Hindupuram News: హిందూపురం ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటన
Hindupuram News: హిందూపురం ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటించారు. బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
Hindupuram News: ఇటీవల కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మొత్తం తడిసి ముద్దయింది. జిల్లాలోని చాలా ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ఈ క్రమంలో హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. పట్టణంలోని చౌడేశ్వరి కాలనీలో నాలుగు రోజులుగా ఇబ్బంది పడుతున్న బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా వారికి మనో ధైర్యాన్ని అందిస్తూ... అన్ని సౌకర్యాలు ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే పట్టణంలోని శాంతి నగర్, ఆర్టీసీ కాలనీ, త్యాగరాజు నగర్ లను కూడా సందర్శించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోచనపల్లి వద్ద తెగిపోయిన బ్రిడ్జిని ఎమ్మెల్యే బాలకృష్ణ పరిశీలించారు.
సమస్యలు చెప్పుకుంటూ బాధితుల ఆవేదన
ముంపు ప్రాంతాల్లో పర్యటించిన బాలకృష్ణ, బాధితులను తమ సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. బాధితులకు ప్రభుత్వం నుండి ఏదైనా సాయం అందుతుందా అని అడిగారు. కొందరు బాధితులు.. తమకు ప్రభుత్వం నుండి ఎలాంటి సాయం అందడం లేదని బాలకృష్ణకు తెలిపారు. స్థానిక అధికారులు తమ గోడు పట్టించుకోవడం లేదని, వాన నీటిలోనే రోజుల తరబడి గడుపుతున్నా.. తమకు సౌకర్యాలు కల్పించడం లేదని వాపోయారు. ముంపు బాధితుల కష్టాలు విన్న ఎమ్మెల్యే బాలకృష్ణ...తమ తరపున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ముంపు ప్రాంతాల్లో రోగాలు ప్రబలకుండా, ఒకవేళ వచ్చినా వాటి నుండి బయట పడేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు.
ప్రభుత్వం నుండి పైసా అందడంలేదన్న ప్రజలు
బాలకృష్ణ పర్యటనలో భాగంగా ముంపు బాధితులను ఆయన పరామర్శించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగా వారికి ప్రభుత్వం నుండి పైసా సాయం అందడం లేదని తమ ఎమ్మెల్యేకు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రాంతంలో ఉన్న వారిలో చాలా మందికి ప్రభుత్వ సాయం దక్కడం లేదని బాలకృష్ణకు తెలిపారు.
'వచ్చేది మన ప్రభుత్వమే'
ముంపు బాధితుల గోడు విన్న బాలయ్య బాబు.. త్వరలోనే మంచి రోజులు వస్తాయని. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల లబ్ధి చేకూరుతుందని వెల్లడించారు. ప్రతి ఒక్కరినీ ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
జోరుగా వర్షాలు, లోతట్టు ప్రాంతాలు జలమయం
రెండ్రోజుల క్రితం హిందూపురంలో భారీగా వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. హిందూపురంలోని శ్రీకంఠపురం, కొట్నూరు, చెరువుల వద్ద మరువ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. కర్ణాటక నుండి మహారాష్ట్ర మీదుగా మధ్య భారతం వరకు ఉపరితల ద్రోణి విస్తరించడంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చాలా ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. ఉపరితల ఆవర్తనాలు మధ్య బంగాళాఖాతం, కొమరిన్ పరిసరాల్లో వేర్వేరుగా కొనసాగుతున్నాయి. జోరు వర్షాలతో చిత్రావతి, పెన్నా, జయమంగళి, కుషావతి నదులు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి.