(Source: ECI/ABP News/ABP Majha)
Roja in Jabardasth: రోజా జబర్దస్త్ షోలో కంటిన్యూ అవుతారా? క్లారిటీ ఇచ్చిన కాబోయే మంత్రి
RK Roja: మంత్రి పదవి దక్కడంపై ఎమ్మెల్యే రోజా సోమవారం ఉదయం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రాణం ఉన్నంతవరకు సీఎం జగన్ తోనే ఉంటానని, ఆయన కోసమే పని చేస్తానని రోజా అన్నారు.
RK Roja Jabardasth Show: ఏపీ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా చిత్తూరు జిల్లా నగిరి ఎమ్మెల్యే రోజాకు మంత్రి పదవి దక్కడంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆమె జబర్దస్త్ లాంటి టీవీ షోలలో ఇకపై కనిపిస్తారా? అనే సందేహం వ్యక్తమవుతోంది. మంత్రిగా ఉండగా కూడా టీవీ షోలు, సినిమాలను కొనసాగిస్తారా అనే విషయంలో రోజా స్పష్టత ఇచ్చారు. టీవీ, సినిమా షూటింగ్‌లలో ఇక పాల్గొనబోనని రోజా ప్రకటించారు. ఇకపై పూర్తి సమయం మంత్రిగా ప్రజల కోసమే కేటాయిస్తానని స్పష్టం చేశారు.
మంత్రి పదవి దక్కడంపై ఎమ్మెల్యే రోజా సోమవారం ఉదయం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రాణం ఉన్నంతవరకు సీఎం జగనన్నతోనే ఉంటానని, ఆయన కోసమే పని చేస్తానని రోజా అన్నారు. తనకు సీఎం జగన్ ఇచ్చిన గుర్తింపును ఎప్పటికి మర్చిపోలేనని అన్నారు. తనను అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వనని చంద్రబాబు అన్నారని.. కానీ జగన్ తనను రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని, ఇప్పుడు మంత్రి పదవి ఇచ్చి గౌరవించారని అన్నారు. తనను ఐరన్ లెగ్ అన్నారని గుర్తు చేసుకున్నారు.
‘‘మంత్రి అవుతున్నందుకు షూటింగులు మానేస్తున్నాను. ఇకపై టీవీ షోల షూటింగ్ లలో పాల్గొనను. సీఎం జగన్ ఇచ్చిన గుర్తింపు ఎప్పటికీ మర్చిపోను. నన్ను అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వబోనని చంద్రబాబు అన్నారు. కానీ జగనన్న నన్ను రెండు సార్లు MLAగా గెలిపించి ఇప్పుడు మంత్రిని చేస్తున్నారు. మహిళ పక్షపాత సీఎం కేబినెట్‌లో మంత్రిగా చేయడం నా అదృష్టం'’ అని రోజా చెప్పారు.
దాదాపు 10 ఏళ్లుగా రోజా జబర్దస్త్ షో చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమం మొదలైన నాటి నుంచి జడ్జిగా కొనసాగుతున్నారు. మొదటి నుంచి నాగబాబు నిర్మాణ సంస్థతో మనస్పర్థల వల్ల మధ్యలోనే వైదొలిగినా రోజా మాత్రం కొనసాగారు. 2019లో ఎన్నికల ప్రచారం సమయంలో కొద్ది నెలలు, శస్త్ర చికిత్స జరిగినప్పుడు కాస్త గ్యాప్ ఇచ్చినా మళ్లీ జబర్దస్త్‌లో జడ్జిగా అలరించారు. ఒక విధంగా ఆ షోకి బ్రాండ్ అంబాసిడర్ అనిపించేలా ఆమె పేరు సంపాదించారు. దానితో పాటు అదే ఛానెల్‌లో పండుగల సందర్భంగా వచ్చే స్పెషల్ ఈవెంట్లలోనూ తళుక్కున మెరిసేవారు. ఇంకా వేరే ఛానెళ్లలో రచ్చబండ, బతుకుజట్కా బండి లాంటి షోలలో కూడా పాల్గొన్నారు. తాజాగా మంత్రి పదవి దక్కడంతో టీవీ షోలకు దూరం అవుతున్నట్లు రోజా ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.