Loan Apps Threats Anil Kumar Yadav : మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను వదల్లేదు, 20కి పైగా కాల్స్ తో లోన్ యాప్ వేధింపులు
Loan Apps Threats Anil Kumar Yadav : ఆన్ లైన్ లోన్ యాప్ ల రికవరీ ఏజెంట్లు మంత్రులు, మాజీ మంత్రులను సైతం విడిచిపెట్టడంలేదు. మంత్రి కాకాణిని బెదిరించిన ఏజెంట్లు , అనిల్ కుమార్ ను వేధించారు.
Loan Apps Threats Anil Kumar Yadav : ఆన్ లైన్ లోన్ యాప్ ల బెదిరింపులు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పడానికి ఇదే అసలు సిసలు ఉదాహరణ. మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ను కూడా లోన్ రికవరీ ఏజెంట్లు వేధించారు. తాను మాజీ మంత్రిని అని అనిల్ ఫోన్ కాల్ లో చెప్పినా కూడా అప్పుతీసుకుని వాడుకుంది మీ ఇద్దరే కదా, ఇంతమంది ఉంటే మీ నెంబరే ఎందుకిస్తారంటూ ఎదురు ప్రశ్నలు వేశారు రికవరీ ఏజెంట్లు.
మాజీ మంత్రి అనిల్ కుమార్ కు వేధింపులు
మీ బావమరిది లోన్ తీసుకుని డబ్బులు కట్టలేదు. మీ ఫోన్ నెంబర్ ఇచ్చారు. మీరు డబ్బులు కడతారని అంటున్నారు. రూ. 8 లక్షలు చెల్లించకపోతే పరువుతీస్తామంటూ మాజీ మంత్రి, నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కు లోన్ యాప్ రికవరీ ఏజెంట్స్ కాల్ చేసి వేధించారు. నెల్లూరులోని ఫూల్లెట్రాన్ ఆన్ లైన్ బ్యాంకులో పాతపాటి అశోక్‌కుమార్ అనే వ్యక్తి రూ. 8 లక్షలు అప్పు తీసుకున్నాడు. ఆ లోన్ చెల్లించలేదని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు రికవరీ ఏజెంట్లు వరుసపెట్టి కాల్స్ చేశారు.
ఎమ్మెల్యేకే అల్టిమేటం
లోన్ రికవరీ ఏజెంట్లతో అనిల్ కుమార్ మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ బయటకు వచ్చాయి. ఈ ఆడియో వైరల్ అవుతున్నాయి. లోన్ యాప్ రికవరీ ఏజెంట్లు మాజీ మంత్రి అనిల్ కుమార్ ను వేధించిన తీరుచూస్తుంటే ఇక సామాన్యులను ఎంతగా బెదిరించారో అర్థం చేసుకోవచ్చు. తనకు బావమరిది లేడని, అశోక్ కుమార్ అనే వ్యక్తి తనకు తెలియదని అనిల్ కుమార్ ఎంత చెప్పినా లోన్ యాప్ వాళ్లు వినిపించుకోకుండా ఇద్దరు కలిసి డబ్బులు వాడేసుకున్నారని వేధించారు. తాను మాజీ మంత్రి అని చెప్పినా మనీ కట్టాల్సిందేనని స్పష్టం చేశారు. మీరెవరో తెలియకుండా అశోక్ కుమార్ మీ నెంబర్ ఇచ్చారా అని ఎదురు ప్రశ్నలు వేశారు. చివరకు అనిల్ కుమార్ కు కోపం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పినా రికవరీ ఏజెంట్లు వెనక్కి తగ్గలేదు. డబ్బులు కట్టాల్సిందేనని ఎమ్మెల్యేకే అల్టీమేటం విధించారు.
20కి పైగా కాల్స్
మాజీ మంత్రి అనిల్ కుమార్ కు రికవరీ ఏజెంట్లు 20కి పైగా కాల్స్ చేసి వేధించారు. ఎవరో తెలియని వ్యక్తి తన నెంబర్ ఇస్తే కాల్ చేస్తారా అని ఎదురుతిరిగారు అనిల్ కుమార్. బ్యాంకు ఎక్కడో చెప్పాలని, మేనేజర్ నెంబర్ ఇవ్వమని అనిల్ కుమార్ కోరినా, అశోక్ కుమార్ నెంబర్ ఇస్తాం అతనితో డబ్బులు కట్టించండని వేధించారు. బ్యాంకు అడ్రెస్ చెప్పండి మా వాళ్లు వచ్చి మాట్లాడతారని అనిల్ అంటే వచ్చి డబ్బులు కడతారా అంటూ రివకరీ ఏజెంట్ ఎదురు ప్రశ్నించింది. లోన్ యాప్ ప్రతినిధుల మాటలకు విసిగిపోయిన అనిల్ కుమార్ యాదవ్ సహనం కోల్పోయి చెడామడా తిట్టేశారు. దారిన పోయే వ్యక్తి తన నెంబర్ మీకు ఇస్తే కాల్ చేసి డబ్బులు కట్టాలని వేధిస్తారా అని కాల్ కట్ చేశారు.
మాజీ మంత్రి Anil Kumar Yadav కి రికవరీ ఏజెంట్ల వేధింపులు...!#AnilKumarYadav #loanrecovery pic.twitter.com/9YXou9hp9j
— Akhil Patel (@Akhil4BJP) July 29, 2022
మంత్రి కాకాణికి కాల్స్
మాజీ మంత్రి అనిల్ కుమార్ తో పాటు నెల్లూరు జిల్లాకే చెందిన మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిని కూడా లోన్ రికవరీ ఏజెంట్లు వేధించారు. మంత్రిని కూడా ఈ అశోక్ కుమార్ డబ్బులు కట్టలేదని మీరు డబ్బు కట్టాలని వందల కాల్స్ చేసి వేధించారు. ఆయన పోలీసులకు ఫిర్యాదుచేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు.