Nandyal News : నంద్యాల జిల్లాలో పులి పిల్లలు కలకలం, తల్లి వస్తుందేమోనని భయాందోళనలో గ్రామస్థులు
Nandyal News : నంద్యాల జిల్లాలో పులి పిల్లలు కలకలం రేపుతున్నాయి. కొత్తపల్లి మండలంలో నాలుగు పులి పిల్లలను స్థానికులు గుర్తించి అటవీశాఖకు సమాచారం అందించారు.
Nandyal News : వన్య మృగాలు జనావాసాల్లోకి వస్తున్న ఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయి. ఇటీవల ఏపీలోని పలు జిల్లాల్లో పెద్ద పులి సంచారం ప్రజల్ని హడలెత్తించింది. తాజాగా నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ కొత్తపల్లి మండలంలో పెద్ద పులి పిల్లల కలకలం రేపుతున్నాయి. పెద్ద గుమ్మడాపురం గ్రామంలో నాలుగు పెద్ద పులి పిల్లలను గ్రామస్తులు గుర్తించారు. కుక్కలు దాడిలో గాయ పరచకుండా పులి పిల్లలను గదిలో భద్రపరిచి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు గ్రామస్థులు.
పులి పిల్లలు కలకలం
నంద్యాల జిల్లా ఆత్మకూరు, నందికొట్కూరు, వెలుగోడు ప్రాంతాల్లో తరచూ పెద్ద పులులు సంచరిస్తున్నాయి. ఇటీవల ఆత్మకూరు మండలం వెంకటాపురం గ్రామ సమీపంలోని పొలాల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. తాజాగా నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలో పెద్దపులి పిల్లలు కలకలం రేపుతున్నాయి. కొత్తపల్లి మండలం పెద్దగుమ్మడాపురంలో ఆదివారం ఓ యువకుడికి పెద్దపులి పిల్లలు కనిపించాయి. గ్రామంలోని ఓ ఇంటి వద్ద గొడకు ఆనుకుని పులి పిల్లలు నిద్రపోతుండగా యువకుడు వాటిని గమనించి గ్రామస్థులకు సమాచారం అందించాడు. ఒకేసారి నాలుగు పులి పిల్లలు కనిపించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. పులి పిల్లలు ఉన్నాయంటే సమీపంలోనే పెద్ద పులి ఉండి ఉంటుందని ఆందోళన చెందుతున్నారు. పిల్లలు కోసం పెద్ద పులి మళ్లీ ఆ ప్రాంతానికి వచ్చే అవకాశం ఉందని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. కుక్కల దాడి నుంచి రక్షించేందుకు పులి పిల్లలను స్థానికంగా ఓ గదిలో ఉండి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యంకు తిరిగి వెళ్లిపోయిన పులులు
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం గొల్లఘాట్, గుంజాల శివారులో సంచరిస్తున్న నాలుగు పులులు పెన్ గంగా నది దాటి మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యంలోకి వెళ్లిపోయాయి. ఇటీవల స్థానికంగా నాలుగు పులులు కనిపించడంతో భీంపూర్ మండలంలోని సరిహద్దు గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అటవీశాఖ అధికారులు పులి పాదముద్రలు సేకరించి బేస్ క్యాంప్ ఏర్పాటు చేసి గ్రామస్థులకు అవగాహన కల్పించారు. అయితే ప్రస్తుతం ఆ నాలుగు పులులు గుంజాల వడూర్ శివారు మీదుగా పేన్ గంగానది దాటి మహారాష్ట్రలోని హివ్ రీ గ్రామం నుంచి తిరిగి తిప్పేశ్వర్ అభయారణ్యంలోకి వెళ్లిపోయాయని అటవీ అధికారులు తెలిపారు. హివిరి గ్రామ సరిహద్దులో పులులు తిరిగి వెళ్లిన ప్రదేశంలో పులి పాదముద్రలు గుర్తించారు. తిప్పేశ్వర్ అభయారణ్యం అటవీశాఖ అధికారులు సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించడంతో భీంపూర్ మండల సరిహద్దు గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
విజయనగరం జిల్లాలో పెద్ద పులి సంచారం
ఉత్తరాంధ్రలో మళ్లీ పెద్ద పులి భయం మొదలైంది. తాజాగా విజయనగరం జిల్లాలో పెద్ద పులి పంజా విసిరింది. జిల్లాలోని మెంటాడ మండలం వనిజ గ్రామంలోని జీడి తోటలో ఓ ఎద్దుపై పెద్ద పులి దాడిచేసింది. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు మళ్లీ టెన్షన్ మొదలైంది. పెద్ద పులి ఎప్పుడు ఎటు నుంచి దాడి చేస్తుందో అని భయపడుతున్నారు. చుట్టుపక్కల పది గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. పెద్ద పులి దాడిలో ఎద్దు మృతి చెందడంతో రైతులు లబోదిబో మంటున్నారు. అటవీశాఖ అధికారులకు ఇప్పటికైనా స్పందించి పులిని పట్టుకోవాలని వేడుకుంటున్నారు. మెంటాడ అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. అటవీశాఖ అధికారులు స్థానికంగా పులి పాదముద్రలు సేకరించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పరిసర గ్రామాల్లో చాటింపు వేయించారు. ఇప్పటికే పలు పశువులను పులి చంపేసిందని రైతులు అంటున్నారు. పులి జాడలు కనిపిస్తున్నా అటవీ అధికారులు ఎందుకు బంధించలేకపోతున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.