Somireddy On Minister Kakani : కాకాణి గోవర్థన్ ను మంత్రి పదవి నుంచి తప్పించాలి, సోమిరెడ్డి డిమాండ్
Somireddy On Minister Kakani : నెల్లూరు కోర్టులో చోరీ కేసును సీబీఐకి అప్పగించడంపై మాజీ మంత్రి సోమిరెడ్డి స్వాగతించారు. కాకాణి కేసు పత్రాలు చోరీకి గురవ్వడంపై వెనుక కుట్ర ఉందని ఆరోపించారు.
Somireddy On Minister Kakani : నెల్లూరు కోర్టులో కేసు పత్రాల చోరీ కేసును ఏపీ హైకోర్టు సీబీఐకి అప్పగించింది. ఈ కేసును హైకోర్టు సీబీఐకి అప్పగించడంపై మాజీ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్వాగతించారు. ఈ విచారణ హైకోర్టు న్యాయమూర్తుల పర్యవేక్షణలో జరగాలని ఆయన కోరారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన మంత్రి కాకాణి కోర్టుకు గతంలో నకిలీ పత్రాలు సమర్పించారన్నారు. ఆ పత్రాలే తర్వాత చోరికి గురయ్యాయన్నారు. దొంగలు వచ్చారు, కుక్కలు మొరిగాయని ఎస్పీ కట్టుకథ చెప్పారన్నారు. వరుసగా నేరాలు చేసిన వ్యక్తిని కేబినెట్ నుంచి సీఎం జగన్ వెంటనే తొలగించాలని మంత్రి కాకాణిని ఉద్దేశించి అన్నారు.
కోర్టు పర్యవేక్షణలో విచారణ
మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకాణికి ఏ మాత్రం సిగ్గు, మానవత్వం ఉంటే మంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నెల్లూరు కోర్టులో పత్రాలు చోరీ కేసును సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించటాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఘోరమైన నేరాలు చేసే కాకాణిని వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలన్నారు. పోలీసు వ్యవస్థలపై తమకు నమ్మకం లేదని కోర్టు కూడా చెప్పినట్లు అయిందన్నారు. ఈ కేసును సీబీఐ త్వరితగతిన విచారణ చేయాలని సోమిరెడ్డి కోరారు. చోరీకి గురైన పత్రాల్లో ఫిర్యాదుదారుడిని తానే కాబట్టి తన అభిప్రాయం కూడా సీబీఐ తీసుకోవాలన్నారు. వివేకా హత్య కేసులా సంవత్సరాలు గడపకుండా తర్వతిగతిగా విచారణ చేపట్టాలన్నారు. న్యాయ వ్యవస్థ ప్రతిష్ఠగా ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేయాలన్నారు. జిల్లా ఎస్పీ సహా స్థానిక అధికారుల్ని తప్పించి కోర్టు పర్యవేక్షణలో విచారణ కొనసాగాలన్నారు. తప్పుడు పత్రాలతో తనపై కాకాణి చేసిన అసత్య ఆరోపణలపై తానే మంత్రి కాకాణిపై కేసు పెట్టానన్నారు. కాకాణి చూపించింది తప్పుడు పత్రాలని దర్యాప్తులో తేలడంతో ముగ్గురిని అరెస్టు చేశారన్నారు. కేసు కీలకదశలో ఉన్నప్పుడు కాకాణి మంత్రి అవ్వటంతో అధికారాన్ని అడ్డుకుని కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కోర్టులో 4 వేల దస్త్రాల్లో ఒక్క కాకాణి దస్త్రమే చోరీకి గురవ్వడం వెనుక కుట్ర దాగి ఉందని సోమిరెడ్డి ఆరోపించారు.
అసలేం జరిగింది?
నెల్లూరు కోర్టులో ఫైళ్ల చోరీ కేసుపై ఏపీ హైకోర్టు కీలక తీర్పును ఇచ్చింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే త్వరలోనే సీబీఐ ఈ కేసు దర్యాప్తును ప్రారంభించబోతున్నట్లు సమాచారం. ఈ ఏడాది ఏప్రిల్ 13వ తేదీన నెల్లూరు 4వ అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో దొంగతనం జరిగింది. ఓ కీలక కేసులో సాక్ష్యాధారాలుగా ఉన్న కొన్ని డాక్యుమెంట్లు, ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్లు చోరీకి గురైనట్టు తెలుస్తోంది. దీనిపై నెల్లూరు చిన్నబజారు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆ తర్వాత ఏపీ హైకోర్టు ఈ కేసును సుమోటో పిల్ గా విచారణకు స్వీకరించింది. ఈ దొంగతనం కేసులో పోలీసుల దర్యాప్తు సరిగ్గా జరగడం లేదని.. అందుకే స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపిస్తే మంచిదని నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఓ నివేదిక ఇచ్చారు. అప్పుడే వాస్తవాలు బయటపడతాయని వివరించారు. దీని ఆధారంగానే సుమోటో పిల్ గా పరగణించి... మొత్తం 18 మందిని ఏపీ హైకోర్టు ప్రతివాదులుగా చేర్చింది. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై అప్పటి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి కొన్ని ఆరోపణలు చేశారు. సోమిరెడ్డికి విదేశాల్లో భారీగా ఆస్తులు ఉన్నాయని.. కొన్ని పత్రాలను మీడియాకు విడుదల చేశారు. అయితే స్పందించిన చంద్రమోహన్ రెడ్డి.. కాకాణిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా.. కాకాణి విడుదల చేసిన డాక్యుమెంట్లు నకిలీవని ఛార్జీషీట్ ఫైల్ చేశారు. ఈ కేసు కోర్టు విచారణలో ఉంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఏప్రిల్ లో నెల్లూరులోని కోర్టులో చోరీ జరిగింది. నెల్లూరు 4వ అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో దొంగతనం జరిగింది. ఓ కీలక కేసులో సాక్ష్యాధారాలుగా ఉన్న కొన్ని డాక్యుమెంట్లు, ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్లు చోరీకి గురైనట్టు తెలుస్తోంది. దీనిపై నెల్లూరు చిన్నబజారు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.