Minister Atchannaidu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ
Andhra News: వైసీపీ హయాంలో ధాన్యం సేకరణ అస్తవ్యస్తమైందని.. ఇప్పుడు ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
Minister Atchennaidu Goodnews To Farmers: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రైతులు ఎలాంటి నిబంధనల అడ్డు లేకుండానే ధాన్యాన్ని అమ్ముకోవచ్చని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు (Minister Atchennaidu) తెలిపారు. సచివాలయంలో శుక్రవారం ఆయిల్ ఫామ్ రైతు సంఘం ప్రతినిధులు, కంపెనీల యాజమాన్యాలు, వ్యవసాయ, ఉద్యాన శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ లావు కృష్ణదేవరాయలు, అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. వైసీపీ హయాంలో ధాన్యం సేకరణ అస్తవ్యస్తమైందని మంత్రి మండిపడ్డారు. పంటను కొనుగోలు చేసిన 48 గంటల్లోనే అన్నదాతల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని స్పష్టం చేశారు. రైతుల నుంచి ప్రతి గింజ కొంటామని అన్నారు. అలాగే, రాష్ట్రంలో పామాయిల్ రైతులకు స్థిరమైన ధరలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఆయిల్ ఫామ్ ధరలపై
'ఆయిల్ ఫామ్ రైతుల ప్రయోజనాల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. దేశంలోనే అత్యధిక శాతం ఆయిల్ ఫాం సాగు, అత్యధిక దిగుబడి వచ్చే రాష్ట్రం మనది. మన రాష్ట్రంలోనే మన రైతులకు ఆయిల్ ఫామ్ OER ధర నిర్ణయించే పరిస్థితి తీసుకొస్తాం. రైతులకు మేలు జరిగేలా, కంపెనీలు పరిశ్రమ విస్తరించే విధంగా కృషి చేస్తాం. పామాయిల్ ధరలపై సీఎం చంద్రబాబుతో చర్చిస్తాం. గత ప్రభుత్వం రైతులను మోసం చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పామాయిల్ రైతులకు ఊరట లభించింది. అధికారంలోకి వచ్చిన 4 నెలలకే టన్ను ధర రూ.12,500 నుంచి ఏకంగా రూ.19.000కి ధర పెరిగింది.' అని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
'జగన్ పైశాచికానందం'
గత ఐదేళ్లలో ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన వారిపై కేసులు పెట్టి జగన్ పైశాచిక ఆనందం పొందాడని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తోందని అన్నారు. 'మా ప్రభుత్వంలో కక్ష సాధింపు లేదు. తప్పు చేసిన వారు ఏ పార్టీ వారైనా చట్ట ప్రకారం చర్యలు చేపడుతున్నాం. జగన్మోహన్ రెడ్డికి బుద్ధి జ్ఞానం ఉందా?. బావ స్వేచ్ఛ అంటూ జగన్ వ్యక్తి హననానికి పాల్పడుతున్నారు. భావ స్వేచ్ఛ ప్రకటన అంటూ ఆడవారిపై పోస్టులు పెడుతున్నారు. సోషల్ మీడియా పోస్టుల వల్ల పవన్ కళ్యాణ్ బాధపడ్డారు. జన్మనిచ్చిన తల్లి, చెల్లిపై కూడా తప్పుడు పోస్టులు పెట్టిన జగన్ మనిషేనా?. ఆడవారిని ఏడిపిస్తే చూస్తూ ఊరుకోం, ఖబర్దార్ జగన్!. అధికారంలో ఉన్నా లేకపోయినా మేం ప్రజా సమస్యలపై స్పందిస్తాం.' అని పేర్కొన్నారు.