MLC Election Counting: ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం- మొత్తం 6 స్థానాలకు కౌంటింగ్
MLC Elections Result | ఏపీ, తెలంగాణలో మూడేసీ చొప్పున ఎమ్మెల్సీ స్థానాలకు ఫిబ్రవరి 27న జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొత్తం 6 స్థానాలకు కౌంటింగ్ మొదలుపెట్టారు.

అమరావతి: ఫిబ్రవరి 27న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపు సోమవారం నిర్వహిస్తున్నారు. ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో ఉత్తరాంధ్ర టీచర్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు మొదలైంది. ఏలూరు సమీపంలోని వట్లూరు సీఆర్‌ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలు కాగా, గుంటూరు ఏసీ కాలేజీలో కృష్ణా- గుంటూరు గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. అంతకుముందు ఉదయం 7 గంటలకు ఎమ్మెల్సీ అభ్యర్థులు, వారి ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్‌రూమ్‌లను తెరిచిన అధికారులు కౌంటింగ్ సెంటర్ లోని టేబుళ్ల వద్దకు బాక్సులు తీసుకొచ్చారు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఈసీ ఓట్ల లెక్కింపు చేపట్టింది.
తెలంగాణలో ఎమ్మెల్సీ ఓన్నికల ఓట్ల లెక్కింపు
హైదరాబాద్: తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు నేడు ఓట్ల లెక్కింపు మొదలైంది. ఫిబ్రవరి 27న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. నల్గొండలోని వేర్‌హౌసింగ్ గోదాములో వరంగల్- ఖమ్మం- నల్గొండ టీచర్ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు జరుగుతోంది. కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ టీచర్ నియోజకవర్గంతో పాటు గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు కరీంనగర్‌లోని అంబేడ్కర్ ఇండోర్ స్టేడియంలో మొదలుపెట్టారు. ఈ మేరకు అధికారులు కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు.
కరీంనగర్‌లో 35 టేబుళ్లు, నల్గొండలో 25 టేబుల్స్ ఏర్పాటు
అధికారులు ఉదయం 7 గంటలకు స్ట్రాంగ్‌రూమ్‌లను తెరిచారు. అనంతరం కౌంటింగ్ కేంద్రంలోని టేబుళ్ల వద్దకు పోలింగ్ బాక్సులు తీసుకువచ్చారు. 8 గంటలకు కౌంటింగ్ మొదలుపెట్టారు. కరీంనగర్ కౌంటింగ్ కేంద్రంలో మొత్తం 35 టేబుళ్లు ఏర్పాటు చేయగా.. అందులో గ్రాడ్యుయేట్స్ ఓట్ల లెక్కింపు కోసం 21 టేబుళ్లు, టీచర్ల ఓట్ల లెక్కింపు కోసం 14 టేబుళ్లను వినియోగించనున్నారు. దాదాపు 800 మంది సిబ్బంది ఓట్ల లెక్కింపు విధుల్లో పాల్గొననున్నారు. నల్గొండలో కౌంటింగ్ కేంద్రం వద్ద 25 టేబుళ్లు ఏర్పాటు చేసి ఓట్ల లెక్కింపు మొదలుపెట్టారు. ఈ కౌంటింగ్ కేంద్రంలో 350 మంది సిబ్బంది ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పాల్గొంటున్నారు.
గ్రాడ్యుయేట్ స్థానం కౌంటింగ్‌కు 3 రోజులు టైమ్
కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ టీచర్ నియోజకవర్గంలో 24,895 మంది ఓటు హక్కు వినియోగించుకోగా.. కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గంలో ఏకంగా 2,50,106 మంది ఓటర్లు ఓటు వేశారు. ఇక మూడో ఎమ్మెల్సీ స్థానం వరంగల్- ఖమ్మం- నల్గొండ టీచర్స్ నియోజకవర్గంలో 24,139 మంది ఈ ఎన్నికల్లో ఓటు హక్కు ఉపయోగించుకున్నారు. టీచర్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు దాదాపు 36 గంటల సమయం పట్టే అవకాశం ఉండగా, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు 3 రోజుల వరకు టైమ్ పడుతుందని ఎన్నికల అధికారులు అంచనా వేస్తున్నారు.
Also Read: New Ration Cards: తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీలో జాప్యం, ఎలక్షన్ కోడ్ లేని జిల్లాల్లోనూ నిరాశే
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

