Minister Ambati Rambabu: నాగార్జున సాగర్ కుడి కాలువకి నీరు విడుదల చేసిన మంత్రి అంబటి
Minister Ambati Rambabu: నాగార్జున సాగర్ కుడి కాలువకు మంత్రి అంబటి రాంబాబు నీటిని విడుదల చేశారు. మొత్తం 2 వేల క్యూసెక్కులు, పవర్ జెనరేషన్ ద్వారా మరో వెయ్యి క్యూసెక్కుల కిందకు వదిలారు.
Minister Ambati Rambabu: పల్నాడు జిల్లా మాచర్ల మండలం విజయపురిసౌత్ వద్ద ఉన్న నాగార్జున సాగర్ కుడి కాలువకి జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు నీటిని విడుదల చేశారు. తాగు మరియు సాగు అవసరాల నిమిత్తం కుడి కాలువకి 2 వేల క్యూసెక్కులు, పవర్ జనరేషన్ ద్వారా మరో వెయ్యి క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఎగువన ఉన్న కృష్ణా నది డామ్ లు అన్నీ నిండు కుండల్లా మారాయి. రాబోయే రోజుల్లో నాగార్జున సాగర్ డ్యాం కూడా నిండే అవకాశం కనిపిస్తోంది.
వరికపుడి శాల ప్రాజెక్టు అనుమతుల కోసం ఎదురుచూపులు..
ఈ క్రమంలోనే ముందుగానే సాగు, తాగు నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని నీరు విడుదల చేస్తున్నట్లు మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. భగవంతుని దయ వల్ల రాష్ట్రంలోని అన్ని డ్యాంలు జలకళను సంతరించుకున్నాయని ఆనందం వ్యకతం చేశారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని రైతులు పంటలు సాగు చేసుకోవాలని మంత్రి సూచించారు. వెల్దుర్తి మండలంలోని వరికపుడి శాల ప్రాజక్టు అనమతుల కోసం ఎదురు చూస్తూ ఉన్నామని... సాధ్యం అయినంత త్వరగా అనమతులు పొంది నిర్మాణ పనులు మొదలు పెడతాము అని అన్నారు.
మొన్నటికి మొన్న పులిచింతల ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత..
మొన్నటికి మొన్న ఇదే జిల్లాలోని అచ్చంపేట మండలం పులి చింతల ప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని విడుదల చేశారు. జలాశయం వద్ద కృష్ణమ్మకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్ రావుతో కలిసి నీటిని విడుదల చేశారు. 14వ నంబర్ గెటుకు ఒక మీటరు మేర ఎత్తి 10 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. అనంతరం ప్రాజెక్టును పరిశీలించారు. అధికారులను అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు అధికారులు పాల్గొన్నారు.
వారం రోజుల క్రితం శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత..
వారం రోజుల క్రితం శ్రీశైలం జలశాయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. జలాశయం గరిష్ట నీటి మట్టానికి చేరుకోవడంతో మూడు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. జలాశయం వద్ద ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మూడు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు.తొలుత 6వ నెంబర్ గెటు ఎత్తి 27 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. అనంతరం 7, 8 గేట్లను సైతం 10 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేశారు. అయితే మంత్రి వెళ్లిపోగానే 7, 8 గేట్లను మూసేసిన అధికారులు... కేవలం 6వ నెంబర్ గేటు ద్వారానే నీళ్లను దిగువకు వదులుతున్నారు.