MP Margani Bharath: బ్రిడ్జి పైనుంచి దూకబోయిన యువకుడు- కాపాడిన ఎంపీ మార్గాని భరత్
MP Margani Bharath: కొవ్వూరు బ్రిడ్జి పైనుంచి గోదావరి నదిలో దూకబోయిన ఓ యువకుడిని ఎంపీ మార్గాని భరత్ కుమార్ చాకచక్యంగా కాపాడారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.
MP Margani Bharath: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు బ్రిడ్జి పైనుంచి గోదావరిలో దూకబోయిన యువకుడిని ఎంపీ మార్గాని భరత్ రామ్ చాకచక్యంగా కాపాడారు. స్థానిక రోడ్డు కం రైల్వే వంతెనపై మంగళవారం ఈ ఘటన జరిగింది. నిడదవోలు మండలం ఉనకరమిల్లికి చెందిన అయ్యప్ప ఎలక్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి జడ్చర్లలోని అరబిందో ఫార్మసీలో మూడేళ్లు పని చేశాడు. మంగళవారం బైక్ పై రోడ్డు కం రైలు వంతెనపైకి వచ్చాడు. మోటారు సైకిల్ ను పక్కన పెట్టి బ్రిడ్జి పైనుంచి గోదావరిలో దూకేందుకు సిద్ధం అయ్యాడు. అదే సమయంలో గోపాలపురంలో ఒక శుభ కార్యక్రమానికి బయల్దేరిన ఎంపీ భరత్ రామ్ ఈ విషయాన్ని గమనించారు. వెంటనే తన వాహనాన్ని ఆపి, కారులోంచి బయటకు దూకి, ఆ యువకుడిని పట్టుకుని రోడ్డు మీదుకు లాగారు. ఎంపీ అనుచరులు కూడా గట్టిగా పట్టుకున్నారు. ఎంపీ వెంటనే రాజమహేంద్రవరం టూటౌన్ సీఐ గణేష్ కు ఫోన్ చేసి విషయం తెలిపారు. ఆ యువకుడిని ఆటోలో రెండో పట్టణ పోలీసు స్టేషన్ కు తీసుకు వెళ్లారు. యువకుడిని కాపాడిన ఎంపీ భరత్ రామ్ ను పలువురు అభినందించారు.