Nara Lokesh: ఈ నెల 9న బిగ్ అనౌన్స్‌మెంట్ - మంత్రి నారా లోకేశ్ సంచలన ట్వీట్
Andhra News: ఈ నెల 9న (బుధవారం) 'బిగ్ అనౌన్స్‌మెంట్' అంటూ మంత్రి నారా లోకేశ్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ఎలాంటి ప్రకటన వెలువడుతుందో అని ఉత్కంఠ నెలకొంది.
Minister Nara Lokesh Sensational Tweet: ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) మంగళవారం సంచలన ట్వీట్ చేశారు. ఈ నెల 9న 'బిగ్ అనౌన్స్‌మెంట్' అంటూ ప్రకటించారు. టాటా సన్స్ బోర్డు ఛైర్మన్ చంద్రశేఖరన్‌తో ఆయన భేటీ అయ్యారు. ఈ సమావేశం అద్భుతంగా జరిగిందంటూ హర్షం వ్యక్తం చేశారు. బుధవారం చేయబోయే భారీ ప్రకటన కోసం వేచి చూడాలంటూ ట్విట్టర్ వేదికగా ఆయన చేసిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది. ఎలాంటి ప్రకటన వెలవడుతుందనే దానిపై ఆసక్తి నెలకొంది.
📢I had a superb meeting with the Chairman of the Board of Tata Sons, Mr Natarajan Chandrasekaran today. BIG ANNOUNCEMENT tomorrow!✨ Stay tuned! 😉 @TataCompanies pic.twitter.com/FumMaBULdG
— Lokesh Nara (@naralokesh) October 8, 2024
పెట్టుబడులపై చర్చ
కాగా, టీడీపీ అధికారంలోకి వచ్చాక చంద్రశేఖరన్‌తో మంత్రి లోకేశ్ భేటీ కావడం ఇది రెండోసారి. ఆగస్ట్ 16వ తేదీన సీఎం చంద్రబాబును కలిసేందుకు సచివాలయానికి వచ్చిన ఆయనతో లోకేశ్ ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులకున్న అవకాశాలు, ప్రోత్సాహకాలను వివరించారు. ప్రధానంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్, రెన్యువబుల్ ఎనర్జీ, టెలీ కమ్యూనికేషన్స్, కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆహార ఉత్పత్తుల రంగాల్లో అభివృద్ధి సాధించడానికి అన్ని వనరులన్నాయని.. పెట్టుబడులు పెట్టాలని కోరారు. రాష్ట్రంలో రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని.. దీనికి సహకరించే అన్ని రకాల పరిశ్రమలకు తాము మెరుగైన ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు.
ఏపీలో పెట్టుబడులకు తాము సుముఖంగా ఉన్నామని.. పూర్తిస్థాయి ప్రతిపాదనలతో మరోసారి కలుస్తామని చంద్రశేఖరన్ అప్పట్లో లోకేశ్‌తో భేటీలో వెల్లడించారు. తాజాగా, మళ్లీ వీరిద్దరూ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించకుంది. ఈ క్రమంలో రాష్ట్రంలో టాటా గ్రూప్ పెట్టుబడులపైనే బుధవారం కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లోకేశ్ ట్వీట్‌పై నెటిజన్లు స్పందిస్తున్నారు. 'టీసీఎస్ కంపెనీకి, ఏపీ ప్రజలకు కంగ్రాట్స్'.. 'ఎక్స్‌లెంట్.. రేపటి కోసం వేచి చూస్తున్నాం.' 'రాష్ట్రాభివృద్ధి కోసం తండ్రి ఢిల్లీలో.. కొడుకు అమరావతిలో..' అని ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నారు.
ప్రధానితో సీఎం చంద్రబాబు భేటీ
మరోవైపు, సీఎం చంద్రబాబు ప్రధాని మోదీతో భేటీ అయ్యి కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, గడిచిన ఐదేళ్లలో విధ్వంసం గురించి ప్రధానికి వివరించినట్లు చెప్పారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు సంబంధించి ఆయన అక్కడి మీడియాతో మంగళవారం మాట్లాడారు. 'స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ గురించి ప్రధానికి వివరించా. పోలవరం డయాఫ్రం వాల్ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయి. అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధులు వచ్చేలా చూడాలని కోరాం. రాష్ట్రంలో జాతీయ రహదారుల పెండింగ్ పనుల పూర్తి, కేంద్రం నుంచి రావాల్సిన గ్యాస్ రాయితీ గురించి ప్రధానికి వివరించాను.' అని సీఎం పేర్కొన్నారు.
అలాగే, డిసెంబర్ నుంచి అమరావతిలో రోడ్లు, ఇతర నిర్మాణాలు ప్రారంభమవుతాయని చంద్రబాబు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖ రైల్వే జోన్‌కు భూమి కేటాయించామని.. రైల్వే జోన్ పనులకు త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. రద్దీ ఉన్న ప్రాంతాల్లో ఫోర్ లైన్లు వేయాలని రైల్వే మంత్రిని కోరినట్లు పేర్కొన్నారు. అమరావతి నుంచి విజయవాడకు రైల్వే లైన్, మచిలీపట్నం నుంచి రేపల్లెకు రైల్వే లైన్ కనెక్ట్ చేయాలని కోరామని అన్నారు. నర్సాపురం - మచిలీపట్నం, రేపల్లె - బాపట్ల లైన్లు ఇవ్వాలని కోరినట్లు పేర్కొన్నారు.