Minister Kakani: రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త - వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరల ప్రకటన
Minister Kakani: ఏపీ రైతులకు సీఎం జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరల ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈక్రమంలోనే మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పోస్టర్ ను ఆవిష్కరించారు.
Minister Kakani: ఆంధ్ర ప్రదేశ్ రైతులకు సీఎం జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో వ్యవసాయ సీజన్ ప్రారంభానికి ముందే రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులకు మద్ధత్తు ధరలు ప్రకటిస్తామని సీఎం జగన్ ఇచ్చిన హామీకి అనుగుణంగా వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరల ప్రకటన పోస్టర్ ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కాకాణి మాట్లాడుతూ.. రైతులకు ఇక పై పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించదన్న బెంగ లేదని అన్నారు. సీఎం జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని తెలిపారు. సీజన్ ప్రారంభానికి ముందే మద్దతు ధరలు ప్రకటించామని గర్వంగా చెప్పారు. రైతులకు కనీస గిట్టుబాటు ధర కల్పించాలన్నదే సీఎం జగన్ ఆలోచనగా తెలిపారు.
తొలిసారిగా 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశామని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. ప్రతీ రైతు భరోసా కేంద్రాన్ని ఒక వ్యాపారకేంద్రంగా మార్చామని పేర్కొన్నారు. దళారుల ప్రమేయం లేకుండా రైతు భరోసా కేంద్రాల్లోనే సీఎం యాప్ (CM APP) ద్వారా పంటలను కొనుగోలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ - క్రాప్ లో నమోదు చేసుకున్న రైతులు మంచి ధరలకు పంటలను అమ్ముకోగలుగుతున్నారని వివరించారు. ప్రతీ రైతు భరోసా కేంద్రాల్లో ఈ మద్దతు ధరల ప్రకటన పోస్టర్లను ప్రదర్శిస్తామని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.
తక్కువ పెట్టుబడి... అధిక ఆదాయం...
అలాగే గిట్టుబాటు ధర కంటే అధిక ఆదాయం పొందాలంటే సేంద్రియ వ్యవసాయ పంటల సాగు చేపట్టాలని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. పురుగు మందుల అవశేషాలు లేని వ్యవసాయ ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్ లో మంచి గిరాకీ ఉందని ఆయన తెలిపారు. తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం చేకూర్చటమే ప్రభుత్వ అంతిమ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. వ్యవసాయ, ఉద్యానవన, ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతుల అవకాశాలను పెంపొందించేందుకు రైతులు, ఎగుమతిదారులతో ప్రత్యేక వర్క్ షాప్ ను విజయవాడలో నిర్వహించారు. వర్క్ షాపును జ్యోతి ప్రజ్వలన చేసి మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ మన రాష్ట్రం వ్యవసాయ ఆధార రాష్ట్రమని, మన రాష్ట్రం నుంచి దేశంలోనే అధిక స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతులు జరుగుతున్నాయని, ఇవి మరింత ఎక్కువగా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
రైతులకు గిట్టుబాటు ధర కంటే ఎక్కువ ధర వ్యవసాయ ఉత్పత్తులకు ఇచ్చెందుకు ఎగుమతిదారులు ముందుకు రావాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి రైతన్నకు అధిక లబ్ధి చేకూర్చాలని నిరంతరం తపన పడుతున్నారని, రైతు సంక్షేమం కోసం రైతు భరోసా, యంత్రసేవా పథకం, ఆర్ బీ కేల ఏర్పాటు ఇలా విత్తనం నుండి విక్రయం వరకు రైతన్నలకు అండగా ప్రభుత్వం ప్రతి దశలోనూ నిలుస్తుందన్నారు. ఇందులో భాగంగానే మార్కెట్ యార్డ్ లను బలోపేతం చేయటానికి ఇప్పటికే ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.