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. సమాచారం అందుకున్న కొడవలూరు ఎస్సై సుబ్బారావు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాడు. రక్తపు మడుగులో ఉన్న చెంచులక్ష్మిని పోలీసులు నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కొడవలూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇటీవల నెల్లూరులో వరుసగా ఇలాంటి ఘటనలు జరిగాయి. సొంత మేనమామ ఓ విద్యార్థినిపై యాసిడ్ దాడి చేసి చివరకు పోలీసులకు చిక్కాడు, ఆ తర్వాత దసరా పండగ రోజున ఓ వివాహితపై సమీప బంధువు లైంగిక దాడికి ప్రయత్నించగా ఆమె తప్పించుకోబోయి చేపల చెరువులో పడి మరణించింది. తాజాగా జరిగిన ఈ ఘటన నెల్లూరులో సంచలనంగా మారింది.
పట్టపగలు, నడిరోడ్డుపై..
పట్టపగలు, నడిరోడ్డుపై కత్తితో ఓ మహిళపై దాడి జరిగిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దిశ లాంటి చట్టాలు ఉన్నా కూడా ఇలాంటి దారుణాలు జరగకుండా ఆపలేకపోతున్నారు. చట్టాలున్నా కూడా నిందితులకు కఠిన శిక్షలు వేస్తామంటారు కానీ ఆడవారిపై జరిగే అఘాయిత్యాలను ఏ చట్టాలూ ఆపలేవు. నిందితుడికి శిక్ష పడితే బాధితురాలి కష్టం తీరదు. ఆమెకు జరిగిన గాయాలు జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి. దాదాపుగా ఆ కుటుంబం అంతా జీవితాంతం ఆ శిక్ష అనుభవిస్తూనే ఉండాలి. పట్టపగలు నడిరోడ్డుపై జరిగిన ఈ ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. నెల్లూరు జిల్లా పోలీసు అధికారులు ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్నారు. నిందితుడికోసం పోలీసులు గాలిస్తున్నారు. త్వరలోనే ప్రసాద్ ని పట్టుకుని కఠిన శిక్ష పడేలా చేస్తామన్నారు పోలీసులు.