Kothapalli Subbarayudu : వైసీపీలో అసలు ఆ రూల్ ఉందా? సస్పెన్షన్ కు కారణం చెప్పాలని సుబ్బారాయుడు డిమాండ్
Kothapalli Subbarayudu On Suspension : వైసీపీ నుంచి మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడుని సస్పెండ్ చేశారు. దీనిపై సుబ్బారాయుడు స్పందిస్తూ ఏ కారణంగా తొలగించారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
![Kothapalli Subbarayudu : వైసీపీలో అసలు ఆ రూల్ ఉందా? సస్పెన్షన్ కు కారణం చెప్పాలని సుబ్బారాయుడు డిమాండ్ Narsapuram former minsiter Kothapalli subbarayudu demands reasons for Suspension from yrscp Kothapalli Subbarayudu : వైసీపీలో అసలు ఆ రూల్ ఉందా? సస్పెన్షన్ కు కారణం చెప్పాలని సుబ్బారాయుడు డిమాండ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/02/19a152fd20e534e9d15b8a27c07adbc0_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Kothapalli Subbarayudu On Suspension : నర్సాపురం వైసీపీలో రాజకీయ దుమారం రేగింది. వైసీపీ నేత, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ను పార్టీ నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సస్పెన్షన్ పై సుబ్బారాయుడికి పార్టీ నుంచి సమాచారం అందింది. తాజా ఘటనపై కొత్తపల్లి సుబ్బారాయుడు స్పందించారు. వైసీపీని చిన్న మాట కూడా అనని తనను ఎందుకు పార్టీలోంచి సస్పెండ్ చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఏ తప్పు చేయని తనను సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసమని ఆవేదన చెందారు. నర్సాపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేయడం దారుణం అన్నారు. పార్టీపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న ఎంపీ రఘురామకృష్ణరాజును ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. తన సస్పెన్షన్ కు కారణాలు ఇవాళ సాయంత్రంలోగా చెప్పాలని, సరైన కారణం లేకుండా సస్పెండ్ చేస్తే చట్టపరంగా న్యాయం కోసం పోరాటం చేస్తానని కొత్తపల్లి సుబ్బారాయుడు అన్నారు.
వైసీపీలో నిజమైన కార్యకర్తలకు అన్యాయం
ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని కొత్తపల్లి సుబ్బారాయుడు అన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చే సమయానికి తెలుగు దేశం పార్టీ లేదన్నారు. కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టడంతో ఆయనపై అభిమానంతో టీడీపీ చేరినట్లు చేరినట్లు పేర్కొన్నారు. వైసీపీ తరఫున 2014 ఎన్నికల్లో పోటీ చేసినపుడు ఇప్పటి ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు తనకు వ్యతిరేఖంగా పనిచేశారని ఆరోపించారు. కానీ 2019 ఎన్నికల్లో తాను ప్రసాదరాజును గెలిపించేందుకు కృషి చేశానన్నారు. ఏ పార్టీలో ఉన్నా క్రమశిక్షణగా పనిచేశానన్న ఆయన, వైసీపీ ప్రారంభం నుంచి ఉన్న నిజమైన కార్యకర్తలకు న్యాయం జరగడంలేదన్నారు.
ఎవరు ఫిర్యాదు చేశారో చెప్పండి?
నర్సాపురం అభివృద్ధి కోసం ప్రశ్నిస్తునే ఉంటానన కొత్తపల్లి సుబ్బారాయుడు అన్నారు. తన రాజకీయ జీవితంలో ఎందరో ముఖ్యమంత్రులను చూశానన్నారు. అభివృద్ధి కోసం ఎక్కడ రాజీ పడలేదని పేర్కొన్నారు. నర్సాపురం అభివృద్ది తనతోనే సాధ్యం అయిందని తెలిపారు. వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి తనను సస్పెండ్ చేస్తున్నట్టు ఇచ్చిన లెటర్‌పై ఎవరి సంతకం లేదన్నారు. తాను పార్టీకి ఎక్కడ అన్యాయం చేశానో చెప్పాలని ఎమ్మెల్యే ప్రసాదరాజును డిమాండ్ చేశారు. తనపై ఎవరు ఫిర్యాదు చేశారో చెప్పాలన్నారు. పార్టీకి సాయం చేశాను తప్ప ద్రోహం చేయలేదని సుబ్బారాయుడు అన్నారు. క్రమ శిక్షణ సంఘం ఏం చూసి తనను సస్పెండ్ చేసిందో స్పష్టత ఇవ్వాలన్నారు. సస్పెండ్ చేసే ముందు క్రమశిక్షణ సంఘం తనను ఎందుకు వివరణ అడగలేదని ప్రశ్నించారు. వైసీపీ నియమావళిలో తప్పు చేస్తే వారితో చర్చించే నిబంధన ఉందా లేదా అని ప్రశ్నించారు. క్రమ శిక్షణ సంఘం తన ప్రతిష్టకు దెబ్బతీసే విధంగా వ్యవహరించారని, ఎవరు తనపై ఫిర్యాదు చేశారో సాయంత్రంలోగా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం జగన్ రాజకీయాల్లోకి రాకముందు నుంచి తాను ఎమ్మెల్యేగా ఉన్నానన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)